చెప్పినట్లు వినకపోతే.. పరువుతీస్తా..

ABN , First Publish Date - 2020-06-07T10:41:15+05:30 IST

స్థానికంగా ఉండే ఓ యువతితో పరిచయం పెంచుకున్న యువకుడు.. కొద్దిరోజులు స్నేహితుడిగా నటించాడు. కొద్దిరోజులకు ఆ

చెప్పినట్లు వినకపోతే.. పరువుతీస్తా..

ఫేస్‌బుక్‌లో యువతికి లైంగిక వేధింపులు

సైబర్‌ కేటుగాడి ఆటకట్టించిన రాచకొండ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): స్థానికంగా ఉండే ఓ యువతితో పరిచయం పెంచుకున్న యువకుడు.. కొద్దిరోజులు స్నేహితుడిగా నటించాడు. కొద్దిరోజులకు ఆ యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. కోపం పెంచుకుని  ఫేసుబుక్‌లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చివరకు రాచకొండ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. సైబర్‌ క్రైం ఏసీపీ హరినాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌ ప్రాంతానికి చెందిన మోతె ప్రవీణ్‌కుమార్‌కు  స్థానికంగా ఉండే ఓ యువతితో పరిచియం ఏర్పడింది. ఆ పరిచయం  స్నేహంగా మారింది. అలా యువతితో చనువు ఏర్పడింది. అది అడ్డం పెట్టుకున్న ప్రవీణ్‌ ప్రేమిస్తున్నానంటూ యువతిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. అందుకు ఆ యువతి అంగీకరించకపోగా.. అప్పటి నుంచి అతన్ని దూరం పెట్టింది. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకున్న యువకుడు ఎలాగైనా పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. నకిలీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించాడు.


దాన్ని నుంచి ఆ యువతికి అసభ్య మెసేజ్‌లు, ఫొటోలు పోస్టు చేస్తున్నాడు. నేను చెప్పినట్లు వినకపోయినా, లైంగికంగా సహకరించకపోయినా నీ ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తాను. వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి పరువుతీస్తాను అని బెదిరించాడు. రోజు రోజుకు అతని వేధింపులు ఎక్కువ అవడంతో బాధితురాలు రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ రాము టెక్నికల్‌ ఆధారాలు సేకరించి సైబర్‌ నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Updated Date - 2020-06-07T10:41:15+05:30 IST