Abn logo
May 5 2021 @ 00:00AM

కరోనాపై యువ సమరం

ఓ అరవై మంది యువతీయువకులు. కొన్ని రోజుల కిందటి వరకు ఎవరికి ఎవరూ తెలియదు. కానీ ఓ మంచి పని కోసం అంతా ఒక్కటయ్యారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆపదలో ఉన్నవారికి సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు అత్యవసర సమాచారం అందిస్తూ... ప్రాణాలు నిలబెడుతున్నారు.


ఏప్రిల్‌ 17... లఖనవూకు చెందిన అరవై ఐదేళ్ల పాత్రికేయుడు వినయ్‌ శ్రీవాస్తవ ఆక్సిజన్‌ అందక మరణించారు. కరోనా వైరస్‌ సోకిన ఆయన ఆఖరి నిమిషం వరకు దిగజారుతున్న తన పరిస్థితిని ట్విటర్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూ... ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ సాయం కోసం అభ్యర్థిస్తూనే ఉన్నారు. ఇరవై గంటలపాటు మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు ఊపిరి వదిలారు. 


ఈ హృదయవిదారక ఘటన ఇరవై ఏళ్ల నైరిత్‌ గాలాను దిగ్ర్భాంతికి గురి చేసింది. ‘‘అది తలుచుకున్నప్పుడల్లా నాలో వణుకు పుడుతుంది. కళ్లముందే ఒక ప్రాణం పోతుంటే ఏమీ చేయలేకపోయినందుకు నాపై నాకే కోపం వచ్చింది. ఇక వాళ్ల కుటుంబం ఎంతటి బాధను అనుభవించి ఉంటుంది! అత్యవసర సేవలు అందక ఇలా ఇంకెవరూ బలి కాకూడదు! దానికి ఏంచేయాలి? ఈ ఆలోచన నాకు నిద్దర పట్టనివ్వలేదు’’ అంటున్న నైరిత్‌ ఉండేది ముంబయి మహానగరంలో. 


డేటాబేస్‌తో సిద్ధం... 

‘‘ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని కుదిపేస్తోంది. ఆరోగ్య వ్యవస్థపై మునుపెన్నడూ లేనంత భారం పడుతోంది. మరోపక్క కరోనా బాధితులు ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ప్లాస్మా తదితర కొవిడ్‌ అత్యవసర సేవల సాయం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకొంటున్నారు. ఎక్కడ ఏమేమి అందుబాటులో ఉన్నాయో తెలియని అయోమయ పరిస్థితి. ఇలాంటివారికి సాయపడాలనుకున్నాను. ముందుగా సాయం అడిగినవారికి తగిన సమాచారంతో రీట్వీట్‌ చేయడం ప్రారంభించాను. కానీ ఈ మాత్రం సరిపోదని ఒకటి రెండు రోజుల్లోనే అర్థమైంది. అందులో భాగంగా ఎక్కడెక్కడ ఏఏ సేవలు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం సేకరించి ఒక డేటాబేస్‌ తయారు చేశాను. అత్యవసరమనుకున్న వారికి సంబంధిత సమాచారాన్ని ట్విటర్‌ ద్వారా అందించాను’’ అంటూ చెప్పుకొచ్చాడు నైరిత్‌. 


చేయి చేయి కలిసింది... 

సొంతంగా సిద్ధం చేసిన డేటాబేస్‌ ద్వారా సేవలు అందిస్తున్న నైరిత్‌కు ట్విటర్‌లో ఇరవై ఏళ్ల అనుష్కా జైన్‌ పరిచయమైంది. ఆమెది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌. అప్పటికే తను కూడా నైరిత్‌లా కొవిడ్‌ బాధితులకు అత్యవసర సమాచారం అందిస్తోంది. అనుష్క ఈ కార్యక్రమం చేపట్టడం వెనక అంతులేని విషాదం ఉంది. తనకు అత్యంత సన్నిహితులైన బంధువులు నలుగురిని కరోనా పొట్టనపెట్టుకుంది. 

‘‘ట్విటర్‌ ద్వారా బాధితులు సాయం కోసం అభ్యర్థిస్తున్నారంటే దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమైంది. వెంటనే అలాంటివారికి రీట్వీట్‌ చేయడం మొదలుపెట్టాను. సాధ్యమైనంతమందికి సమాచారం అందించాను. కానీ ఒకటా రెండా... వందలు... వేలు. ఎన్ని రీట్వీట్స్‌ చేసినా ఇంకా ఎన్నో మిగిలిపోతున్నాయి. అలాకాకుండా సాయం కోరినవారందరికీ సరైన సమాచారం అందించాలంటే నా ఒక్కదానివల్ల కాదని గ్రహించాను’’ అంటూ అనుష్క ఆవేదనగా చెబుతుంది. 


అనూహ్య స్పందన... 

నైరిత్‌, అనుష్కల దారి ఒక్కటే కావడంతో ఇద్దరూ కలిసి ఆలోచించడం మొదలుపెట్టారు. మరింత ప్రభావంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా తమకు మరింత మంది సాయం కావాలంటూ నైరిత్‌ ట్వీట్‌ చేశాడు. దానికి ఊహించని స్పందన వచ్చింది. ఇద్దరితో ప్రారంభమైన ఈ జట్టులో ఇప్పుడు దేశంలోని వివిధ నగరాలకు చెందిన 60 మందికి పైగా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. వీరంతా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువతీ యువకులే! అప్పటివరకు ఒకిరితో ఒకరికి ఎలాంటి పరిచయం లేకపోయినా ఒక మంచి పని కోసం ఒక్కటయ్యారు. 


బృందాలుగా విడిపోయి... 

ఈ అరవై మంది వివిధ జట్లుగా విడిపోయారు. ఒక జట్టు సాయం అడిగేవారిపై దృష్టి పెడుతుంది. ఇంకో బృందం ఎక్కడ ఎన్ని బెడ్లు ఖాళీలున్నాయో... ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, అంబులెన్స్‌, ప్లాస్మా వంటి సేవలు ఆ సమయంలో ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో కచ్చితమైన వివరాలు సేకరించి డేటా సిద్ధం చేస్తుంది. మరో జట్టు తమ వద్దనున్న డేటాను నిర్థారించుకుని కోరినవారికి సమాచారం అందిస్తుంది. ఈ డేటానంతటినీ గూగుల్‌ డ్రైవ్‌లో మెయింటెయిన్‌ చేస్తున్నారీ యువత. 


అదీ సరిపోలేదు... 

యుద్ధ ప్రాతిపదికన ఇంత కష్టపడుతున్నా సాయం అడిగినవారిలో చాలామంది మిగిలిపోతూనే ఉన్నారు. ఇది నైరిత్‌, అనుష్కలను మళ్లీ ఆలోచనలో పడేసింది. ‘‘దీనికి పరిష్కారంగా ట్విటర్‌లో బాట్‌ క్రియేట్‌ చేయాలని నిర్ణయించాం. అయితే దానికి కొంత టెక్నికల్‌ సపోర్ట్‌ కావాలి. మా టీమ్‌లో కొంతమంది సహకారంతో రెండు మూడు గంటల్లో అది కూడా సిద్ధమైపోయింది. బాట్‌వల్ల ప్రయోజనం ఏమిటంటే... మా దగ్గరున్న డేటాబేస్‌ ఆధారంగా సాయం కోరినవారికి కావల్సిన సమాచారంతో ఆటోమేటిక్‌గా రిప్లై వెళ్లిపోతుంది. ఇది ప్రారంభించిన 14 గంటల్లో 15 వందల రిక్టెస్ట్స్‌ మాకు వచ్చాయి’’ అంటున్న అనుష్క కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చదువుతోంది. 


చదువుకొంటూనే... 

ఈ వాలంటీర్లలో అత్యధికులు విద్యార్థులే. పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు కొందరు... అసైన్‌మెంట్లలో తలమునకలైనవారు ఇంకొందరు... కానీ ఒకపక్క అవి చేసుకొంటూనే మరోపక్క కరోనా బాధితుల కోసం పనిచేస్తున్నారు. ‘‘మా బృందంలో ముగ్గురికి కరోనా సోకింది. మరికొందరి కుటుంబ సభ్యులు వైరస్‌ బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయినా కొంత సమయాన్ని సమాజం కోసం వెచ్చిస్తున్నారు. కొంతమందయితే రోజుకు 12 గంటలు మా ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తున్నారు’’ అంటూ తమ జట్టు గురించి గొప్పగా చెబుతాడు నైరిత్‌. అతడు ఎంబీయే చేస్తున్నాడు. 


సొంతవారిని కోల్పోయిన ఆవేదన... 

అంకితభావంతో పనిచేస్తున్న వాలంటీర్లు.... అడిగినవారికి సాయం చేయలేకపోయినా, సాయం అందించే లోపే ఎవరైనా మరణించినా తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. కొందరైతే సొంతవారిని పోగొట్టుకున్నంతగా ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ‘‘ఒకరికి సాయం చేస్తున్నామంటే... వారి జీవితం నిలబడాలని ఎంతో కోరుకొంటాం. కానీ వారు చనిపోతే... ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కూడా మాకు తెలియడంలేదు. ఏప్రిల్‌ 21న మా స్నేహితుడొకరు తన తల్లికి ఐసీయూ బెడ్‌ కోసం వెతుకుతున్నాడు. నేను సమాచారం సేకరించి ఇచ్చేలోపే ఆమె చనిపోయారన్న వార్త విన్నాను. నా గుండె పగిలిపోయింది. ఆ రోజంతా ఏ పనీ చేయలేకపోయాను’’ అంటూ ఆవేదనగా చెబుతుంది అనుష్కా జైన్‌. ప్రస్తుతం ట్విటర్‌ వేదికగా పనిచేస్తున్న ఈ వాలంటీర్ల బృందం త్వరలో ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. తద్వారా మరింతమందికి తమ సేవలు చేరవేయాలన్నది వీరి సంకల్పం. Advertisement
Advertisement
Advertisement