HYD : ప్రేమించుకున్నారు.. పెళ్లి ప్రస్తావన రావడంతో నిరాకరించిన యువతి.. ఇంతలోనే..!
ABN , First Publish Date - 2021-07-19T13:50:16+05:30 IST
కొంతకాలంగా ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో...
హైదరాబాద్ సిటీ/అమీర్‌పేట : ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర టెంపుల్ వీధిలో జరిగింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలం కేపీ పాలెంకు చెందిన గొర్రె సుధాకర్ (30) ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. ఎస్‌ఆర్‌నగర్‌లోని వెంకటేశ్వర టెంపుల్ వీధిలో మిత్రుడు భార్గవ్‌తో ఉంటూ ఇదే ప్రాంతంలో రెండేళ్లుగా కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు.
కొంతకాలంగా ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో యువతి నిరాకరించింది. దీంతో మనస్థాపానికి గురైన సుధాకర్ తాను ఉంటున్న అద్దె ఇంట్లో ఉరేసుకుని శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి వేళ భార్గవ్ వచ్చి తలుపు తట్టి చూడగా తలుపులు తీయలేదు. దీంతో అతను కిరాణం షాపునకు వెళ్లి పడుకుని తెల్లవారుజామున వచ్చి చూడగా తలుపులు తీయకపోవడంతో బాల్కనీ నుంచి వెళ్లి కిటికి లోంచి చూడగా నేలపై బోర్లా పడి కనిపించాడు. వెంటనే ఫోన్‌లో మృతుడి సోదరుడు మహిబాబుకు విషయం తెలియచేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.