మెషిన్‌ లెర్నింగ్‌తో ముప్పు!

ABN , First Publish Date - 2020-08-22T19:38:30+05:30 IST

యూట్యూబ్‌లో మీకు ఎలాంటి వీడియోలు చూపించాలో యూట్యూబ్‌కు బాగా తెలుసు! స్మార్ట్‌టీవీ ఆన్‌ చేస్తే ఎలాంటి వీడియో కంటెంట్‌ చూపించాలి అన్నది అదే నిర్ణయిస్తుంది.

మెషిన్‌ లెర్నింగ్‌తో ముప్పు!

యూట్యూబ్‌లో మీకు ఎలాంటి వీడియోలు చూపించాలో యూట్యూబ్‌కు బాగా తెలుసు! స్మార్ట్‌టీవీ ఆన్‌ చేస్తే ఎలాంటి వీడియో కంటెంట్‌ చూపించాలి అన్నది అదే నిర్ణయిస్తుంది. అంతెందుకు, ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేస్తే మీకు వేల సంఖ్యలో స్నేహితులు ఉన్నా, ఎవరెవరి పోస్టులు మాత్రమే చూపించాలి అన్నది ఫేస్‌బుక్‌ నిర్ణయిస్తుంది. దీనికంతటికి కారణం మెషిన్‌ లెర్నింగ్‌.


అల్గారిథమ్స్‌... ఇది సాంకేతిక పదం కాదు.. ఇప్పుడు మన జీవితాలను మనవి కాకుండా చేస్తున్న సాంకేతికత! మన జీవితం, మన ఆలోచనలు మన చేతిలో నుంచి టెక్నాలజీ చేతిలోకి వెళ్లిపోతున్న ప్రమాదకర పరిణామం. నచ్చిన కంటెంట్‌ ఇది భలే చూపిస్తోందే అని చాలామంది సంబరపడిపోతూ ఉంటారు. టెక్నాలజీని తెగ మెచ్చేసుకుంటారు. కానీ తమ ఆలోచనలు, వ్యక్తిత్వం మొత్తాన్ని మెషిన్‌ లెర్నింగ్‌ ఆల్గారిథమ్స్‌ సమూలంగా మార్చేస్తున్నాయని గ్రహించలేకపోతారు.


ప్రొఫైలింగ్‌

యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి దాదాపు అన్ని టెక్నాలజీ కంపెనీలు చాలా కాలంగా మెషిన్‌ లెర్నింగ్‌ పద్ధతులు అనుసరిస్తున్నాయి. సంబంధిత సర్వీసుల్లో మీరు అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవడం ఆలస్యం.. అవి ఎప్పటికప్పుడు నిశితంగా మీరు ఎలాంటి వీడియోలు ఎంత సమయం చూస్తున్నారు? ఏ వీడియోలు, పోస్టుల దగ్గర ఆగకుండా ముందుకు కదులుతున్నారు? అనే సమాచారం మొత్తాన్ని ‘హీట్‌ మ్యాప్స్‌’ అనే ఏర్పాటు ద్వారా మీకు తెలియకుండానే విశ్లేషిస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మెషిన్‌ లెర్నింగ్‌ నిరంతరం మీ ఇష్టాయిష్టాలను గమనిస్తూ మీ గురించి నేర్చుకుంటూ ఉంటుంది. ఇకమీదట సరిగ్గా మీకు నచ్చే కంటెంట్‌ యూట్యూబ్‌ రికమండేషన్స్‌ రూపంలో, ఫేస్‌బుక్‌ న్యూస్‌ఫీడ్‌లో చూపిస్తుంది.


సామూహిక హైజాక్‌!

కేవలం ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలు మాత్రమే కాదు.. సామూహికంగా ఒక నగరంలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో అధిక శాతం మంది ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వినియోగదారులు ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారు అన్నది కూడా ‘ట్రెండింగ్‌’ రూపంలో మన ముందుకు తీసుకురాబడుతుంది. అంటే సమాజం మొత్తం మంచి విషయాలు పక్కన పెట్టి సంచలనాత్మక విషయాలు చూస్తూ కూర్చున్నారు అనుకుందాం. మీకు అలాంటి కంటెంట్‌ వద్దు అనుకున్నా తప్పించుకోటానికి లేకుండా అది ‘ట్రెండింగ్‌’ అనే విభాగంలో మీ దృష్టికి బలవంతంగా తీసుకురాబడుతుంది. అంటే మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కావచ్చు, సమాజం మొత్తం చేసే బలహీన ఆలోచనలు కావచ్చు.. అవి మీరు తెల్లారి లేచింది మొదలు కొన్ని వందల సార్లు ఓపెన్‌ చేసే ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి యాప్స్‌లో ప్రతిఫలిస్తుంటాయి. దాంతో వ్యక్తులు తమ ప్రాధాన్యతలు మర్చిపోయి ఇలాంటి మాయలో పూర్తిగా మునిగిపోతారు.


నష్టం ఏంటంటే?

మెషీన్‌ లెర్నింగ్‌ ఆల్గారిథమ్స్‌ మనకేం కావాలో నిర్ణయించి మన ఆలోచనలను ప్రభావితం చేయటం,  సొంతంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను హరించడం వల్ల నిర్ణయాత్మక శక్తి సన్నగిల్లుతుంది. తన జీవితానికి ఏమాత్రం ముఖ్యం కాని విషయాన్ని కూడా అతి ముఖ్యమైనదిగా భావిస్తాడు. 


దీన్ని అడ్డుకోవడం ఎలా?

ఈ సోషల్‌ మీడియా ట్రాప్‌ నుంచి బయటపడాలంటే కొన్ని సెట్టింగ్స్‌ మార్చుకోండి. మీ ఫోన్‌లో యూట్యూబ్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ చేసి, అందులో సెట్టింగ్స్‌లో ‘సెర్చ్‌ హిస్టరీ, వాచ్‌ హిస్టరీ’ అనే వాటిని డిసేబుల్‌ చేయండి. ఇకమీదట మీకు చాలా వరకు  రికమండేషన్స్‌ నిలిచిపోతాయి. అలాగే యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ‘ఇదేదో ఆసక్తికరంగా ఉందే’ అని ఒక వీడియో దగ్గర ఎక్కువ సేపు ఆగకండి. మీకు కావలసిన కంటెంట్‌ కోసం మీరే సెర్చ్‌ చేయండి. యూట్యూబ్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో మీకు పైకి కనిపించని మీ జీవితాలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన వీడియోలు, పోస్టులు, ఫాలో కావలసిన వ్యక్తులు కూడా ఉంటారు, వారిని మీకు మీరుగా వెతికి పట్టుకోండి.. మీకేం కావాలో నిర్ణయించాల్సింది మెషిన్‌ కాదని గుర్తుపెట్టుకోండి. 


వ్యక్తిత్వం మారిపోతుంది!

మీరు సంచలన విషయాల జోలికి వెళ్లకుండా జీవితం పట్ల స్పష్టమైన ఆలోచనలు ఉండి, ప్రొడక్టివ్‌గా బతికే ఆలోచనలు కలిగిన వారనుకుందాం! పొరబాటున చైనాకి, ఇండియాకి మధ్య దశాబ్దాలుగా ఏం జరుగుతోంది అన్న వీడియోను మీరు యూట్యూబ్‌లో వెతికారు అనుకోండి. అది అనేక వీడియోలు చూపిస్తుంది. మీరు రెండు మూడు వీడియోలు చూస్తారు. అంతటితో ఆ విషయం మర్చిపోతారు. కానీ యూట్యూబ్‌ దాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటుంది. ఇక యూట్యూబ్లోకి మీరు ఎప్పుడు వెళ్ళినా ఇండియా, చైనా గురించి విభిన్నమైన వీడియోలు మీ దృష్టికి రికమండేషన్స్‌ రూపంలో చూపిస్తుంది. గతంలో ఆ సమాచారాన్ని మీరు ఇష్టపడ్డారు కాబట్టి, సహజంగానే మీ మెదడులో దానికి సంబంధించిన ఒక న్యూరల్‌ నెట్‌వర్క్‌ సృష్టించబడి ఉంటుంది కాబట్టి, ఇలా చూపించబడే కొత్త వీడియోలను కూడా మీరు రెండో ఆలోచన లేకుండా చూస్తారు. అంటే ఇక్కడ మీకు తెలియకుండానే మీ ప్రొడక్టివ్‌ టైం మొత్తాన్ని పక్కన పెట్టి చైనా, ఇండియా అనే అంశం దగ్గర ఇరుక్కుపోయారు. మీరు ఆశావహ దృక్పథం ఉన్న వ్యక్తి అనుకోండి.. గాసిప్స్‌ చూడడం ఇష్టం లేదు అనుకోండి. పొరపాటున ఏదో ఒక రోజు ఒకటి రెండు నెగిటివ్‌ వీడియోలు, గాసిప్స్‌ వీడియోలు చూశారు అనుకోండి. అపఁటినుండి అలాంటి కంటెంట్‌ మళ్లీ మళ్లీ చూపించబడుతుంది. దాంతో మెల్లగా మీ వ్యక్తిత్వం మొత్తం ‘వేరే వాళ్ల జీవితం గురించి మనకెందుకు?’ అనేది కాస్తా మారిపోయి, ‘వాళ్ల జీవితంలో ఏం జరిగింది, వీళ్ల జీవితంలో ఏం జరిగింది’ లాంటి గాసిప్‌ వీడియోలు చూడటం మొదలు పెడతారు.


నల్లమోతు శ్రీధర్

fb.com/nallamothu sridhar

Updated Date - 2020-08-22T19:38:30+05:30 IST