ఆర్థిక శక్తిగా అమెరికా ప్రపంచ అగ్రస్థానాన్ని అందుకున్న దెప్పుడు? 1920వ దశకంలోనని అంతర్జాతీయ గణాంకాలు చెపుతాయి. అదే దశాబ్దంలో సినిమా, టెలిఫోన్, రేడియో, కారు లాంటి సాంకేతికతలు సమాజ జీవితంలో ప్రాధాన్యం పొందడాన్ని ప్రపంచం యావత్తు సంభ్రమాశ్చర్యాలతో గమనించింది. అమెరికన్ సినిమా పరిశ్రమ హాలీవుడ్ అప్పుడే జన్మించింది. నిశ్శబ్ద చిత్రాలతో మొదలై శబ్ద గ్రహణ చిత్రాలవైపు పెనువేగంతో పయనించింది. ఆ దశాబ్దంలో దాదాపు ఏడువందల చిత్రాలు నిర్మాణమై ప్రేక్షకులను అలరించాయి. కనుకనే 1920వ దశకాన్ని ఆధునిక చరిత్రలో అత్యంత వినోదదాయకమైనదిగా చరిత్రకారులు పరిగణిస్తారు. అద్భుత వినోదం, ఇబ్బడిముబ్బడిగా వస్తులభ్యత. వినియోగదారీ సంస్కృతి పురివిప్పిన కాలమది. అది సకల దేశాలకూ ప్రేరకమైంది. వీటన్నింటినీ మించి సంగీత నృత్య గానాలలో కొత్త రీతులు; యువత అభిరుచులు, అలంకరణ, వస్త్రధారణ, జీవనశైలిలో పెనుమార్పులు; కదం తొక్కిన అమెరికన్ యువతుల స్వేచ్ఛా కాంక్ష లాంటి పరిణామాలు ఆ పదేళ్లలో అమెరికన్ ప్రజా జీవితంలో అంతులేని ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాయి. అందుకే 1920 దశాబ్దాన్ని ‘రోరింగ్ ట్వంటీస్ ’ (గర్జించే ఇరవైలు)గా పిలుస్తారు.
మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ముగిసింది. నాలుగేళ్ల ఆ మారణహోమంలో నాలుగు కోట్ల మంది ప్రాణాలు ఆహుతయ్యాయి. ప్రపంచమంతటా, ముఖ్యంగా ఐరోపాలో, అలుముకున్న విషాద ఛాయలతో ప్రజలను నిర్లిప్తత ఆవహించింది. హఠాత్తుగా ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, భారీ నిర్మాణ రంగాల్లో పనిచేసేవారు కరువయ్యారు. ఆ లోటును మహిళలు, ఆఫ్రికన్ – అమెరికన్ (ఆనాటికి వీరిని ఇంకా నల్ల జాతివారనే అనేవారు)లు పూరించవలసి వచ్చింది. ఇది కాక ఆర్జనపరులైన పురుషులను కోల్పోయిన ఇళ్లలో మహిళలు తమ కుటుంబాల పోషణకై ఉద్యోగ ఉపాధి రంగాల్లో అడుగుపెట్టవలసి వచ్చింది. ఈ విధంగా పనిచేసే మహిళల సంఖ్య అమాంతం పెరిగి వారి ఆర్థిక స్వావలంబనకు దారి తీసింది.
సరిగ్గా 1920లలోనే తారస్థాయికి చేరుకున్న సఫ్రాజెట్ ఉద్యమం (మహిళలకు ఓటు హక్కును కల్పించడానికి ఉద్దేశించినది), ఆరోగ్యం క్షీణించిన అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ భార్య ఎడిత్ విల్సన్ ఆయన వెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపించడం మహిళా సాధికారతను ప్రతిబింబించే అంశాలుగా పేర్కొంటారు. వీటికన్నా ముఖ్యంగా 1920ల్లో ఉత్తేజాన్ని ఉద్వేగాన్ని నింపిన పరిణామం ‘ఫ్లేపర్’ (flapper) ఉద్యమం. ‘ఫ్లేపర్స్’ అంటే కట్టుబాట్లను, కుటుంబ సామాజిక నియంత్రణను, సంప్రదాయ పద్ధతులను తిరస్కరించి, అలంకరణ, వస్త్రధారణ, అలవాట్లలో కొత్త పుంతలు తొక్కుతూ, తమ అస్తిత్వాలను బిగ్గరగా చాటిచెప్పిన యువతులు. 19వ శతాబ్దపు తుది దశకంలో కౌమార లేదా యవ్వన దశలో ఉన్న అమ్మాయిలను, టపటపమని రెక్కలు ఆడిస్తూ తిరిగే ఎదిగీ ఎదగని బాతు పిల్లలతో పోల్చేవారు. ఆ రెక్కలాడించడాన్ని ఆంగ్లంలో ‘ఫ్లేపింగ్’ అంటారు గనుక ఆ తరం అమ్మాయిలను– ముఖ్యంగా చురుకుపాళ్ళు అధికంగా కలవారిని– ఫ్లేపర్స్గా పిలిచేవారు. ఈ నామకరణానికి 1920ల్లో వేరే అర్థాన్ని ఆపాదించారు. యువతులు తమ బూట్ల బెల్టులను బకల్స్ను వదిలేసి వడివడిగా అడుగులు వేస్తుంటే వచ్చే శబ్దాన్ని (ఫ్లేప్) బట్టి ఫ్లేపర్స్ అన్న పేరు సార్థకమైపోయింది.
ఫ్లేపర్స్ ఒక వినూత్న సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఆర్థిక స్వావలంబన, సాంకేతిక గృహోపకరణాల లభ్యత, టెలిఫోన్ విస్తృతి, ఆటో మొబైల్స్ (1925 కల్లా ఫోర్డ్ కంపెనీ ఉత్పత్తి చేసిన నలభై లక్షల కార్లు రోడ్లపై తిరుగాడుతుండేవి) మొదలైన వాటితో పెరిగిన జీవన చలనశీలత మహిళల సాధికారతకు విశేషంగా తోడ్పడింది. ఈ సాధికారతను నాటి యువతులు మరొక రెండు అంచెలు దాటించి తమ ముద్రకలిగిన ఒక విలక్షణ ఉపసంస్కృతి (సబ్ కల్చర్)ను సృష్టించారు. అమెరికన్ సమాజంలో ఫ్లేపర్స్ రేపిన అలజడి నాటి కులీన విక్టోరియన్ సంస్కృతికి, పురుషాధిక్యతకు సవాలు విసిరింది. యువతులు బహిరంగంగా ధూమపానం చేయడం, మద్యపానంపై నిషేధం ఉన్నా పురుషులతోపాటు అలవోకగా మద్యం సేవించడం ఛాందస వర్గాలను ఆందోళనకు గురిచేశాయి. సంప్రదాయ మహిళలు ఈ నవీన యువతులను బాహాటంగా సమర్థించకపోయినా వారి వేషభాషలు చూచి ముచ్చటపడేవారు. ఫ్లేపర్స్లో కొట్టొచ్చినట్లు కనిపించేది వారి కేశాలంకరణ. అంతవరకు మహిళలకు సహజ సిద్ధమైన ఫ్యాషన్‌గా వందల ఏళ్ళ పాటు కొనసాగిన వంకీల పొడుగాటి జుట్టును తృణీకరించి యువకులవలె తమ కేశాలను ‘బాబ్’ చేయించుకున్నారు ఫ్లేపర్స్. చార్లీ చాప్లిన్తో హీరోయిన్గా నటించిన హాలీవుడ్ తార లూయి బ్రూక్స్ తన ‘బాబ్డ్’ హెయిర్ స్టైల్‌తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. అప్పటివరకు చెలామణీలో ఉన్న వస్త్రధారణను కూడా ఫ్లేపర్స్ తోసిరాజని కురచ స్కర్టులు ధరించసాగారు.
రేడియోలో పాటలు సంగీతం వింటూ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలసి నృత్యం చేయడం ఇళ్లల్లో పరిపాటిగా మారి అవే నృత్యగానాలు ఒక విస్తృతమైన రూపాన్ని సంతరించుకున్నాయి. ఆ నృత్యాలు ‘జాజ్’ వాయిద్యాల హోరుకు ఒక సొగసును ఆపాదించాయి. ఆ దశాబ్దంలో యువతను అన్నింటికన్నా ప్రభావితం చేసింది ‘జాజ్’ సంగీతం. ఈ సంగీతానికి లయబద్ధంగా సాంప్రదాయేతర నృత్యం చేయడంలో నాటి ఫ్లేపర్స్ కొత్త రీతులను ఆవిష్కరించారు. నల్ల జాతీయుడైన సిసిల్ మాక్ రచితమైన ‘ది చార్లెస్టన్’ గీతానికి అనుగుణంగా రూపుదిద్దుకున్న నాట్యానికి నల్ల జాతీయురాలు, నర్తకీమణి, పౌర హక్కుల ఉద్యమకారిణి జోసెఫిన్ బేకర్ తన నాట్య కౌశలంతో కొత్త భంగిమలను జోడించి దానికి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టారు. 1923 కల్లా ఫ్లేపర్ గర్ల్స్ చార్లెస్టన్ డాన్స్ అవిభాజ్యమైపోయాయి. చూపరులను విపరీతంగా ఆకట్టుకున్నా మేధావి వర్గం, సంప్రదాయ కళాకారులు ఈ కొత్త నాట్య భంగిమలను నిరసించారు. ఈ విధంగా ఒక సగటు అమెరికన్ యువతి పాట, మాట, భాష, నడక, హావ భావ ప్రదర్శన, నృత్యం, అలవాట్లు, ఫ్లేపర్స్ వలన సమూలంగా మారిపోయాయి. ‘పెటింగ్ పార్టీ’ పేరుతో లైంగిక స్వేచ్ఛను అనుభవిస్తూ వీరు స్వేచ్ఛకు కొత్త భాష్యం చెప్పారు.
ఉరకలు వేసిన 1920లు అమెరికాలో స్వేచ్ఛా విపణికి బీజం వేసాయి. ఆ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఇమిడి ఉన్న అంతర్గత వైరుధ్యాల వలన అది అదుపు తప్పింది. ఫలితంగా 1930ల్లో తీవ్ర ఆర్థిక మాంద్యం అమెరికాను కృంగదీసింది. ఒక దశాబ్దమంతా సిరి సంపదలు, అవధులు మీరిన వినోదం, జీవితంలో ఆనందాన్ని అనుభవించడంలో గడిపిన అమెరికన్ల స్థైర్యాన్ని ఆర్థిక మాంద్యం కకావికలు చేసింది. ఈ సమస్యల నేపథ్యంలో ప్రాధాన్యాలు మారి ఫ్లేపర్లు క్రమేణా తమ ప్రభను కోల్పోయారు. అయితే ఇప్పటికి వందేళ్లు పూర్తిచేసుకున్న ‘ఫ్లేపర్ యువతి’ చరిత్రను సృష్టించింది. శతాబ్దాల మహిళా సాధికారత ఉద్యమంలో తాను కూడా ఒక చిరుదివ్వయి వెలిగింది.
కొట్టు శేఖర్