అమెరికా సెసెటర్‌కు షాకిచ్చిన యూట్యూబ్

ABN , First Publish Date - 2021-06-13T04:03:28+05:30 IST

అమెరికా పెద్దల సభ సెనెట్ సభ్యుడు రాన్ జాన్సన్‌కు యూట్యూబ్ తాజాగా షాకిచ్చింది.

అమెరికా సెసెటర్‌కు షాకిచ్చిన యూట్యూబ్

వాషింగ్టన్: అమెరికా పెద్దల సభ సెనెట్ సభ్యుడు రాన్ జాన్సన్‌కు యూట్యూబ్ తాజాగా షాకిచ్చింది. కరోనా చికిత్సలపై ఆయన అప్‌లోడ్ చేసిన వీడియో కారణంగా రాన్ జాన్సన్ ఛానల్‌ను వారం పాటు బ్లాక్ చేసింది. కరోనాకు ప్రత్యామ్నాయ చికిత్సలపై తన యూట్యూబ్ ఛానల్‌లో రాన్ ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవరమెక్టిన్ ఔషధాలపై తన వీడియోలో చర్చించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన యూట్యూబ్ ఆ ఛానల్ కార్యకలాపాలను వారం పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ‘‘కరోనా చికిత్సకు ఐవర్‌మెక్టిన్ లేదా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాలను వాడాలంటూ ప్రజలను ప్రోత్సహించే వీడియోలను మేము యూట్యూబ్‌లో అనుమతించలేం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా..యూట్యూబ్ నిర్ణయంపై జాన్సన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. యూట్యూబ్‌కు ఉన్న అపరిమిత, ఎవరీకీ జవాబుదారీ కానీ సెన్సార్ అధికారాలను ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది అని మండిపడ్డారు. ఇటీవల కాలంలో వివిధ దేశాల్లోని పలు ప్రముఖలు సోషల్ మీడియా ఎకౌంట్లు నిషేధానికి గురవుతుండటంతో..భావప్రకటనా స్వేఛ్చ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రజల నోరు నొక్కే అపరిమిత అధికారాలు సోషల్ మీడియా వేదికలు సంపాదించాయనే విమర్శలు అధికమవుతున్నాయి. 

Updated Date - 2021-06-13T04:03:28+05:30 IST