Abn logo
Nov 30 2020 @ 03:39AM

ఓటీటీ అడ్డాలో యువ కెప్టెన్లు... హిట్టు గురూ!

విజయానికే విలువ ఎక్కువ.

ఓటీటీలోనైనా... థియేటర్లలోనైనా!

హిట్టు సినిమా తీస్తేనే గుర్తింపు

పరిశ్రమలోనైనా... ప్రేక్షకుల్లోనైనా!!

కరోనా కాలంలో... ఓటీటీ వేదికల్లో...

‘హిట్టు గురూ’ అనిపించుకున్నదెవరు?

యువ కెప్లెన్లే! వాళ్లెవరో ఓ లుక్కేయండి!!


సినిమా హిట్టు గురూ... ఈ మాట వినిపిస్తే చాలు! ప్రేక్షకులు, పరిశ్రమలో పెద్దల నుంచి చిన్నల వరకూ... ప్రతి ఒక్కరి దృష్టి ఆ చిత్రదర్శకుడి మీద పడుతుంది. అందరి కళ్లూ ఆ చిత్రానికి కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ (దర్శకుడు) మీదే! అతడికి అదే తొలి చిత్రమైనా ఫర్వాలేదు... ప్రశంసల జల్లు కురిపిస్తారు. కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీ వేదికల్లో విడుదలయ్యాయి. అందులో కొన్ని ప్రశంసలు అందుకున్నాయి. అవి యువ కెప్టెన్లు తీసినవే కావడం గమనార్హం. తొలి చిత్రంతోనే కొందరు, మలి చిత్రంతో మరికొందరు నెట్టింట్లో వీక్షకుల ముందు వినోదాల విందు వడ్డించారు. తమ ఖాతాల్లో విజయాల్ని వేసుకున్నారు.


కరోనా కాలంలో ‘హిట్టు గురూ’ అనిపించుకున్న తొలి చిత్రం ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’. దీనికి రవికాంత్‌ పేరేపు దర్శకుడు. ఆయనకిది రెండో చిత్రమే. తొలి చిత్రం ‘క్షణం’ థ్రిల్లర్‌ అయితే... మలి చిత్రం యువతరం మెచ్చిన నవతరం ప్రేమకథ. ‘కేరాఫ్‌ కంచరపాలెం’తో విమర్శకులు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఓటీటీలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’తో వీక్షకుల ప్రశంసలందుకున్నారు. ఆయనకూ రెండో చిత్రమిది. ఓ సామాన్యుడి ప్రతీకారాన్ని తెరపై చూపిస్తూనే సున్నితమైన వినోదంతో చిన్నగా నవ్వించారు. మార్చిలో థియేటర్లలో విడుదలైన ‘పలాస 1978’తో దర్శకుడితో పరిచయమైన కరుణకుమార్‌, ‘మెట్రో కథలు’తో ఓటీటీ వీక్షకులను పలకరించారు.


ఓటీటీ అడ్డాలో వేడి వేడి విజయం ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’దే. దర్శకుడు వినోద్‌ అనంతోజుకు తొలి చిత్రమిది. అయితేనేం? ఇంటిల్లిపాదీ చూసే ఆహ్లాదకరమైన చక్కటి వినోదాత్మక చిత్రం అందించారు. వినోదం కోసం అడ్డదారులు తొక్కలేదు. కథతో, పాత్రలతో వీక్షకులను ప్రయాణం చేయించారు. సినిమాలోని పాత్రల్లో చాలామంది తమను తాము చూసుకున్నారు. ‘భానుమతి అండ్‌ రామకృష్ణ’తో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్‌ నాగోతి కూడా అంతే! హీరోలో మధ్యతరగతి యువకులు, హీరోయిన్‌లో నగర వాతావరణంలో పెరిగిన అమ్మాయిలు తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా సినిమా తీశారు. కరోనా కాలంలో నలుగురి నోళ్లలో నానిన మరో చిత్రం ‘కలర్‌ ఫొటో’. దీనికి సందీప్‌ రాజ్‌ దర్శకుడు. అతనికీ తొలి చిత్రమిది. అయితే, ఇంతకు ముందు యూట్యూబ్‌లో లఘు చిత్రాలు తీసిన అనుభవం ఉంది. ఈ చిత్రంతో రెండున్నర గంటల చిత్రం సైతం తీయగలనని నిరూపించుకున్నారు. వర్ణవివక్ష నేపథ్యంలో మంచి ప్రేమకథను, భావోద్వేగభరిత చిత్రాన్ని వీక్షకులకు అందించారని ప్రశంసలు అందుకున్నారు. కొత్త దర్శకులు ముగ్గురూ తీసిన చిత్రాల్లో కామన్‌గా కనిపించేవి? ప్రేమ, మధ్యతరగతి నేపథ్యం! ఈ రెండిటితో పాటు రాజకీయాలు మేళవించి ఆలోచనాత్మక చిత్రం ‘జోహార్‌’ తీసినది దర్శకుడు తేజ మార్ని. సామాన్యుడి జీవితాలను విగ్రహ రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేశాయన్నది ఆయన చూపించారు. ఆయనకూ ఇదే తొలి సినిమా. ఈ విధంగా కొంతమంది కొత్త దర్శకులు వీక్షకులను ఆకట్టు కున్నారు.


థియేటర్ల విఘ్నం దాటాలి మరి!

సినిమా ఇండస్ట్రీలో ‘ద్వితీయ విఘ్నం’ అనే మాట వినిపిస్తుంటుంది. తొలి చిత్రంతో విజయాన్ని ఖాతాల్లో వేసుకున్న దర్శకులు, మలి చిత్రంతో ఆ మేజిక్‌ మళ్లీ రిపీట్‌ చేయలేరనేది దాని సారాంశం. గతంలో కొందరు దర్శకులు ద్వితీయ విఘ్నాన్ని దిగ్విజయంగా దాటారు. అయితే, ఈ కొత్త దర్శకులు థియేటర్ల విఘ్నం దాటాలి. నిజం చెప్పాలంటే... వీళ్లంతా థియేటర్లలో విడుదల చేయాలనే సినిమాలు తీశారు. కానీ, కాలం కలిసి రాలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ వేదికల్లో విడుదల చేశారు. థియేటర్లకు వెళ్లే అవసరం లేదు కాబట్టి ఎవరి ఇళ్లల్లో వాళ్లు కూర్చుని ఓటీటీల్లో ఈ సినిమాలను జనం చూశారనే విమర్శలు ఓ వైపు వినిపిస్తున్నాయి. మరోవైపు థియేటర్లలో తమ సినిమాలు విడుదలైతే జాతకాలు మారి పోయేవనే భావన ఆ దర్శకుల్లో ఉంది. అందుకని, తదుపరి చిత్రంతో థియేటర్ల విఘ్నం దాటాల్సిన అవసరం వీళ్ల మీద ఉంది.


Advertisement
Advertisement
Advertisement