Abn logo
Sep 21 2021 @ 01:09AM

మీ విచారణ పక్షపాతం!

  • ఈ కోర్టుపై నాకు నమ్మకం లేదు
  • కారణం లేకుండా హాజరవమంటున్నారు
  • లేదంటే ‘అరెస్టు వారెంటు’ బెదిరింపులు
  • మరో కోర్టుకు కేసును బదిలీ చేయండి
  • పరువునష్టం కేసు విచారణపై కంగన
  • జావెద్‌ అక్తర్‌పై కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు
  • తనను బెదిరించారని వెల్లడి


 

ముంబై, సెప్టెంబరు 20: ‘‘విచారణ పక్షపాతంగా సాగుతోంది. ఈ కోర్టుపై నేను నమ్మకాన్ని కోల్పోయాను. నాపై దాఖలైన కేసు బెయిలబుల్‌. జరిమానాతో సమసిపోయేది. అలాంటిది నాకు అరె స్టు వారెంట్‌ జారీ చేస్తామన్నారు. నేను నేరుగా హాజరుకాకున్నా విచారణను పూర్తిచేయొచ్చు. నేను హాజరు కావడానికి కారణాలు చెప్పకుండా ప్రతీ విచారణకు రమ్మనడమేంటి?’’ అని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ముంబైలోని ఓ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

సినీ గీతాల రచయిత జావెద్‌ అక్తర్‌ దాఖలు వేసిన పరువు నష్టం(క్రిమినల్‌) కేసులో సోమవారం కోర్టుకు హాజరైన కంగనా విచారణను మరో కోర్టు కు బదిలీ చేయాలని కోరారు. గత ఏడాది బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యపై అప్పట్లో కంగనా ఓ టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావెద్‌ అక్తర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయన గత ఏడాది నవంబరులో కంగనాపై మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. విచారణకు హాజరు కావాలని కంగనాకు జడ్జి సమన్లు జారీ చేసినా గైర్హాజరయ్యారు. దీంతో జడ్జి తీవ్రంగా హెచ్చరించారు.