చదివేది ఎమ్మెస్సీ.. చేసేది బ్లాక్‌మెయిలింగ్‌

ABN , First Publish Date - 2021-06-12T19:06:03+05:30 IST

ఆ యువకుడు ఎమ్మెస్సీ సైకియాట్రీ చదువుతున్నాడు. కానీ బుద్ధి పెడదారి

చదివేది ఎమ్మెస్సీ.. చేసేది బ్లాక్‌మెయిలింగ్‌

  • ఫొటోలు మార్ఫింగ్‌ చేసి టెలిగ్రామ్‌లో అశ్లీల పోస్టులు
  • యువతుల నుంచి డబ్బు డిమాండ్‌ 
  • తమిళనాడు యువకుడి ఆటకట్టించిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ : తమిళనాడుకు చెందిన ఆ యువకుడు ఎమ్మెస్సీ సైకియాట్రీ చదువుతున్నాడు. కానీ బుద్ధి పెడదారి పట్టి టెలిగ్రామ్‌లో ఆశ్లీల చిత్రాలు అప్‌లోడ్‌ చేసి యువతులను వేధిస్తున్నాడు. డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమిషనరేట్‌ పరిధిలోని ఓ కళాశాలలో పని చేస్తున్న యువతికి టెలిగ్రామ్‌లో మార్ఫింగ్‌ చేసిన ఆమె అశ్లీల చిత్రాలు, అసభ్య మెసేజ్‌లు కనబడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తి నుంచి రావడంతో ఆమె నిందితుడిని నిలదీసింది. తనకు క్రిఫ్టోకరెన్సీ రూపంలో డబ్బులు ఇవ్వాలని నిందితుడు డిమాండ్‌ చేశాడు. లేదంటే ఇతర గ్రూపుల్లో పోస్టు చేస్తానని, ఆమె నంబర్‌ను అశ్లీల గ్రూపుల్లో పెడతానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఆ యువతి లెక్కచేయలేదు. దాంతో ఆ యువకుడు చెప్పినట్లుగానే ఆమె ఫోన్‌ నంబర్‌, ఆశ్లీల చిత్రాలను తమిళనాడుకు చెందిన టెలిగ్రామ్‌ గ్రూపుల్లో (అన్‌ సాటిస్‌ఫైడ్‌ ఆంటీస్‌) పోస్టు చేశాడు. దాంతో ఆ యువతికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా ఫోన్‌లు వచ్చేవి. మానసిక క్షోభకు గురైన ఆ యువతి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాల మేరకు డీసీపీ క్రైం యాదగిరి, ఏసీపీ హరినాథ్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ రంగంలోకి దిగారు. అత్యాధునిక టెక్నాలజీతో నిందితుడి ఆచూకీ కనుగొన్నారు.


టెక్నాలజీపై పట్టుతో...

పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడు తమిళనాడుకు చెందిన తమిళి సెల్వన్‌గా గుర్తించారు. అతనికి అత్యాధునిక టెక్నాలజీ మీద మంచి పట్టు ఉంది. ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్‌ చేసి ఇతరుల ఫోన్‌  నంబర్లు, మెయిల్‌ ఐడీలు సేకరించాడు. వాటి ఆధారంగా కొంతమంది మహిళలకు సంబంధించిన టెలిగ్రామ్‌ ఐడీలు తెలుసుకున్నాడు. అందులోంచి వారి ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని యాప్‌ల సహకారంతో యువతుల చిత్రాలను మార్ఫింగ్‌ చేసేవాడు. అనంతరం సవిన్‌ 1207 సౌషు పేరుతో వర్చువల్‌ నంబర్లతో నకిలీ టెలిగ్రామ్‌ ఐడీలు సృష్టించాడు. నకిలీ టెలిగ్రామ్‌ ఐడీల ద్వారా యువతుల టెలిగ్రామ్‌లకు అశ్లీల చిత్రాలు, అసభ్యకర మెసేజ్‌లు పోస్టు చేసేవాడు. తన ఐడీ, ఐపీ అడ్రస్‌ తెలియకుండా ఉండటానికి కొత్త కొత్త టెక్నాలజీలు ఉపయోగించేవాడు. ఆ యువతులను క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసేవాడు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన యువతులను టార్గెట్‌ చేశాడు. ఎవరైనా తాను అడిగిన డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే వారి అశ్లీల చిత్రాలు తమిళనాడుకు చెందిన అశ్లీల గ్రూపుల్లో పోస్టు చేసి బాధితులను మానసిక వేధనకు గురిచేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. రాచకొండ పోలీసులు అతన్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.


ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిందని...

ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకున్న యువకుడు బాలికను వేధించాడు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆనంద్‌బాగ్‌ మల్కాజిగిరికి చెందిన సయ్యద్‌ సైఫుద్దిన్‌ (19)కు పదోతరగతి చదువుతున్నప్పుడు తన చెల్లి స్నేహితురాలితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఆ యువకుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. అది తెలుసుకున్న బాలిక తల్లి అతన్ని తిట్టి స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. అది మనసులో పెట్టుకున్న సైపుద్దీన్‌ నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ సృష్టించి ఆ బాలికకు అసభ్య మెసేజ్‌లు పంపేవాడు. నగ్న చిత్రాలు పంపకపోతే ఆమె ఫోన్‌ నంబర్‌ను అశ్లీల చిత్రాల వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.

Updated Date - 2021-06-12T19:06:03+05:30 IST