నిప్పుల బాటలో యువ భారతం

ABN , First Publish Date - 2022-06-22T10:36:09+05:30 IST

భారతదేశంలోని వివిధ నగరాల్లో ఉన్న విఎఫ్ఎస్ (వీసా ఫెసిలిటేషన్ సర్వీసెస్) కార్యాలయాలు, కాన్సలేట్ జనరల్ కార్యాలయాల ఎదుట ఎప్పుడు చూసినా వేలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు...

నిప్పుల బాటలో యువ భారతం

భారతదేశంలోని వివిధ నగరాల్లో ఉన్న విఎఫ్ఎస్ (వీసా ఫెసిలిటేషన్ సర్వీసెస్) కార్యాలయాలు, కాన్సలేట్ జనరల్ కార్యాలయాల ఎదుట ఎప్పుడు చూసినా వేలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేచి ఉండడం ఒక సాధారణ దృశ్యం. ఢిల్లీలోని శివాజీ స్టేడియం మెట్రోస్టేషన్‌లోని విఎఫ్ఎస్ సెంటర్ వద్ద మెట్లపై టిఫిన్ డబ్బాలు, మంచినీటి సీసాలు పట్టుకున్న కుటుంబ సభ్యుల కళ్లలో వీసా వస్తే చాలు తమ పిల్లల భవిష్యత్ భద్రమవుతోందన్న నమ్మకం కనిపిస్తుంది. రెండు నెలల క్రితం నకిలీ కన్సల్టెంట్ల సలహాతో నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి వీసాలు రాని విజయవాడ, గుంటూరు, వరంగల్, మెదక్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన అనేకమంది విద్యార్థులను అమెరికా రాయబార కార్యాలయ అధికారులు చాణక్యపురి పోలీసు స్టేషన్‌కు అప్పజెప్పారు. ఏటా కనీసం 8 లక్షలమంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతుంటే మన దేశంలో చదువుకునేందుకు విదేశాల నుంచి కేవలం 27వేల మంది మాత్రమే వస్తున్నారు. కేవలం ఫీజుల రూపంలోనే మన విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలకు రూ. 45వేల కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నారని, వారు ప్రతి ఏడాదీ విదేశాల్లో పెట్టే ఖర్చు జీడీపీలో ఒక శాతం మేరకు ఉంటుందని ఒక అంచనా.


మన దేశంలో చదువు పూర్తి చేసిన విద్యార్థులకు వెంటనే ఉద్యోగాలు దొరికే అవకాశాలు తక్కువ. మంచి కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు దొరికినా వారికి సంతృప్తికరమైన జీతాలు ఇచ్చే కంపెనీలూ తక్కువే. పనిపరిస్థితులు కూడా అంత సౌకర్యంగా ఉండవు. దేశంలో చదువుకుని ఉద్యోగం చేస్తే నాణ్యమైన జీవితం లభించదని విదేశాలకు వెళ్లే ప్రతి విద్యార్థీ చెబుతున్నాడు. విదేశాలకు వెళ్లిపోతే విద్య కొనసాగిస్తూనే చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసినా ఇక్కడి కంటే ఎక్కువ సంపాదించవచ్చునని వారు భావిస్తున్నారు. పది మంది నవతరం (జనరేషన్ జడ్) విద్యార్థుల్లో ఎనిమిది మంది విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలనుకుంటున్నారని ఒక సర్వే తెలిపింది. ఉక్రెయిన్‌లో యుద్దంలో చిక్కుకున్న విద్యార్థులను భారత దేశానికి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ గంగా పేరుతో విమానాలను పంపాం. కాని విదేశాలకు ఉపయోగపడుతున్న మన భారతీయు విద్యార్థులు, ఉద్యోగుల తెలివితేటల్ని మన దేశంలోనే ఉపయోగించుకునేందుకు ప్రధానమంత్రి మోదీ వద్ద ఏ కార్యాచరణ ప్రణాళిక ఉన్నది?


మన జాబ్ మార్కెట్ పరిస్థితి ఎంత దుస్థితిలో ఉన్నదో అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించగానే వెల్లువెత్తిన నిరసనను బట్టి అర్థమవుతోంది. ఈ నిరసనను తెలిపేవారెవరూ విదేశాలకు వెళ్లగలిగే ఉన్నతవిద్యను కానీ, నైపుణ్యాలను కానీ ఆర్జించిన వారు కారు. చాలా కాలంగా సైన్యంలో రిక్రూట్‌మెంట్లు జరగడం లేదు. దీని వల్ల అనేకమంది వయసు కూడా పెరిగింది. ఎన్నో ఏళ్లుగా సైన్యంలో ఉద్యోగాలు ప్రకటిస్తారని ఆశతో ఎదురు చూస్తున్న వారు, లేని ఉద్యోగాలకోసం పుట్టగొడుగుల్లా వెలిసిన అనేక కోచింగ్ సెంటర్లలో ఫిట్‌నెస్ కోసం శిక్షణ పొందుతున్నవారు, ఉన్నట్లుండి కేవలం నాలుగేళ్ల కోసమే ఈ ఉద్యోగాలు ప్రకటించారని, కేవలం పాతిక శాతం మందినే పర్మనెంట్ చేస్తారని, నాలుగేళ్ల తర్వాత తమకు పింఛను కూడా రాదని తెలిసి హతాశులయి ఆందోళనకు దిగారు.


అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించడంలో మోదీ ప్రభుత్వానికి అనేక కారణాలు ఉండవచ్చు. ప్రధానమైనది రిటైరైన సైనికులకు పెద్ద ఎత్తున పింఛను చెల్లించడంలోనే రక్షణ బడ్జెట్‌లో అధిక భాగం సరిపోవడం. భారీ ఎత్తున సాంకేతిక పరిజ్ఞానానికి, అధునాతన యుద్ధ పరికరాలకు ఖర్చు పెట్టాల్సిన మొత్తాన్ని జీతభత్యాలకే పరిమితం చేయడం వారికి ఇష్టం లేదు. అందువల్ల నాలుగేళ్లు పనిచేయించుకుని అందులో 75 శాతం మందికి ఎంతో కొంత చెల్లించి వదిలించుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖల్లో వచ్చే 18 నెలల్లో పది లక్షల మందిని నియమిస్తామని ప్రకటించడం ద్వారా నిరసనను అడ్డుకోవచ్చని మోదీ చేసిన ప్రకటన కూడా జనంపై ప్రభావం చూపలేదు. ప్రజాందోళన హింసాకాండకు దారితీయడం, వందలాది రైళ్ల రాకపోకలను రద్దు చేయాల్సి రావడంతో ఆగమేఘాలపై హోంశాఖ, రక్షణ శాఖ, పౌర విమాన శాఖతో పాటు ఇతర శాఖలు, బిజెపి పాలిత రాష్ట్రాలు అగ్నివీరులకు తమ పరిధిలో ఉన్న ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, తమ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ప్రకటించాయి.


అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయగలిగిన స్థైర్యం ఇవాళ ఏ ప్రభుత్వానికీ లేదు. లేనిపోని ఖర్చులు పెంచుకుని ఉన్న ఉద్యోగులకే జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రభుత్వ రంగ సంస్థల్లో రెగ్యులర్ ఉద్యోగుల శాతం తగ్గిపోతోంది. రోజువారీ, క్యాజువల్ వర్కర్ల సంఖ్య 2015–16లో 19 శాతం ఉండగా, ఇప్పుడది 40 శాతానికి పైగా చేరుకుంది. ప్రభుత్వ డేటా ప్రకారమే సైన్యంలో లక్షా 22వేల ఖాళీలు ఉన్నాయి. ఆఫీసర్ స్థాయి ఖాళీలే 8,362 ఉన్నాయి. ఆర్మీలో 97,177, నేవీలో 1,166, ఎయిర్ ఫోర్స్‌లో 4,850 ఖాళీలు ఉన్నాయని గత ఏడాది కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రే పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైల్వేలో 3లక్షలకు పైగా ఉద్యోగాలు, పోలీసు శాఖల్లో 5లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నదని ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. ప్రభుత్వమే వేలాది ఉద్యోగాలపై కోత విధిస్తోంది. గత ఆరేళ్లలో భారతీయ రైల్వే 72వేల ఉద్యోగాలపై కోత విధించింది. ఒక్క యూపీలోనే లక్ష పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆఖరుకు ఐఏఎస్ ఉద్యోగాల్లో కూడా 1500 ఖాళీలు ఉన్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక తెలిపింది, వైద్యశాఖలో కూడా వేలాది డాక్టర్లు, నర్సుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లక్షా పదివేల పాఠశాలల్లో కేవలం ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. దాదాపు 11 లక్షల మేరకు టీచర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ తెలిపింది. బిజెపి, దాని మిత్రపక్షాలు పాలిస్తున్న యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ లలో అత్యధిక టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీల్లో లక్షకు పైగా ఫ్యాకల్టీలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.. దేశంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటికి నిధులు మంజూరు అయినప్పటికీ వాటిని భర్తీ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని బిజెపి ఎంపి వరుణ్ గాంధీ ఒక ట్వీట్‌లో అన్నారు. ఉద్యోగాల కోసం కేటాయించిన నిధులు ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవడం ప్రతి అభ్యర్థి హక్కు అని ఆయన చెప్పారు. భారతీయ రైల్వేలో 90వేల క్రింది స్థాయి ఉద్యోగాలకు 2.5 కోట్ల మంది యువత దరఖాస్తు చేసుకున్నారంటేనే భారతీయ ఆర్థిక వ్యవస్థ అనుకున్న ప్రగతి సాధించలేదని అర్థమవుతోందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.


కనుక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు తగ్గిపోయిన నేపథ్యంలో కనీసం ఆర్మీలో కూడా ఉద్యోగాలు రావని తెలియడం ఆందోళనకు దారి తీసింది. ఏదో ఒక చిన్న పనిచేసుకుంటూ ప్రభుత్వోద్యోగాలు, ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ప్రభుత్వరంగంలో ఉంటే ఉద్యోగం సురక్షితంగా ఉంటుందని, పింఛను వస్తుందని అనుకునే వారు మన దేశంలో ఎక్కువ. నాలుగేళ్లు పనిచేసి పనికి రానివారమనిపించుకుని తిరిగి గ్రామాలకు వస్తే ఏం గౌరవం ఉంటుంది? ఇదివరకు సైన్యంలో పనిచేసి వచ్చినవారంటే ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడా గౌరవం కూడా మిగలదు.


భారతదేశంలో ప్రైవేట్ రంగం ఉద్యోగకల్పనలో కీలక పాత్ర పోషించే పరిస్థితి ఇంకా రాలేదు. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు అవుతున్నాయని ప్రభుత్వం చెప్పుకుంటున్నా నిరుద్యోగ రేటు పెరుగుతున్నదే కాని తగ్గడం లేదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గణాంక వివరాలు చెబుతున్నాయి. ఉద్యోగాలు రావని ఆశించి భంగపడి హింసాత్మక నిరసనలు తెలుపడం దేశంలో కొత్త కాదు. గయలో రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగినందుకు ఖాళీ బోగీలకు నిప్పుపెట్టారు. ఈ నిరసనలు బిహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వ్యాపించాయి.


అగ్నిపథ్‌పై కేవలం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే హింసాత్మక నిరసనలు జరిగాయని బిజెపి నేతలు చెప్పడంలో వాస్తవం లేదు. బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా తదితర రాష్ట్రాల్లో కూడా హింసాకాండ జరిగింది. గుజరాత్‌లో జామ్ నగర్ రిక్రూట్‌మెంట్ ఆఫీసు ముందు నిరసన ప్రదర్శనలు జరిగాయి. బిహార్‌లో పది మంది బిజెపి నేతలకు భద్రత కల్పించాల్సి వచ్చింది. బిహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఇంటిపై, పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నదని తెలిసినందువల్లే వారు స్థానిక బిజెపి నేతలపై దాడి చేశారని జెడి(యు) నేత లలన్‌సింగ్ అన్నారు.


ఏ పథకం గురించి అయినా ప్రజలను ఒప్పించలేకపోతే ఆ ప్రభుత్వం ప్రజల మనోభావాలను సరిగా అర్థం చేసుకోనట్లే. అగ్నిపథ్ పథకాన్ని మోదీ ప్రభుత్వం బాగా ఆలోచించి రూపొందించి ఉండవచ్చు. అయితే ప్రజల ప్రతిస్పందన ప్రతికూలంగా ఉండగలదని ఊహించలేకపోయింది. సంభవిస్తున్న పరిణామాలే అందుకు నిదర్శనం. అసలు మోదీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇదే విధంగా ఉంటున్నాయి. ‘తమ నిర్ణయాలు స్వల్పకాలికంగా బాగు లేవని అనిపించవచ్చు కాని దీర్ఘకాలంలో వాటి ప్రయోజనాలు అధికంగా ఉంటాయని’ మోదీ అన్నారు. మున్ముందు నిరుద్యోగులైన కోట్లాది యువజనులు ఏ విధంగా మారుతారో, సుశిక్షితులై, తిరస్కృతులై తిరిగి వచ్చిన యువత వైఖరి ఎలా ఉంటుందో ఊహిస్తే ఆందోళనకరంగానే ఉంటుంది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-06-22T10:36:09+05:30 IST