కరోనా గుప్పిట్లో యువత

ABN , First Publish Date - 2020-07-04T08:13:41+05:30 IST

యుక్త వయసులో ఉన్నవారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వైర్‌సలు, బ్యాక్టీరియాలు దాడిచేసినా తట్టుకునే శక్తి ఉంటుంది.

కరోనా గుప్పిట్లో యువత

బాధితుల్లో 62% మంది వారే

చిన్నారుల పరిస్థితీ ఆందోళనకరం

ముందు జాగ్రత్తలతో వృద్ధులు సేఫ్‌.. తగ్గుముఖం పట్టిన రికవరీ రేటు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): యుక్త వయసులో ఉన్నవారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వైర్‌సలు, బ్యాక్టీరియాలు దాడిచేసినా తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి.. కరోనా వారిని ఏమీ చేయలేదు అనుకుంటున్నారా? కానీ అదే ప్రమాదకర ఆలోచన అంటున్నారు వైద్యులు. కరోనా బాధితుల్లో యువతరమే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కరోనా కేసులు వెలుగుచూసిన తొలిరోజుల్లో వయోవృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని, వారు చాలా సెన్సిటివ్‌ అంటూ అప్రమత్తం చేశారు. అయితే, కరోనా ఇప్పుడు యువతరాన్ని గుప్పిటపట్టింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో యువతీ యువకులు 62.52శాతం ఉన్నారు. శుక్రవారం నాటికి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 16,097 నమోదయ్యాయి.


తాజా గణాంకాల ప్రకారం ఇందులో 16-45ఏళ్ల వారు 10,064 మంది,. 46-60 ఏళ్ల వారు 20.34ు(3,274) మంది, 60ఏళ్లు పైబడిన వారు, వయోవృద్ధు లు 9.96ు మంది(1,603) మంది ఉండగా, 15ఏళ్ల లోపు పిల్లలు 7.18% మంది(1,156) ఉన్నారు. కరోనా ముప్పునకు గురవుతున్న వారిలో అత్యధికులు యువకులే ఉండటం ఆందోళనకర పరిణామం అని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ‘కరోనా కేసులు వెలుగుచూసిన తొలిరోజుల్లో ముప్పంతా 50 ఏళ్లు ఆపైన వయసున్నవారికే ఉంటుందని, ప్రమాద తీవ్రత ఎక్కువ గా ఉంటుందని అంచనా వేశాం. అందుకే వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ముందస్తు జాగ్రత్తలు వారిని వైరస్‌ ముప్పు నుంచి చాలా మేరకు కాపాడగలుగుతున్నాయి. అయితే, యువతరం విషయంలో అంచనాలకు అందని కేసులు నమోదవుతున్నాయి.


మొత్తం కేసుల్లో 62.52% వారే ఉండటం అత్యంత ఆందోళనకర అంశం. ఇప్పుడు ముప్పు ఉన్నవారిలో అత్యధికులు వారే కాబట్టి ఇకపై అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీయ జాగ్రత్తలే వారిని వైరస్‌ నుంచి కాపాడుతాయి. ఇదే సమయంలో చిన్నారు, వయోవృద్ధులు కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్‌ ముప్పు యువతరంలో ఎక్కువగా ఉన్నపటికీ వారిలోనే రికవరీ రేటు భారీగా ఉంది. ఇదొక్కటే ఈ విషయంలో సానుకూల అంశం. అస్తమా, శ్వాసకోశ సంబంధ సమస్యలకు తోడు ఇతర రుగ్మతలు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సీనియర్‌ వైద్యాధికారి ఒకరు చెప్పారు. 


పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు

రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అదేసమయంలో డిశ్చార్జి అయ్యేవారి సంఖ్య తగ్గిపోతుంది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 53.71% ఉంటే, డిశ్చార్జి అయ్యేవారి సంఖ్య 45.07 శాతానికి తగ్గిపోయింది. రెండు వారాల కిందటి వరకు ఇది 50 శాతంపైనే కొనసాగింది. 


లక్షలో 324 మందికి వైరస్‌ 

దేశవ్యాప్త గణాంకాల ప్రకారం ప్రతి లక్ష మందికి పరీక్షలు చేయగా 474 మందికి పాజిటివ్‌ అని తేలుతోంది. ఏపీలో ఈ సంఖ్య 324గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. ఇక, పాజిటివ్‌గా తేలిన ప్రతి 100 కేసుల్లో 54 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. సగటున రోజుకు 7% పైనే కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళనకర పరిణామమని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-07-04T08:13:41+05:30 IST