మీలో రెండో ఆలోచన మొదలైంది!

ABN , First Publish Date - 2022-07-02T08:09:35+05:30 IST

మీలో రెండో ఆలోచన మొదలైంది!

మీలో రెండో ఆలోచన మొదలైంది!

పక్కచూపులు చూస్తే అందరం దెబ్బతింటాం

మనస్పర్థలుంటే చర్చలతో పరిష్కరించుకుందాం

అభిప్రాయ భేదాలతో పార్టీని నాశనం చేయొద్దు

వైసీపీ నేతలు, కార్యకర్తలకు బొత్స హెచ్చరిక


విజయనగరం, జూలై 1(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో రెండో ఆలోచన మొదలైంది. పక్కచూపులు చూడొద్దు. అదే నిజమైతే అందరం నష్టపోతాం’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ శ్రేణులు, నేతలను హెచ్చరించారు. జిల్లా ప్లీనరీ వేదికపైనే ఆయనీ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారమిక్కడ జరిగిన జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ‘కార్యకర్తల్లో, నాయకుల్లో మనస్పర్థలుంటే చర్చించుకుందాం. పరిష్కరించుకుందాం. అంతే తప్ప అభిప్రాయ భేదాలతో పార్టీని నాశనం చేయొద్దు. మేమొక స్థాయికి వెళ్లాం.  అధికారం ఉన్నా లేకున్నా మాకేమీ కాదు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మీకే ఎక్కువ ఇబ్బందులుంటాయన్నది గుర్తించాలి’ అని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులనుద్దేశించి చెప్పారు. వైసీపీ పరిస్థితి బాగుందని, ముఖ్యమంత్రి పనితీరు బాగుందన్న గ్రాఫ్‌ ఉందని, దీనిని మనం నిలబెట్టాలని సూచించారు. పార్టీ కేడర్లో నెలకొన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి 100 రోజులకోసారి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు మంత్రి సూచించారు. మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఇదే మాదిరిగా సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. వీటి ద్వారా కార్యకర్తల కడుపులో ఉన్నవి బయటకు వస్తాయని, వారి సమస్యలు, ఇబ్బందులు జిల్లా సమావేశం దృష్టికి తీసుకొచ్చి.. లోటుపాట్లను సరిదిద్దుకుందామని చెప్పారు. రాష్ట్ర స్థాయి ప్లీనరీకి హాజరయ్యే కార్యకర్తలు, నాయకులకు అక్కడ ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. ఉపముఖ్యమంత్రి రాజన్నదొర మాట్లాడుతూ.. విమర్శలపై చేసే ప్రతి విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని, అంతే తప్ప బూతులు మాట్లాడటం మంచిది కాదన్నారు. తనకంటే జూనియర్‌కు మంత్రి పదవి, డిప్యూటీ సీఎం ఇచ్చారని.. అయినా తానెప్పుడూ బాధపడలేదని.. రూ.30 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టినా పార్టీ మారలేదని, అదే ఈ రోజు తనను ఉపముఖ్యమంత్రిగా నిలబెట్టిందని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. తాను స్వచ్ఛందంగా తప్పుకొంటేనే విజయనగరంలో మరొకరికి అవకాశం ఉంటుందని, అంతవరకు తానే ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు.


Updated Date - 2022-07-02T08:09:35+05:30 IST