Abn logo
Oct 30 2020 @ 18:36PM

‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌‌’లో 3 చిత్రాలు ప్రకటించిన నిర్మాత

Kaakateeya

యువ వ్యాపారవేత్త సురేష్‌ రెడ్డి నిర్మాతగా మారి 'పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌'తో నిర్మాణ సంస్థను ప్రకటించడమే కాకుండా మూడు సినిమాలను కూడా ప్రకటించారు. అందులో ప్రొడక్షన్‌ నెం1గా రూపొందనున్న చిత్రానికి ‘సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌’, ‘పేపర్‌ బోయ్‌’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్‌రెడ్డి దర్శకుడు. ‘ఛోరి’, ‘మరోజన్మ’, ‘ప్యూర్‌ సోల్‌’ వంటి అవార్డ్‌ విన్నింగ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ రూపొందించిన ఆకాష్‌రెడ్డి, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రొడక్షన్‌ నెం2గా రూపొందనున్న చిత్రానికి ఉత్తమ కథారచయితగా ‘ఋషి’కి గాను నంది పురస్కారంతో పాటు దర్శకుడిగా దాదా సాహెబ్‌ ఫాల్కె ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పురస్కారం అందుకున్న రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించనున్నారు. ‘ఋషి’ చిత్రానికి పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ‘ఆంధ్రాపోరి’, ‘ఐతే 2.0’ చిత్రాలకు రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్‌ జామితో కలిసి సురేష్‌రెడ్డి కొవ్వూరి నిర్మించనున్నారు. ఇక ప్రొడక్షన్‌ నెం3 విషయానికి వస్తే.. ఈ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌ శిష్యుడు, ఆయన దగ్గర ఆరు చిత్రాలకు పని చేసిన ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు ‘పెళ్ళి గోల’అనే వెబ్‌ సిరీస్‌, జీ5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదలైన ‘47 డేస్‌’ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. దీనికి రమేష్‌ ప్రసాద్‌గారు సమర్పకులు. 


ఇక విషయానికి వస్తే కొవ్వూరి సురేష్‌రెడ్డి... యానిమేషన్‌ గేమింగ్ రంగంలో అందరికీ సుపరిచితమే. అంతే కాదు... ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార పత్రిక ఫోర్బ్స్‌ ఇటీవల 30 ఏళ్ళ లోపు వయసు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్‌రెడ్డి. గత 13 ఏళ్ళుగా ‘క్రియేటివ్‌ మెంటార్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ కాలేజీ’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఉన్నారు. ఆ కాలేజీ వ్యవస్థాపకులు ఆయనే. అలాగే, ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ నిర్వహిస్తున్నారు. ఎంతోమంది యానిమేటర్లుగా ఎదగడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అటువంటి సురేష్‌రెడ్డి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థను స్థాపించిన ఆయన, శుక్రవారం మూడు చిత్రాలను ప్రకటించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మూడు చిత్రాల ప్రీలుక్స్‌, లోగోలను విడుదల చేశారు. అతిథులుగా హాజరైన వారంతా సురేష్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి..‘పీ19 ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థ ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలను అందించాలని అభిలాషించారు.

ఈ కార్యక్రమంలో సురేష్‌రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ.. ''బ్లెస్సింగ్స్‌ అందించిన రమేష్‌ ప్రసాద్‌గారికి ధన్యవాదాలు.  అలాగే ఆశీర్వదించిన అతిథులందరికీ ధన్యవాదాలు. మేం రెండేళ్ళ నుంచి ఎన్నో కథలు విన్నాం. మాకు స్టోరీలు నేరేట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. వరల్డ్‌ సినిమాకి తెలుగు సినిమా ఎంతో కాంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఎంతోమంది యంగ్‌ ట్యాలెంటెడ్‌ పీపుల్‌ వస్తున్నారు. నేను ‘కంటెంట్‌ ఈజ్‌ ది ఫిల్మ్‌ (కింగ్‌)’ అనేది నమ్ముతాను. వచ్చే నాలుగేళ్ళల్లో 20 చిత్రాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ మూడు సినిమాల విషయానికి వస్తే... మా దర్శకులు ముగ్గురూ ఆల్రెడీ తమ కథలతో ఇంతకు ముందే ప్రూవ్‌ చేసుకున్నారు. వాళ్ళ కథలపై నమ్మకంతో సినిమాలు ప్రారంభించాం. ప్రదీప్‌ మద్దాలి సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న మొదలుపెట్టి, మార్చి 15కి పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. రాజ్‌ మాదిరాజు సినిమా చిత్రీకరణ ఈ ఏడాది డిసెంబర్‌ 22న మొదలవుతుంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకి పూర్తవుతుంది. ఆ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఆకాష్‌రెడ్డి సినిమా చిత్రీకరణ నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని తెలిపారు.

Advertisement
Advertisement