వైపీసీకి పుట్టగతులుండవ్‌

ABN , First Publish Date - 2021-10-23T04:30:19+05:30 IST

వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వైసీపీకి పుట్టగతులుండవని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి అన్నారు.

వైపీసీకి పుట్టగతులుండవ్‌
నారా చంద్రబాబునాయుడికి సంఘీభావం తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి

చంద్రబాబునాయుడు దీక్షకు బీసీ, బుడ్డా మద్దతు 

బనగానపల్ల్లె, అక్టోబరు 22: వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వైసీపీకి పుట్టగతులుండవని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి అన్నారు. మంగళగిరి కేంద్ర టీడీపీ కార్యాలయంలో టీడీపీ కార్యాలయాలపై, వైసీపీ నాయకులపై దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న దీక్షలకు బీసీ జనార్దనరెడ్డి శుక్రవారం మద్దతు తెలిపారు. మంగళగిరిలో చంద్రబాబు చేపట్టిన నిరసన  దీక్షా శిబిరానికి బీసీ చేరుకొని చంద్రబాబును కలుసుకొని దీక్షకు సంఘీభావం తెలిపారు.  భవిష్యతలో ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ పోలీసు అధికారులను డిమాండ్‌ చేశారు. 

ఆత్మకూరు:  మాజీ సీఎం చంద్రబాబు చేపట్టిన దీక్షకు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి తన అనుచరులతో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా రాజకీయ పార్టీ కార్యాలయాలపై వైసీపీ గుండాలు దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి రామ్‌ ఇంటిని ధ్వంసం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ్దమని మండిపడ్డారు. సీఎం జగన నియంతృత్వ పోకడలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.  

  ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం

ఆత్మకూరు(వెలుగోడు): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెబుతారని వెలుగోడు టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు అన్నారపు శేషిరెడ్డి, ఖలీల్‌ఖాన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం చంద్రబాబు చేస్తున్న 36గంటల ఉగ్రవాద పోరు దీక్షకు సంఘీభావం తెలుపుతూ శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.  ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన రౌడీరాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ప్రజలందరు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అరాచక పాలన కొనసాగిస్తూ జనాగ్రహదీక్షలను చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు హిదాయతఖాన, మోమిన రసూల్‌, వజీర్‌, సయ్యద్‌, పుల్లయ్య, రాజా ఆచారి, రమణ, ధూపం రమణ, మజీద్‌ఖాన, హుసేన  తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-10-23T04:30:19+05:30 IST