అమ్మమ్మ చెప్పిన చందమామ కథలతోనే..

ABN , First Publish Date - 2022-07-07T16:56:17+05:30 IST

పోలెండ్‌ దేశంలోని ఆస్ర్టోనాట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో మన దేశం తరఫున ఓ అమ్మాయి కఠోన శిక్షణను పూర్తి చేసుకుంది.

అమ్మమ్మ చెప్పిన చందమామ కథలతోనే..

పోలెండ్‌ దేశంలోని ఆస్ర్టోనాట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో మన దేశం తరఫున ఓ అమ్మాయి కఠోన శిక్షణను  పూర్తి చేసుకుంది. అంతర్జాతీయంగా కేవలం ఆరుగురినే ఈ శిక్షణ కోసం నాసా ఎంపిక చేసింది. అందులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి దంగేటి జాహ్నవి ఒకరు.   అంతర్జాతీయ వ్యోమగామి శిక్షణ పొందిన పిన్న వయస్కురాలైన జాహ్నవిని ‘నవ్య’ పలకరించగా ఆ విశేషాలను చెప్పుకొచ్చిందిలా.. 


అది పోలెండ్‌లోని ‘ఆస్ర్టా 45 మిషన్‌’. అక్కడికి ఓ బృందంగా వెళ్లాం. మొత్తం ఆరుగురం. అందులో ముగ్గురు మహిళలం. అందరికంటే చిన్నదాన్ని నేను. స్పేస్‌ పైలెట్‌ శిక్షణ కోసం అక్కడికి వెళ్లాం. ఆ కృత్రిమ స్పేస్‌లో సూర్యకాంతి లేదు. మట్టి లేకుండా చెట్లను పెంచటలో సిజెర్మషన్‌.. లాంటి ప్రయోగాలు చేశాం. ప్రతి రోజూ ఓ అద్భుతమైన అనుభూతి. సవాల్‌ కూడా.


ప్రతి రోజూ ఓ సవాల్‌! 

శిక్షణలో భాగంగా.. ఒక రోజు పర్వతాల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత ఒంటరిగా మమ్మల్ని వదిలేసి ఓ పాయింట్‌ను నిర్దేశించారు. అక్కడికి చీకటిలో నడుస్తూ ఆ పాయింట్‌ను గుర్తించడానికి 8,109 అడుగులు నడిచా. ఆ ప్రయాణంలో రకరకాల జంతువుల్ని చూశా. ఇక పోతే అసలైన శిక్షణ విషయానికొస్తే.. విభిన్నమైన పరిసరాలవి. వాటిని తట్టుకోవడం కష్టం. సూర్యుడిని చూడకుండా 15 రోజులు అక్కడే గడిపా. రోజుకు కేవలం రెండు లీటర్లు నీటిని మాత్రమే తాగేవాళ్లం. రోజులో ఎన్నిసార్లు వాష్‌రూమ్‌కి వెళ్లామనేది కూడా అక్కడ కౌంట్‌ చేస్తారు. అంత కఠినమైన శిక్షణ అది. నా పక్కన ఉండే వాళ్లంతా బీఫ్‌, ఫోర్కు తిన్నారు. నేను మాత్రం బ్రెడ్‌, బిస్కెట్‌, కార్నె మాత్రమే తిన్నా. ఆ కఠినమైన సమయాన్ని మర్చిపోలేను. ఒకామెకి కిడ్నీ నొప్పి వచ్చింది. వైద్యం చేయించుకుని అక్కడే గడిపాం. స్పేష్‌ డోర్స్‌ ఓపెన్‌ చేస్తే మిషన్‌ మధ్యలో ఆగిపోతుంది. దీనివల్ల సమయం, డబ్బు వృథా అవుతుందని నిర్వాహకులు ముందే చెప్పారు. అందుకే వెనకడుగు వేయలేదు. చంద్రుని మీద ఎలా ఉండాలనే విషయంపై ఇలా శిక్షణ పొందాం. శిక్షణ నుంచి బయటికి వచ్చాక సూర్యకాంతిని చూడలేకపోయా. 


ఆందుకే ఈ రంగంలోకి.. 

పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం జగన్నాథపురం మా ఊరు. నాన్న పేరు దంగేటి శ్రీనివాసరావు, అమ్మ పేరు పద్మశ్రీ. ఇద్దరూ గల్ఫ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్నప్పటినుంచి అమ్మమ్మ దగ్గరే ఉండేదాన్ని. రాత్రిపూట నిద్రపోకుండా ఉంటే ‘చందమామ కథలు’ చెప్పేది అమ్మమ్మ. అలా చందమామపై ప్రేమ పుట్టింది. పాలకొల్లులోని మాంటిసొరి పాఠశాలలో చదివా. హైస్కూల్‌ సమయంలో స్పేష్‌ ప్రాజెక్టులు చేశా. ఇంటర్‌లో ఎంపీసీ చదివా. ప్రస్తుతం పంజాబ్‌కు చెందిన జలంధర్‌ పట్టణంలోని లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీలో బిటెక్‌ రెండో సంవత్సరం (ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌) చదువుతున్నా. ఆస్ర్టానూన్‌ సైకాలజీ కూడా చేశా. గతంలో గోవా, అండమాన్‌ నికోబార్‌లోని 30 అడుగుల లోతు సముద్రంలోకి దిగి శిక్షణ తీసుకున్నా. 


అదే నా కల...

ఏదైనా సాధించాలనే సంకల్పం చిన్నప్పటి నుంచే ఉంది. అందరికంటే కొత్తగా ఉండాలనేది నా తత్వం. పేరెంట్స్‌ ప్రోత్సాహం వల్లే ఇలా ఉన్నా. భయపడకూడదని చెప్పేవారు. ఆర్థికంగా స్తోమత పెద్దగా లేకున్నా వాళ్లు ఏనాడూ నా విషయంలో వెనకాడలేదు. స్పేస్‌లోకి వెళ్లినవాళ్లంతా నాకు స్ఫూర్తి ప్రదాతలే. అబ్దుల్‌ కలాం నా ఫేవరేట్‌ సైంటిస్ట్‌. చంద్రుని మీదకు వెళ్లాలనేదే నా కల. నా లాంటి సామాన్యురాలికి ప్రభుత్వాలు సహకరిస్తే దేశం తరఫున మరిన్ని రికార్డులు సాధిస్తా. 

సూర్యుడిని చూడకుండా 15 రోజులు అక్కడే గడిపా. రోజుకు కేవలం రెండు లీటర్లు నీటిని మాత్రమే తాగేవాళ్లం. రోజులో ఎన్నిసార్లు వాష్‌రూమ్‌కి వెళ్లామనేది కూడా అక్కడ కౌంట్‌ చేస్తారు

ఎంబివి సారథి, రాజమహేంద్రవరం.

Updated Date - 2022-07-07T16:56:17+05:30 IST