కొత్తవి లేవు.. పాతవీ ఇవ్వరా?!

ABN , First Publish Date - 2021-12-22T16:08:14+05:30 IST

కొత్త ఉద్యోగాలు..

కొత్తవి లేవు.. పాతవీ ఇవ్వరా?!

డీఎస్సీ 2018 స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలపై సందిగ్ధం


అమరావతి(ఆంధ్రజ్యోతి): కొత్త ఉద్యోగాలు ఎలాగూ లేవు.. కనీసం గతంలో ఉద్యోగాల ప్రక్రియ పూర్తిచేసినా.. పోస్టింగ్‌ ఇచ్చే దిశగా కూడా విద్యాశాఖ చర్యలు తీసుకోవడం లేదు. 2018 డీఎస్సీలో ఎంపికైన స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల పరిస్థితి ఇది. ఈ కోటాలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా ఎంపికైనవారికి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయి 14 నెలలైనా ఇప్పటివరకు పోస్టింగులు లేవు. అభ్యర్థులు ఎక్కడికక్కడ జిల్లా విద్యాశాఖాధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తమ గోడు పట్టించుకోవాలంటూ స్పందనలోనూ అర్జీలిచ్చారు. ఇలా ఎన్నిసార్లు అర్జీలిస్తారని అక్కడి సిబ్బంది అడిగే పరిస్థితి వచ్చింది కానీ.. సమస్య మాత్రం పరిష్కారం కాలేదని అభ్యర్థులు వాపోతున్నారు.


ఈ నేపథ్యంలో ఇటీవలే.. డీఎస్సీ 2018లో మిగిలిపోయిన అన్ని కేటగిరీల్లో పోస్టులను నెలాఖరులోగా భర్తీ చేయాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. జిల్లా విద్యాశాఖాధికారులకు ఆ ఉత్తర్వులు పంపించింది. కానీ అన్ని కేటగిరీలు అని ఇచ్చినా కిందిస్థాయిలో డీఈవోలు స్పోర్ట్స్‌ కేటగిరీలో భర్తీచేయాల్సిన ఎస్జీటీ పోస్టులను మాత్రం పక్కన పెట్టేశారని తెలుస్తోంది. ఆదేశాలు రాలేదని చెప్తున్నారని, అసలు ఈ మతలబు  ఏమిటని బాధిత అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పోస్టింగులు ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - 2021-12-22T16:08:14+05:30 IST