జాబ్‌మాయ

ABN , First Publish Date - 2022-05-17T08:36:03+05:30 IST

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గాలికి పోయాయి. మెగా డీఎస్సీ లేదు. ఏటా జనవరిలో జాబ్‌ కేలండర్‌ హామీ అటకెక్కింది. పోలీసు ఉద్యోగాల భర్తీ హామీదీ ఇదే పరిస్థితి.

జాబ్‌మాయ

ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు.. ప్రైవేటు కొలువులూ లేవు

యువత ఉపాధికి వైసీపీ సర్కారు గండి 

ఎన్నికలకు ముందు జగన్‌ ఎన్నెన్నో హామీలు

ప్రతి ఏటా డీఎస్సీ, జాబ్‌ కేలండర్‌ ఎక్కడ? 

ఇతర ప్రభుత్వ, పోలీసు ఉద్యోగాలు ఏవీ? 

నెరవేర్చి ఉంటే 2.50 లక్షలకు పైగా వచ్చేవి

ప్రైవేట్‌ రంగంలోనూ లేని ఉపాధి అవకాశాలు

ఉన్న పరిశ్రమలు పరార్‌.. కొత్తవి రాని వైనం 

యువతలో అసంతృప్తి చల్లార్చేందుకు మేళాలు


‘నిరుద్యోగ యువతా.. అధైర్యపడొద్దు. మరొక ఆరు నెలలు ఓపిక పట్టండి. మీ అందరికీ అండగా నేనున్నా. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాబోయే మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది’.. 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు జగన్‌ ఇచ్చిన హామీ ఇది. 


సీన్‌ కట్‌ చేస్తే.. ఆరునెలలు అయిపోయి, మూడేళ్లు ముగిసిపోయింది. ఏటా డీఎస్సీ, జాబ్‌ కేలండర్‌, ఉద్యోగాల భర్తీ హామీలన్నీ తుస్‌. ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టయితే.. ఈ పాటికి కొత్తగా 25 వేలమంది ఉపాధ్యాయులు, 2.32 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, వేలమంది పోలీసులు విధుల్లో చేరేవారు. జగనన్న చెప్పిన ఆ ఉద్యోగాలు ఏవీ? ఎక్కడ? అంతా మోసం. యువతలో అసంతృప్తిని చల్లార్చేందుకే ఇప్పుడు జాబ్‌మేళాలతో హడావుడి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఉద్యోగాలు కూడా వైసీపీ సానుభూతిపరులకే!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గాలికి పోయాయి. మెగా డీఎస్సీ లేదు. ఏటా జనవరిలో జాబ్‌ కేలండర్‌ హామీ అటకెక్కింది. పోలీసు ఉద్యోగాల భర్తీ హామీదీ ఇదే పరిస్థితి. అంతా ‘రివర్స్‌’. జగనన్నను నమ్మి దారుణంగా మోసపోయామనే ఆవేదన యువతలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై మాట నిలబెట్టుకోకపోగా, ఇప్పుడు పుండుమీద కారం చల్లినట్టుగా వ్యవహరిస్తోంది. వైసీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ సానుభూతిపరులకు మాత్రమే ఉద్యోగ మేళాలు పెడుతున్నారు. రాష్ట్రంలో నాలుగు మెగా జాబ్‌మేళాలను కేవలం వైసీపీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతిలో జరగ్గా... ఇటీవల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహించారు.


ఒక్కో జాబ్‌మేళాలో 15 వేలమందికి ఉద్యోగాలు వచ్చేలా చేయడమే లక్ష్యమన్నారు. ఎంతమందికి ఏయే ఉద్యోగాలు ఇచ్చారన్నది పక్కనపెడితే.. అధికారంలోకి వస్తే చేస్తానన్న హామీ నెరవేర్చలేదు. ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వలేదు. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల కల్పన లేకుండా చేశారు. యువతలో ఉన్న తీవ్ర అసంతృప్తిని చల్లార్చేందుకు ఈ జాబ్‌మేళాల హడావుడి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


సీఎం హోదాలోనూ హామీలు 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గాక ముఖ్యమంత్రి అయ్యాక కూడా జగన్‌ ఉద్యోగాలపై ఒక ప్రకటన చేశారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడా ఖాళీలు లేకుండా భర్తీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి ఉద్యోగాలు రానివాళ్లు ఎవరైనా ఉంటే బాధపడొద్దు. జనవరి అనేది ఎంతో దూరంలో లేదు. మళ్లీ జనవరి వస్తుంది. ఆ తర్వాత ఏడాది జనవరి వస్తుందని గుర్తుపెట్టుకోమని మాత్రం చెబుతున్నా’’ అని ప్రకటించారు. కానీ ఆ హామీలేవీ నెరవేర్చలేదు. ఇప్పుడు జాబ్‌మేళాల పేరుతో మోసం చేస్తున్నారని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ జాబ్‌మేళాల సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ఇస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్‌మేళాలు పెడుతున్నామని ప్రకటించారు. అసలు ప్రభుత్వం ఇస్తామన్న ఉద్యోగాలు ఎన్ని? ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఈ విషయం తెలిసే ఆయన ఈ మాట మాట్లాడారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 30 లక్షల మందికి పైగా నిరుద్యోగులు మూడేళ్ల నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు కల్పించకుండా.. పార్టీ పరంగా జాబ్‌మేళాలు పెడుతున్నామని హడావుడి చేయడంలో ఆంతర్యమేంటని నిలదీస్తున్నారు. 


ఉద్యోగాల్లేవ్‌.. ఉన్నవి రద్దు 

గత ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఇచ్చిన హామీలు అన్నీఇన్నీ కావు. గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నట్టు మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే ‘అద్భుతం’ చేస్తానన్నట్టుగా చెప్పారు. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ వేశారు. ఆ తర్వాత 2018లో 7,900 ఉద్యోగాలకు మళ్లీ డీఎస్సీ   వేశారు. ఎన్నికల ముందు వాటిపై జగన్‌ మాట్లాడుతూ... అసలు అవీ ఒక ఉద్యోగాలేనా? తానొస్తే మెగా డీఎస్సీనే అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. ఇప్పటివరకు కనీసం ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. ఉద్యోగాలు వేయకపోగా, ఏకంగా 4760 ఎస్‌జీటీ ఉద్యోగాల భర్తీని రద్దు చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భవిష్యత్తులో కూడా భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 13,555 ఉపాధ్యాయ పోస్టుల్లో 4,764 ఉద్యోగాలను ఏకంగా రద్దు చేసేశారు. 


గతంలో ఉద్యోగాల భర్తీపై విమర్శలు.. 

చంద్రబాబు తన ఐదేళ్ల హయాంలో రెండు సార్లు గ్రూప్‌-2 నోటిఫికేషన్లు  విడుదల చేశారు. 2016లో ఒకసారి 974 పోస్టులకు, 2018లో 443 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. గ్రూప్‌-1కు కూడా రెండుసార్లు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఒకసారి 74 పోస్టులు, మరోసారి 160 పోస్టులు భర్తీ చేశారు. డీఎస్సీ మూడుసార్లు నిర్వహించారు. మూడుసార్లు డీఎస్సీ ద్వారా సుమారు 22వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీచేసేలా చేశారు. పోలీసు శాఖలోనూ ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేశారు. 2016లో 1057 ఎస్‌ఐ ఉద్యోగాలు, 4548 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ చేశారు. 2018లో 334 ఎస్‌ఐ ఉద్యోగాలు, 2723 కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇంకా ఇతర శాఖల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇన్ని చేస్తే ఇవేం ఉద్యోగాలని జగన్‌ తీసిపారేశారు.


వైసీపీ సర్కారులో షాక్‌లు

తాము అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందు జగన్‌ ఊరూరా చెప్పారు. ఆయన అఽధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. ఆయన చెప్పిన హామీలేవీ నెరవేర్చలేదు. 2021 జూన్‌ 18వ తేదీన గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులు కేవలం 36గా ప్రకటించారు.    ఈ ప్రకటన చూసి నిరుద్యోగులు విస్తుపోయారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఆ తర్వాత 9 నెలలకు గ్రూప్‌-1లో 110, గ్రూప్‌-2లో 130పోస్టులను అదనంగా కలిపారు. అన్నీ కలిపినా 276 లోపే. టీడీపీ  హయాంలో భర్తీ చేసిన ఒక్క డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులకు ఇవి దాదాపు సమానం. అప్పట్లో గ్రూప్‌-1, గ్రూప్‌-2లలో వేసిన డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులే 274. 


ప్రైవేటు ఉద్యోగాలూ లేవు 

ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన అన్నది సాధారణంగా ప్రతిఏటా పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు పెరగడం సంగతి అటుంచితే, భారీగా తగ్గిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటు వల్ల సుమారు 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ రంగంలోనే 34వేల మందికి, బీపీవో రంగంలో వేలమందికి ఉద్యోగాలొచ్చాయి. కానీ ఇప్పుడు జగన్‌ సర్కారు దెబ్బకు ఉన్న పరిశ్రమలు పారిపోతుండగా, కొత్త పరిశ్రమలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. ఉద్యోగ అవకాశాలను ఈ ప్రభుత్వం చెడగొట్టేసిందని తీవ్ర విమర్శలున్నాయి. రాజధాని నిర్మాణం నుంచి విశాఖలో ఐటీ కంపెనీలు, రాయలసీమలో తయారీ రంగం పరిశ్రమలు ఏవీ జరగలేదు. కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలోని యువత తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఉపాధి కల్పనలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ జాబ్‌మేళాల పేరుతో ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

Updated Date - 2022-05-17T08:36:03+05:30 IST