త్వరలో లోకేశ్‌ పాదయాత్ర!

ABN , First Publish Date - 2022-05-31T08:13:45+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత లోకేశ్‌ త్వరలో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. జగన్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో..

త్వరలో లోకేశ్‌ పాదయాత్ర!

పదేళ్ల తర్వాత తండ్రి బాటలో తనయుడు

రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిపాటు నిర్వహణ

ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న యువనేత

అక్టోబరు 2 నుంచి ప్రారంభించే చాన్సు

ముందస్తు ఎన్నికల సంకేతాలుంటే

యాత్ర ముందుకు జరగొచ్చు!

ఒంగోలు మహానాడు ఊపు

కొనసాగించేందుకు టీడీపీ ప్రణాళిక

నెలకు 2 జిల్లాల్లో బాబు పర్యటన

బాదుడే బాదుడు కొనసాగింపు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత లోకేశ్‌ త్వరలో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. జగన్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తమ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే లక్ష్యంతో ఈ పాదయాత్ర సాగనుంది. తండ్రి చంద్రబాబు బాటలో పదేళ్ల తర్వాత ఆయన తనయుడు లోకేశ్‌ పాదయాత్రకు సన్నద్ధం కావడం విశేషం. సరిగ్గా పదేళ్ల కిందట చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. హిందూపురంలో మొదలైన ఆయన పాదయాత్ర తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్రలోని విశాఖ చేరుకుని అక్కడ ముగిసింది.


ఆ తర్వాతి పరిణామాల్లో రాష్ట్రం విడిపోయినా విభజిత ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఆయన పాదయాత్ర దోహదం చేసింది. ప్రస్తుతం టీడీపీ ప్రతిపక్ష పాత్రలో ఉన్న సమయంలో ఆయన కుమారుడు లోకేశ్‌ పాదయాత్ర బాధ్యతను తలకెత్తుకోవడానికి సన్నద్ధమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సందర్శించేలా ఏడాదిపాటు సుదీర్ఘంగా నిర్వహించడానికి ఆయన ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబరు రెండో తేదీన గాంధీజయంతి నాడు పాదయాత్ర ప్రారంభించాలని ప్రస్తుతానికి భావిస్తున్నా.. దానిపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు. గతంలో చంద్రబాబు కూడా అదే తేదీన తన పాదయాత్ర ప్రారంభించారు. ఆ సెంటిమెంటుతో ఆ తేదీపైనే టీడీపీ నేతలు మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్యలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలను బట్టి నిర్ణయిస్తారని అంటున్నారు. ముందస్తు ఎన్నికల సంకేతాలు ఉంటే పాదయాత్ర తేదీ ముందుకు జరిగినా ఆశ్చర్యం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 


ప్రతి జిల్లాలో 3 రోజులు బాబు మకాం..

ఒంగోలు మహానాడు బహిరంగ సభకు ప్రజానీకం వెల్లువెత్తడంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం వెల్లివిరుస్తోంది. ఈ ఊపును ఇలాగే కొనసాగించడానికి టీడీపీ అధినాయకత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. లోకేశ్‌ పాదయాత్ర కూడా అందులో భాగమే. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా దీనికి సమాంతరంగా జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఒకట్రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం కాకుండా.. ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు మకాం పెట్టాలన్నది ఆయన యోచన. కొత్త జిల్లాలు లేదా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా ఆయన పర్యటనలు ఉంటాయి. మొదటి రోజు మహానాడు పేరుతో విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. రెండో రోజు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో విడివిడిగా సమావేశమై.. అక్కడి రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.


మూడో రోజు ఆ జిల్లాలో ఒకట్రెండు ప్రజా సమస్యలను ఎంపిక చేసుకుని.. క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తారు. దీనివల్ల పార్టీ శ్రేణులు, ప్రజలతో మమేకం కావచ్చని ఆయన భావిస్తున్నారు. ఏడాది వ్యవధిలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల పర్యటన పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ ఇద్దరూ ప్రజల్లో ఉండడం పార్టీకి ఊపు తెస్తుందని.. రాబోయే ఎన్నికల సమరానికి శ్రేణులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడానికి ఉపయోగపడుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయు. ఇదే సమయంలో పార్టీలో అంతర్గతంగా చేయాల్సిన కసరత్తు కూడా పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇంకా సుమారు 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను ఖరారు చేయాల్సి ఉంది. కొన్నిచోట్ల పోటీ ఎక్కువగా ఉండగా.. ఇంకొన్ని చోట్ల ఇంకా సరైన అభ్యర్థిపై స్పష్టత రావడం లేదు. మరికొన్ని చోట్ల నేతల మధ్య అంతర్గత వైరుధ్యాలు, గ్రూపు తగాదాలు ఉన్నాయి. వీటి పరిష్కారంపైనా దృష్టి పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.


ఇంకోవైపు.. మహానాడులో జగన్‌ ప్రభుత్వంపై సమర శంఖం పూరించిన టీడీపీ నాయకత్వం దాని కొనసాగింపుగా ఇంటింటికీ పార్టీ శ్రేణులు వెళ్లేలా కార్యక్రమం రూపొందిస్తోంది. ప్రభుత్వం వేస్తున్న భారాలు, పన్నులు, పెంచిన ధరలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని మరి కొంత కాలం పొడిగించాలని నిర్ణయించారు. మే నెలతోనే దీనిని ముగించాలనుకున్నా స్పందన బాగుండడంతో మరి కొంత కాలం దీనిని కొనసాగించనున్నారు. జగన్‌ ప్రభు త్వ పాలనపై అసహనంగా ఉన్న వర్గాలను దరి చేర్చుకోవడానికి ఆయా వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించే ఆలోచన కూడా టీడీపీ నాయకత్వం చేస్తోంది. పార్టీలో కొందరు సీనియర్లు ఇంకా పూర్తి స్థాయిలో ప్రజా క్షేత్రంలోకి రాకపోవడాన్నీ సీరియ్‌సగా తీసుకుంటోంది. మొదట వారిని పిలిపించి మాట్లాడి ఉత్సాహపరచాలని చంద్రబాబు భావిస్తున్నారు. వారి స్థానంలో ప్రత్యామ్నాయంపై ఆలోచించే అవకాశం ఉంది.

Updated Date - 2022-05-31T08:13:45+05:30 IST