నీ కష్టం నాదే, నీ దుఃఖం నాదే!

ABN , First Publish Date - 2020-04-01T06:03:47+05:30 IST

‘మాకడుపు కొట్టేటోళ్లతోనే మా పోరాటం. పొట్ట పోసుకొనేందుకు వచ్చినోళ్లతో కానేకాదు’... ఉద్యమకాలంలో పిడికిలి బిగించి, బరిగీసి కొట్లాడిన తెలంగాణ మరోచేత్తో ఆనాడే ఇచ్చిన అభయమిది. ‘రావొచ్చు..పోవొచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు. నువ్వు పద్దెం పాడితే మేము పరవశించనూవచ్చు...

నీ కష్టం నాదే, నీ దుఃఖం నాదే!

వలస కార్మికులూ మన ఇంటి బిడ్డలే అన్న గొప్ప మనసు మన తెలంగాణది, మన ఉద్యమ నేత కేసీఆర్‌ది. కూలీలు తమ పొట్టకూటి కోసమే వస్తుండవచ్చు. కానీ, వారు తెలంగాణ అవసరాలను కూడా తీరుస్తున్నారు. తన అవసరంలోనే కాదు, వారి ఆపదలోనూ వెన్నంటి ఉండి ఆదుకుంటామని తెలంగాణ దేశానికి చాటిచెప్పింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.


‘మాకడుపు కొట్టేటోళ్లతోనే మా పోరాటం. పొట్ట పోసుకొనేందుకు వచ్చినోళ్లతో కానేకాదు’... ఉద్యమకాలంలో పిడికిలి బిగించి, బరిగీసి కొట్లాడిన తెలంగాణ మరోచేత్తో ఆనాడే ఇచ్చిన అభయమిది. ‘రావొచ్చు..పోవొచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు. నువ్వు పద్దెం పాడితే మేము పరవశించనూవచ్చు. నీ ఇడ్లీ బండి అడ్డ నీవె నిలుపుకోవచ్చు.. బేఫికర్‌గా ఉండున్రి’ అని బాస చేసింది. ఈ మాటను ఉద్యమం సాగిన రోజుల్లనే కాదు, రాష్ట్రంగా ఏర్పడినంక కూడా తెలంగాణ గడ్డ నిలబెట్టుకున్నది. తన ప్రజల కోసమే కాదు.. కడుపు చేత పట్టుకోనొచ్చి మనకాడ బతుకుతున్న బడుగుల బాగు కోసం కూడా తెలంగాణ తన్లాడుతున్నది. వలసొచ్చిన వారిని కూడా తన కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది. అరవై ఏండ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో గోస పడ్డ బిడ్డగా బయటనుంచి వొచ్చినోళ్లకు కూడా ఆ కష్టాలు రావొద్దని ఓ తల్లి లెక్కన తెలంగాణ అక్కున చేర్చుకున్నది. 

కరోనా వైరస్‌ ప్రభావంతో దేశమంతా లాక్‌డౌన్‌ అయి వలసకూలీలు, కార్మికులు రోడ్డున పడ్డరు. ఓవైపు మహారాష్ట్ర, ఢిల్లీల నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు యూపీ, బిహార్‌, ఈశాన్య రాష్ట్రాలకు తరలుతుంటే మన రాష్ట్రంలోని వలసకూలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొండంత భరోసా ఇచ్చారు. వారు కూడా మా బిడ్డలే అని అభయమిచ్చారు. రాష్ట్రంలో ఉంటున్న లక్షలమంది వలస కూలీలు రంధి పడొద్దని, సొంత ప్రాంతాలకు వెళ్లాలని ఆత్రపడొద్దని, ఎన్నిరోజులైనా చీకూచింతా లేకుండా ఇక్కడే హాయిగా ఉండొచ్చన్నారు. ఒక్కరిని కూడా పస్తులు ఉంచమని, అందర్నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణం, అభివృద్ధికి వలస కూలీలు సోపానమని, వారి సంక్షేమ బాధ్యతను రాష్ట్రం తీసుకుంటదని, ఇందుకు ఎన్ని వేల కోట్లు ఖర్చయినా ప్రభుత్వం వెనుకాడదని ప్రకటించారు. కష్టకాలంలో రాష్ట్రంలోని తెల్ల రేషన్‌ కార్డుదారులకు 1500 రూపాయలు, కుటుంబంలోని ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నట్లుగానే వలస కూలీలను తమ బిడ్డలుగానే భావించి ఆదుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. వలస కూలీలకు తలా 500 రూపాయలు, 12 కిలోల బియ్యం ఇస్తామని, రొట్టెలు తినే వారుంటే బియ్యం బదులుగా 12 కిలోల గోధుమలు ఇస్తామని చెప్పారు. వంట చేసుకోలేని స్థితిలో ఎవరైనా ఉంటే వారూ బాధపడొద్దని, వంటలు చేసి, కడుపు నిండా భోజనం పెడతామని మాటిచ్చారు. అనారోగ్యానికి గురైన కూలీలకు వైద్య సదుపాయం, మందులు ఇస్తామని కూడా చెప్పారు. కూలీలు తమకు ఎలాంటి కష్టమొచ్చినా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిస్తే చాలని, వారే అన్నీ చూసుకుంటారని అభయమిచ్చారు. ఇది రాష్ట్రంలో ఉంటున్న 8 లక్షల పైచిలుకు వలస కూలీలకు గొప్ప ఆసరా. వలస కూలీల విషయంలో దేశం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని గొప్ప నిర్ణయం. అందుకే నేడు దేశమంతా తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రశంసిస్తోంది. సంక్షోభ సమయంలో కేసీఆర్ ప్రజల హృదయాలను గెల్చుకున్నారని కేంద్ర పశు సంవర్థకశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కొనియాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు, వలస కూలీలకు ఇచ్చిన భరోసా అభినందనీయమని కేంద్ర సహాయమంత్రి సంజీవ్ బాల్యన్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ప్రకటన అద్భుతమని, నాయకత్వం అంటే ఇదేనని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీడియా అడ్వయిజర్‌ సంజయ్ బారు కొనియాడారు. వలస కూలీల విషయంలో వ్యవహరించాల్సిన తీరు ఇదేనని ఏఎన్ఐ మేనేజింగ్ ఎడిటర్ స్మితా ప్రకాశ్, ఇతర రాష్ట్రాలు వలస కూలీలను వెనక్కుపంపుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం వారిని కుటుంబసభ్యులుగా భావించిదని న్యూస్ 18 మేనేజింగ్‌ ఎడిటర్ అమీష్ దేవ్‌గన్, కేసీఆర్ నిజమైన నాయకుడు అని సినీ నటుడు సోనూసూద్.. ఇలా సినీ, క్రీడా ప్రముఖులు అనేక మంది హర్షిస్తున్నారు. 

మేం బతుకతం, ఇతరులను బతకనిస్తం–తెలంగాణ సమాజం మూల సూత్రం ఇది. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంగా కష్టాల్లో ఉన్న వలస కూలీల విషయంలో ఎంత త్యాగమైనా చేసేందుకు తెలంగాణ సిద్ధపడింది. అయినా వలస కూలీల అవస్థలు తెలంగాణ గడ్డకు తెలిసినంతగా దేశంలోని ఏ మట్టికి తెలుసు? ఉమ్మడి రాష్ట్రంలో సాగుకు యోగ్యంగా ఉన్నా నీళ్లు పారక నెర్రలు తేలి బీళ్లు పడ్డ భూములు, ఉపాధి దొరక్క తిండిలేక పస్తులంటున్న ముసలి తల్లిదండ్రులు, భార్యా పిల్లల కోసం ముంబై, దుబాయిలకు పోయి తన బిడ్డలు పడ్డ ఇబ్బందులు తెలంగాణ మరిచిపోలేదు. మా నీళ్లు మాకే.. మా నిధులు మాకే.. మా నియామకాలు మాకే అంటూ కొట్లాడిన తెలంగాణ... రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఆ స్ఫూర్తిని మరువలేదు. ప్రాజెక్టులను నిర్మించి బొట్టు బొట్టును ఒడిసి పడుతున్నది. తలాపున పారినా పంటలను తడపని గోదావరి, కృష్ణా నదులు బీళ్లకు మళ్లినయి. ఒకప్పుడు చీపురు దుబ్బలు కూడా మొలవక కళతప్పిన భూములు పంటలై పచ్చగా నవ్వుతున్నయి. ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పైకి ఎగదన్నుకొచ్చాయి. ఒకప్పుడు నాలుగైదు వందల ఫీట్లు తవ్వినా బొట్టు నీళ్లు పడని బోర్లు.. ఇప్పుడు నిండుగ పోస్తున్నయి. రెప్పపాటు కూడా పోని 24గంటల కరెంటు, పెట్టుబడి సాయం రైతులకు వరాలయ్యాయి. ఒక్క పంట పండటమే కనాకష్టం అనుకున్న రోజులు ఎప్పుడో పోయినయి. పునాస, యాసంగి.. రెండు పంటలూ పండుతున్నాయి. అపుడు ఐదెకరాల ఆసామి అయినా కూలీలుగా బతికిన రైతులు... ఇపుడు యవుసం చేసుకుంటూ మోతుబరిగా బతుకుతున్నరు. కరువుతో అల్లల్లాడిన ఆదిలాబాద్‌, పాలమూరు జిల్లాల్లో కూడా ఈ మార్పు కనిపిస్తున్నది. పూట గడిస్తే చాలు అనుకొని, అభిమానం చంపుకొని షోలాపూర్‌, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాలకు పోయిన ఆ జిల్లాల రైతులు సొంత ప్రాంతాలకు తిరిగొచ్చి యవుసం చేసుకుంటున్నరు. అక్కడ పనిచేసేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలు పోటెత్తుతున్నరు. పత్తి, మిర్చి పంటలు ఏరేందుకు మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లకు చెందిన వలస కూలీలు తెలంగాణకొచ్చి పనుల్లో మునిగిపోవడం చూస్తున్నం. పంటల దిగుబడి బాగా పెరిగింది. ఒకప్పుడు బోర్లు డ్రిల్‌ చేసేందుకు తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి మోటార్లు వచ్చేవి! ఇప్పుడు వరి కోత యంత్రాలు వస్తున్నాయి. వారికి చేతినిండా పని దొరుకుతోంది. పంటల దిగుబడి బాగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో తెలంగాణలో 14లక్షల ఎకరాలకు మించి సాగు జరిగేది కాదు. సాగుపరంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా అది 50లక్షల ఎకరాలకు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పంటలు సాగు చేయడం ఒకెత్తు.. ఆ పంటలను అమ్ముకోవడం ఒకెత్తు అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. వరి సహా మక్కలు, కందులు, పత్తి, మిర్చి అన్ని పంటలనూ సర్కారు మద్దతు ధరకు కొంటున్నది. తక్కువ ధరతో పంటను కొని ఆరుగాలం శ్రమించిన రైతుల కష్టాన్ని దోచుకునే దళారుల వ్యవస్థను కేసీఆర్‌ ప్రభుత్వం కూకటి వేళ్లతో పెకిలించి వేసింది. వలస వెళ్లాల్సిన పరిస్థితులను ఆరేళ్లలో మార్చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. వలస కార్మికుల గోస తెలిసిన వ్యక్తి అయినందువల్లే ఆనాడు గాయపడిన మనసు నేడు వారికి ఆపన్న హస్తం చాచింది దేశంలో. తెలంగాణ రాక ముందు వలస కూలీలకు కేరాఫ్ అడ్రస్ పాలమూరు జిల్లా. దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా ఇటుక, ఇసుక ఎత్తేది పాలమూరు నుంచి వలసవెళ్లిన వారే. నిర్మాణ పనుల్లో ప్రమాదం బారిన పడో, లేదా అనారోగ్యం కారణంగానో పాలమూరు వలస కూలీ చనిపోతే, శవాన్ని తేవడానికి ఆనాడు పాలమూరు వలస కూలీలు పడ్డ బాధలు వర్ణనాతీతం. రైల్లో శవాన్ని తేనివ్వరని గుడ్డలతో శవాన్ని దాచిపెట్టి, ఏడిస్తే విషయం తెలుస్తుందని గుండెల్లోనే ఆ బాధ దిగిమింగి ఆ శవాన్ని స్వంత ఊరికి తెచ్చేవారు. ఆనాటి వలస కూలీల కంటి నీటితో తడిచిన నేల తెలంగాణ. అందుకే నేడు కరోనా వల్ల వలస కూలీలకు తలెత్తిన ఇబ్బందులను అర్థం చేసుకుంది. ఆనాటి పాలమూరు వలస కార్మికుల దుఃఖాన్ని అర్థం చేసుకున్న ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్ ఇవాళ వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. వలస కార్మికులూ మన ఇంటి బిడ్డలే అన్న గొప్ప మనసు మన తెలంగాణది, మన ఉద్యమ నేత కేసీఆర్‌ది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో కొట్లాడిన తెలంగాణ ఇప్పుడు నీళ్లతో నిధులను, ఉపాధిరంగంలో నియామకాలను సృష్టిస్తున్నది. దాని ఫలితమే తెలంగాణకు లక్షలాదిగా వలసకూలీల రాక. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియలో జరుగుతున్న అభివృద్ధికి భారీ ఎత్తున వలస వస్తున్న కార్మికులే నిదర్శనం. అనేక రాష్ట్రాలనుంచి కూలీలు తమ పొట్టకూటి కోసమే వస్తుండవచ్చు. కానీ, వారు తెలంగాణ అవసరాలను కూడా తీరుస్తున్నారు. ముఖ్యమంత్రిగారు అన్నట్టు, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. తన అవసరంలోనే కాదు, వారి ఆపదలోనూ వెన్నంటి ఉండి ఆదుకుంటామని తెలంగాణ దేశానికి చాటిచెప్పింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అదీ తెలంగాణ ఆర్తి. అదీ తెలంగాణ స్ఫూర్తి.


తన్నీరు హరీశ్‌ రావు

(రాష్ట్ర ఆర్థిక మంత్రి)

Updated Date - 2020-04-01T06:03:47+05:30 IST