Bike పై ఈ కుర్రాడు చేసిన పనికి పోలీసులు ఊహించని షాక్.. ఒక్కసారిగా...!

ABN , First Publish Date - 2021-12-08T18:47:21+05:30 IST

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి కొందరు యువత చిత్రవిచిత్ర పనులు చేసేస్తున్నారు...

Bike పై ఈ కుర్రాడు చేసిన పనికి పోలీసులు ఊహించని షాక్.. ఒక్కసారిగా...!

కాన్పూర్ : సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి కొందరు యువత చిత్రవిచిత్ర పనులు చేసేస్తున్నారు. వీడియోలు చేసి కొందరు లైక్‌లు ఎక్కువగా సంపాదించి.. ఏదో సాధించేశామనే ఫీలింగ్.. ఇంకొందరు ఫాలోయింగ్ సంపాదించి.. పాపులర్ అయిపోయామనే ఫీలింగ్‌.. ఇదీ ప్రస్తుతం పరిస్థితి. అయితే.. కొన్ని వీడియోలు లేనిపోని చిక్కులు కూడా తెచ్చిపెడుతున్నాయి. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌, కళ్యాణ్‌పూర్‌లోని మస్వాన్‌పూర్ ప్రాంతానికి చెందిన ఖలీద్ అనే యువకుడు బైక్‌పై చేసిన ఓ వీడియోకు ఎంత పాపులర్ అయ్యాడో.. అంతకుమించిన రీతిలో పోలీసులు ఊహించని షాకే ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆ యువకుడు ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.


ఆహా.. ఓహో.. చివరికిలా..!

ఖలీద్‌కు డ్యాన్స్ అంటే పిచ్చి. అయితే ఆ డ్యాన్స్ చేయాల్సిన చోట చేయకుండా.. రోడ్డుపై అదికూడా రన్నింగ్‌లో ఉన్న బైక్‌పై డ్యాన్స్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. బాలీవుడ్ హీరో గోవింద హీరోగా వచ్చిన ‘క్యోన్’ సినిమాలోని ‘ఏక్ లడ్‌కీ చాహీయే ఖాస్.. ఖాస్’ అనే పాట మొబైల్‌లో పెట్టుకుని లిప్ సింక్ చేస్తూ.. బైక్ అటు ఇటు తిప్పుతూ తెగ డ్యాన్స్ చేశాడు. ఇది మొత్తం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టగా ఆహా.. ఓహో అని కొందరు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఇక లైక్‌ల సంగతి అయితే అస్సలే చెప్పక్కర్లేదు. ఇక ఈ కుర్రాడి ఆనందానికి హద్దు లేకుండా పోయింది.. అయితే ఆ ఆనందం ఎంతోసేపు లేదు.. పోలీసుల నుంచి చలానా రావడంతో ఆనందం అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. అది కూడా వెయ్యి, రెండు వేలు కాదండోయ్.. ఏకంగా 9వేల రూపాయిల చలానా కావడంతో కుర్రాడు కంగుతిన్నాడు. ఈ చలనా రావడానికి కారణం.. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం.. పైగా వీధుల్లో వాహనదారులను ఇబ్బంది పెట్టడమే.!


ఒకేసారి షాకిచ్చారు..

అంతేకాదండోయ్.. ఈ కుర్రాడిపై మోటారు వాహన చట్టం కింద అనేక సెక్షన్‌లను ట్రాఫిక్ పోలీసులు విధించారు. ఇందులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగించినందుకు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్- 184 కింద, సెక్షన్ 194 (డి), సెక్షన్ 129 ప్రకారం జరిమానాలు విధించారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, ఉత్తరప్రదేశ్ మోటార్ వెహికల్ రూల్స్ సెక్షన్- 121 కింద పోలీసులు జరిమానా విధించి.. కుర్రాడికి షాకిచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వినోద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసు పాతదే ఏప్రిల్-23,2021దే అయినప్పటికీ ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న చలనాలన్నీ కలిపి ఇప్పుడు 9000 రూపాయిలు జరిమానా విధించినట్లు తెలిపారు. యువకుడు ఈ మొత్తం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది.. లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చూశారుగా.. ఏదో చేసి పాపులర్ అవ్వాలని ఈ కుర్రాడు అనుకుంటే ఇలా సీన్ రివర్స్ అయ్యింది..!

Updated Date - 2021-12-08T18:47:21+05:30 IST