ఆన్‌లైన్‌ జూదానికి యువకుడి బలి

ABN , First Publish Date - 2020-07-12T09:52:43+05:30 IST

లక్షెట్టిపేటకు చెందిన యువకుడు ఆన్‌లైన్‌లో జూదమాడి ఆర్థికంగా నష్టపోయి మనస్తాపంతో ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

ఆన్‌లైన్‌ జూదానికి యువకుడి బలి

ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం ఫ చికిత్స పొందుతూ మృతి


లక్షెట్టిపేట, జూలై 11: లక్షెట్టిపేటకు చెందిన యువకుడు ఆన్‌లైన్‌లో జూదమాడి ఆర్థికంగా నష్టపోయి మనస్తాపంతో ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామానికి చెందిన మధుకర్‌ (24) హైదారాబాద్‌లోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. ఐదు మాసాల నుంచి ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడి క్రమక్రమంగా డబ్బులు పెడుతూ రూ.15 లక్షలు పోగొట్టు కున్నాడు. మధుకర్‌ పలువురు స్నేహితుల వద్ద అప్పుచేసి ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడాడు. ఈ విషయాన్ని  స్నేహితులు మధుకర్‌ తండ్రి శంకరయ్యకు తెలిపారు. కొడుకు చేసిన అప్పు చెల్లించి మరోసారి ఇలాంటి ఆన్‌లైన్‌ గేమ్‌ జోలికి వెళ్లవద్దని తండ్రి నచ్చజెప్పాడు. పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయాననే మనస్తాపంతో ఈనెల 7న ఉదయం 8 గంటల ప్రాంతంలో మధుకర్‌  ఏటీఎం డబ్బులు డ్రా చేస్తానని ఇంటి నుంచి వెళ్లాడు.


మధ్యా హ్నం 12 గంటల సమయంలో తాను పురుగుల మందు తాగానని,  బస్టాండ్‌ సమీ పంలో ఉన్నానని మంచిర్యాలలో ఉంటున్న తన అక్కకు వాట్సప్‌ మెసేజ్‌ ద్వారా తెలిపాడు. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విష మించి శనివారం మృతి చెందాడు. తండ్రి శంకరయ్య అలియాస్‌ బాపు ఫిర్యాదు మేరకు ఎస్సై దత్తాత్రి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-12T09:52:43+05:30 IST