టిక్‌టాక్‌లో అమ్మాయిని ఫాలో అయ్యి.. కటకటాలపాలయ్యాడు!

ABN , First Publish Date - 2021-03-28T16:11:06+05:30 IST

టిక్‌టాక్‌లో ఓ అమ్మాయిని ఫాలో అయిన యువకుడు..

టిక్‌టాక్‌లో అమ్మాయిని ఫాలో అయ్యి.. కటకటాలపాలయ్యాడు!

  • సైబర్‌ నేరస్థుడిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ: టిక్‌టాక్‌లో ఓ అమ్మాయిని ఫాలో అయిన యువకుడు.. ఆ తర్వాత ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. చివరకు రాచకొండ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన కొమ్మగోని కల్యాణ్‌ గౌడ్‌ కార్‌ వాషింగ్‌ లేబర్‌గా పని చేస్తున్నాడు. టిక్‌టాక్‌లో వీడియోలు పెడుతున్న ఓ అమ్మాయిని ఫాలో అయ్యేవాడు. ఆమె వీడియోలను మెచ్చుకుంటూ పోస్టులు పెట్టేవాడు. ఆ తర్వాత ఆమె ఫోన్‌ నంబర్‌ సేకరించి వాట్సా్‌పలో చాటింగ్‌లు చేస్తూ కొద్దిరోజుల్లోనే క్లోజ్‌ ఫ్రెండ్‌ అయ్యాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ యువతి హైదరాబాద్‌లోని ఓ ఉమెన్స్‌ కాలేజీలో చదువుతున్నట్లు తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు వెళ్తూ.. ఆమెను కలవడం, సెల్ఫీలు తీసుకోవడం చేసేవాడు. ఈ క్రమంలో ఆమెతో చనువు ఏర్పడగానే తనను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. దాంతో తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పి అప్పటి నుంచి అతన్ని దూరం పెట్టింది. ఇంతలో ఆమెకు పెళ్లికుదిరిందని తెలుసుకున్న నిందితుడు ఆమెతో దిగిన ఫొటోలను వాట్సా్‌పలో పెట్టేవాడు. తనను ప్రేమించాలని, లైంగికంగా సహకరించాలని వేధించేవాడు. ఇలా అతని వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడి ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.

Updated Date - 2021-03-28T16:11:06+05:30 IST