లైవ్‌స్ట్రీమ్‌లో మరణించిన యువతి.. యూట్యూబర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష

ABN , First Publish Date - 2020-12-05T23:12:19+05:30 IST

రష్యాలోని పాపులర్ యూట్యూబర్ స్టాస్ రీఫ్లేకు అక్కడి కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అధికారులు

లైవ్‌స్ట్రీమ్‌లో మరణించిన యువతి.. యూట్యూబర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష

మాస్కో: రష్యాలోని పాపులర్ యూట్యూబర్ స్టాస్ రీఫ్లేకు అక్కడి కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టాస్ రీఫ్లే లైవ్‌స్ట్రీమ్‌ స్టంట్‌లో భాగంగా తన గర్ల్‌ఫ్రెండ్‌ వాల్యా గ్రిగోర్యేవాను లోదుస్తులతో మైనస్ డిగ్రీల చలిలో బలవంతంగా నిలబెట్టాడు. దాదాపు అరగంట సేపు కేవలం లోదుస్తులతో గడ్డ కట్టుకుపోయే చలిలో ఉండటంతో వాల్యా స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను వెంటనే ఇంటి లోపలికి తీసుకొచ్చిన స్టాస్ రీఫ్లే ఆమె ఊపిరి తీసుకోవడం లేదని గుర్తించాడు. వెంటనే వైద్యులకు సమాచారమిచ్చాడు. అక్కడకు చేరుకున్న వైద్యులు, పోలీసులు వాల్యా మరణించినట్టు గుర్తించారు. వాల్యా మరణించిన రెండు గంటల తరువాత కూడా ఈ లైవ్‌స్ట్రీమ్ నడుస్తూనే ఉంది. వాల్యా మరణించడంతో పోలీసులు స్టాస్ రీఫ్లేను అరెస్ట్ చేశారు. 


వీడియో మొదలైన సమయంలో స్టాస్ రీఫ్లే తన గర్ల్‌ఫ్రెండ్‌ను గాయపరిచాడని.. ఆమెకు నరకం చూపించాడని వీడియో చూసిన వారు సాక్ష్యం చెప్పారు. అంతేకాకుండా వాల్యా గర్భవతి అని వివరించారు. దీంతో గర్ల్‌ఫ్రెండ్ చావుకు స్టాసీనే కారణమని నిర్థారించిన కోర్టు అతడికి 15 ఏళ్ల జైలుశిక్షను విధించింది. ఇక ఈ ఘటనపై యూట్యూబ్ సంస్థ స్పందిస్తూ.. వీడియోను, చానల్‌ను వెంటనే తొలగిస్తున్నట్టు వెల్లడించింది. ఇలాంటి వీడియోలకు, చానళ్లకు యూట్యూబ్‌లో స్థానం లేదని తెలిపింది. అయితే యూట్యూబ్ సంస్థ ఇటువంటి వీడియోలను లైవ్ స్ట్రీమ్ చేసేందుకు అనుమతించడంపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై కూడా సెన్సార్‌షిప్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-12-05T23:12:19+05:30 IST