సీఎం జగన్ పర్యటనలో బైరెడ్డి సిద్ధార్థ్‌కు చేదు అనుభవం

ABN , First Publish Date - 2020-02-19T23:27:38+05:30 IST

కర్నూలు జిల్లాకు చెందిన యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ఈ పేరు పరిచయం చేయనక్కర్లేదు.

సీఎం జగన్ పర్యటనలో బైరెడ్డి సిద్ధార్థ్‌కు చేదు అనుభవం

కర్నూలు : కర్నూలు జిల్లాకు చెందిన యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ఈ పేరు పరిచయం చేయనక్కర్లేదు. మరీ ముఖ్యంగా రాజకీయాల గురించి తెలిసిన వ్యక్తులకు, తెలుగు రాష్ట్రాల యువతకు ప్రత్యేకించి మరీ పరిచయం అక్కర్లేదు. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈ యువనేత.. ఒకట్రెండు నియోకవర్గాల్లో వైసీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులను గెలిపించడంలో మాత్రం కీలక పాత్ర పోషించారని చెబుతుంటారు. ఆ నియోజకవర్గాల్లో కర్నూలు జిల్లాకు చెందిన నందికొట్కూరు ఒకటి. దీంతో ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి.. ఇంతవరకూ అది జరగలేదు.!. గెలుపుకు కృషి చేశారు కానీ.. ఆయన్ను ఎవరూ లెక్కచేయట్లేదని.. ఎమ్మెల్యేకు-బైరెడ్డికి మధ్య లోలోపల గొడవలు జరుగుతున్నాయని పలుమార్లు వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా మరోసారి బైరెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.


కర్నూల్‌లో జగన్ పర్యటన!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. మూడో దశ  వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన కర్నూలులో ప్రారంభించారు. రాష్ట్రమంతటా దాదాపు రూ.1,129 కోట్లతో నిర్మించబోయే ఆరోగ్య  ఉపకేంద్రాల నమూనా భవనాన్ని పరిశీలించి.. దానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి, ఇంచార్జ్‌ మంత్రి కూడా హాజరయ్యారు. కీలక నేతలతో పాటు బైరెడ్డి సిద్ధార్థ్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. 


అసలేం జరిగింది!?

జగన్‌ను కలిసేందుకు వెళ్లిన బైరెడ్డిని సీఎం సెక్యూరిటీ అడ్డుకుంది. ఈ క్రమంలో మరోసారి సీఎం కాన్వాయ్ ముందు నడుచుకుంటూ వెళ్తున్న ఆయన్ను సీఎం సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు. సిబ్బందిలో ఒకరైతే ఆయన్ను తోసుకుంటూ కూడా వెళ్లారు. దీంతో ఆగ్రహానికి లోనైన బైరెడ్డి సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు. అయితే అటుగా వచ్చిన కొందరు నేతలు అటు సెక్యూరిటీ సిబ్బందికి.. ఇటు బైరెడ్డికి నచ్చచెప్పి పంపడంతో వివాదం సద్దుమణిగింది. అయితే.. ఈ వ్యవహారంపై బైరెడ్డి అభిమానులు, అనుచరులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బైరెడ్డిని అడ్డుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.







Updated Date - 2020-02-19T23:27:38+05:30 IST