చరిత్ర రాయబారులుగా యువ రచయితలు

ABN , First Publish Date - 2021-12-26T06:06:51+05:30 IST

కొత్త ఆలోచనలు, భావాలు కొన్నిసార్లు తమకంటూ ఒక స్థానాన్ని నిరాడంబరంగా సృష్టించుకుంటాయి. వాస్తవానికి అవి రోజువారీ జీవితంలో మనకు తారసపడ్డప్పుడు మాత్రమే గుర్తించబడే ఒక రకమైన నిశ్శబ్ద విప్లవాన్ని...

చరిత్ర రాయబారులుగా యువ రచయితలు

కొత్త ఆలోచనలు, భావాలు కొన్నిసార్లు తమకంటూ ఒక స్థానాన్ని నిరాడంబరంగా సృష్టించుకుంటాయి. వాస్తవానికి అవి రోజువారీ జీవితంలో మనకు తారసపడ్డప్పుడు మాత్రమే గుర్తించబడే ఒక రకమైన నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురావడానికి సాధనంగా మారతాయి. కొత్తతరం రచయితలను గుర్తించడం, ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి - యువ మార్గదర్శక పథకం’ సరిగ్గా ఇదే సాధించింది. 


భారత జాతీయోద్యమ చరిత్రపై ఆంగ్లంతోపాటు 22 అధికారిక భాషలలో యువ రచయితల నుంచి పుస్తక ప్రతిపాదనలను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆహ్వానించింది. భారత ప్రభుత్వం పక్షాన ‘నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌’ ఈ పథకాన్ని అమలు పరుస్తోంది. ఈ స్ఫూర్తిదాయక పథకానికి దేశవ్యాప్తంగా అపూర్వమైన స్పందన లభించింది. 23 భాషలలో 16,000కు పైగా పుస్తక ప్రతిపాదనలు వచ్చాయి. 


భారత జాతీయోద్యమంలో మరుగున పడిన అనేక సంఘటనలు, గుర్తింపునకు నోచుకోని వీరులు, తెలియని ప్రదేశాల పాత్ర, మహిళా నాయకులు మొదలైన అంశాలు ఇతివృత్తాలుగా 23 భాషలలో కథ, వచన రచనా విభాగంలో ప్రతిపాదనలు వచ్చాయి. వాటి నుంచి ఎంపిక చేసిన 75 మంది రచయితల ఫలితాలను ఇప్పుడు ప్రకటించాము. ఈ ‘ప్రధానమంత్రి యువ మార్గదర్శకత పథకం’ ద్వారా ఈ 75 మంది యువ భారతీయులు రాసిన పుస్తకాలను మరింత అభివృద్ధిపరిచే దిశగా ఒక కొత్త వికాసయాత్ర ఆరంభమయింది. 


అతి పెద్ద సవాలుగా మేము దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీ కోసం యువజనుల నుంచి 5000 పదాలలో తాము రాయాలనుకున్న పుస్తకం సారాంశం, అధ్యాయ విభజన వంటివి పంపాల్సిందిగా కోరాము. అందుకు స్పందించి మాకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించినప్పుడు, మన యువతరానికి చదవడం, రాయడం పట్ల, దేశం గురించి, జాతీయ నాయకులు, సంఘటనల గురించి ఉన్న ఆసక్తి తెలిసివచ్చింది. ఈ ‘యువ’ పథకం ఎంత సంచలనాత్మకంగా మారిందో అర్థమైంది. ఎందుకంటే ఈ పథకం కేవలం నవ యువ రచయితలను ప్రోత్సహించడమే కాదు, దేశంలోని విపత్తులు, కష్టాల గురించి తెలుసుకోవడానికే కాక వాటిని రేపటి తరానికి అందించేందుకు డాక్యుమెంట్‌ చేసే ఆలోచనను కూడా ప్రోత్సహిస్తుంది. బ్రిటిష్‌ వలసపాలన నుంచి మన దేశం విముక్తమయ్యేందుకు ఆరాటపడుతూ పోరాడుతున్న కాలంలో సంభవించిన అనేక సంఘటనలు, జరిగిన పరిణామాలను అక్షరబద్ధం చేసే ఆవిష్కరణలకు మన నవ యువ రచయితలు రాయబారులు కాబోతున్నారు. వీరిలో 15 సంవత్సరాల వయస్సువారు సైతం ఉండడం విశేషం. దీర్ఘకాలంలో ఈ పథకం చూపబోయే ప్రభావానికి ఇదొక నిదర్శనం. 


ఈ వినూత్న ప్రయత్నంలో మరో ప్రధాన అంశాన్నిగమనించవచ్చు. ఎంపికైన 75 మంది రచయితల తుది జాబితా చాలా సహజంగా జెండర్ సమానత్వాన్ని సాధించగలిగింది, వీరిలో పురుష, స్త్రీ రచయితలు సమాన సంఖ్యలో ఉండడం విశేషం. వారిలో 38 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారు. ఈ కోణంలో, అనేక సంవత్సరాలుగా ఆడపిల్లల కోసం పెద్ద ఎత్తున నిర్వహించిన విద్యా, సాధికారత కార్యక్రమాలు తమ ప్రభావాన్ని చూపగలిగాయని చెప్పవచ్చు. జెండర్ సమానత్వం అనేది ఈ ‘యువ’ పథకం సాధించిన అద్భుతమైన విజయాలో ఒకటి.


ఇంకా, దేశంలో సాంస్కృతిక, సాహిత్య అవగాహన, ఏకీకరణ కోసం సాహిత్యం ఒక సాధనంగా ఎలా మారుతుందో, వివిధ భాషా నేపథ్యాలు, సంప్రదాయాలను యువరచయితలు అన్వేషించడానికి, వాటిని తెలుసుకోవడానికి, రాయడానికి ఉత్తమ ఉదాహరణ కావచ్చు. అంతే కాకుండా యువరచయితల పుస్తకాల ద్వారా జాతీయోద్యమం వివిధ దశల్లోని మనకు తెలిసిన, తెలియని అనేక కోణాలు బయటకు వచ్చే అవకాశముంది.


ప్రధాన భారతీయ భాషలలోని రచయితలకు ఈ ‘యువ మార్గదర్శక పథకం’లో స్థానం కల్పించడం వల్ల, అది మన భావి రచయితలకు దేశంలోని బహుభాషా కాన్వాస్‌పై ఒక విలువైన అంతర్‌దృష్టిని అందజేస్తుందని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదు. ఒక నిర్దిష్ట భాషకు చెందిన రచయిత కోసం చర్చలు జరపడానికి చాలా చక్కని, విలువైన మార్గం ఇది. దేశంలోని బహుభాషా స్వరూపం గురించి సరైన అవగాహన, దృక్కోణాలతో పాటు భారతదేశపు సంక్లిష్ట వాస్తవికత, దేశ సాంస్కృతిక, సాహిత్య వారసత్వాన్ని రూపొందించే బహుముఖ కోణాల గురించి ఈ పథకం యువరచయితలకు మరింత మెరుగైన అవగాహనను కల్పిస్తుంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృక్పథానికి అనుగుణంగా ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌’ ఆలోచనను కూడా ముందుకు తీసుకువెళ్లుతుంది. ‘ప్రధాన మంత్రి యువ మార్గదర్శకత పథకం ’ కింద ప్రచురితమయ్యే పుస్తకాలు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదమవుతాయి. కాబట్టి, ఇది నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ నినాదం ‘ఎక: సుతే సకలం’ కు అనుగుణంగా ఉంటుంది. ఈ సందర్భంగా తెలుగు భాషకు సంబంధించి ఎంపికైన ముగ్గురు రచయితల వివరాలు: బోనగిరి సుకన్య (జననం 1996), దేవరకొండ ప్రవీణ్ కుమార్ (జననం 1995), కమ్మరి జ్ఞానేశ్వర్ (జననం 1996). 


‘21వ శతాబ్దం విజ్ఞానవంతమైన మానవశక్తి యుగం. ఈ శక్తిని కీర్తించాలంటే, (మనం) పుస్తకాలతో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్ స్వాతంత్ర్యం సాధించుకుని 75 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ కార్యక్రమాలలో భాగంగా యువతరం ఆలోచనాపరులను పెంపొందించే జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్ట్‌ను నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌కు అప్పగించడం విశేషం. నోబెల్‌ పురస్కార గ్రహీత గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చెప్పిన ఈ కింది మాటల్ని బట్టి చూస్తే, ఎంపిక చేసిన రచయితలలో కొందరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమదైన ముద్ర వేస్తారని ఆశిస్తున్నాం: 


‘ఎక్కడైతే మనస్సు భయం లేకుండా తల ఎత్తుకుని ఉంటుందో

ఎక్కడ జ్ఞానం ఉచితంగా లభిస్తుందో 

ఇరుకైన ఇంటి గోడలతో ప్రపంచం శకలాలుగా ఎక్కడైతే విభజించబడదో

సత్యం గాఢత నుండి ఎక్కడైతే పదాలు బయటకు వస్తాయో

అక్కడ అవిశ్రాంతమైన కృషి పరిపూర్ణత వైపు తన చేతులు చాపుతుంది’. 

యువరాజ్‌ మాలిక్‌

డైరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ ట్రస్‌్ట, ఇండియా

Updated Date - 2021-12-26T06:06:51+05:30 IST