కారు దిగని సీఎం.. Jaganను చూద్దామని వచ్చిన అభిమానులకు నిరాశ..!

ABN , First Publish Date - 2021-12-22T15:56:57+05:30 IST

జగనన్నను చూద్దామని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదా మని ఎదురుచూసిన అభిమాను లకు నిరాశే ఎదురైంది....

కారు దిగని సీఎం.. Jaganను చూద్దామని వచ్చిన అభిమానులకు నిరాశ..!

  • లోపలి నుంచే అభివాదం


ఏలూరు/తణుకు (పశ్చిమ గోదావరి) : జగనన్నను చూద్దామని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదా మని ఎదురుచూసిన అభిమాను లకు నిరాశే ఎదురైంది. ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డి తణుకు పర్యటన సందర్భంగా తణుకు, నిడదవోలు, ఆచంట, తాడేపల్లిగూడెం, భీమవరం, కొవ్వూరు, ఉంగుటూరు తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఉదయం నుంచి తణుకు చేరుకున్నారు. వచ్చిన వారు గంటల తరబడి బారికేడ్ల చాటున నిలబడి వేచి చూశారు. తణుకు మహిళా కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో హెలిప్యాడ్‌ వద్దకు హెలికాప్టర్‌లో 11.15 గంటలకు సీఎం చేరుకున్నారు. ఆయనకు జిల్లాలోని పెద్దలు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు.


అక్కడి నుంచి కారులో సీఎం నేరుగా బాలురు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభాస్థలికి ఊరేగింపుగా వెళతారని ముందుగా చెప్పారు. దీంతో ఎన్టీఆర్‌ పార్క్‌, మున్సిపల్‌ కార్యాలయం, నరేంద్ర సెంటర్‌ కూడలి వెంబడి సభాస్థలి వరకు ఏర్పాటు చేసిన బారికేడ్లకు అవతల దారి పొడవునా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఉదయం తొమ్మిది గంటలకే అక్కడకు చేరుకున్నారు. వలంటీర్లు బస్సుల్లో తీసుకువచ్చిన జనంతో రోడ్డంతా నిండిపో యింది. సీఎం రాక కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే సీఎం కాన్వాయ్‌ రయ్‌మంటూ తమ కళ్ల ముందే దూసుకుపోయింది.


అయితే సీఎం ఎక్కడా ఆగలేదు. కారులో నుంచి అసలు బయటకే రాలేదు. కనీసం కారు అద్దాలు దించకుండానే అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు. దీంతో గంటల తరబడి వేచి ఉన్న ప్రజలు నిరాశకు గురయ్యారు. సభా ప్రాంగణానికి వెళ్లకుండానే చాలా మంది మహిళలు, వృద్ధులు పిల్లలు అక్కడ నుంచి వెనుదిరిగారు. గంటల తరబడి వేచి చూస్తే.. కనీసం ఆయన ముఖం చూసే అవకాశం కూడా లేకుండా చేశారని పలువురు వాపోయారు. ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలో అడుగడుగునా పిలిచి మరీ పలకరించారని, ఇప్పుడు కనీసం ముఖం కూడా చూపించలేదని పలువురు మహిళలు చెప్పారు.

Updated Date - 2021-12-22T15:56:57+05:30 IST