మునుగోడులో గెలిచి తీరాలి

ABN , First Publish Date - 2022-08-13T09:09:54+05:30 IST

మునుగోడులో గెలిచి తీరాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ అన్నారు. ఇక్కడ విజయం సాధిస్తే, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు

మునుగోడులో గెలిచి తీరాలి

  • కేసీఆర్‌పై జనం కసితో ఉన్నారు
  • కార్యకర్తలందరూ హనుమంతుడి
  • వారసులుగా మారి లంకను కూల్చేయాలి
  • వచ్చే ఎన్నికల్లో వంద స్థానాలు గెలవాలి
  • బీజేపీ నాయకులకు తరుణ్‌ఛుగ్‌ పిలుపు
  • నేనూ మునుగోడు వస్తా.. మకాం వేస్తా
  • కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు మంచోళ్లు
  • నాయకులు మాత్రమే అమ్ముడుపోయేటోళ్లు
  • కాంగ్రెసోళ్లు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారు: బండి
  • శక్తి కేంద్రాల ఇన్‌చార్జులకు నేతల దిశానిర్దేశం

హైదరాబాద్‌/నల్లగొండ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో గెలిచి తీరాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ అన్నారు. ఇక్కడ విజయం సాధిస్తే, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌పై జనం కసితో ఉన్నారని, బీజేపీ కార్యకర్తలందరూ హనుమంతుడి వారసులుగా మారి కేసీఆర్‌ లంకను కూల్చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ పాదయాత్ర శుక్రవారం మధ్యాహ్నం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఎన్నారం వద్దకు చేరుకుంది. భోజన విరామ సమయంలో పార్టీ నేతలు, శక్తికేంద్రాల ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్‌ఛుగ్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ బూత్‌ల వారీగా కమిటీలు వేసి, యువత, మహిళలు, రైతులకు స్థానం కల్పించాలని సూచించారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధించామని గుర్తు చేశారు. 


అదే పద్ధతిలో మునుగోడులోనూ నాయకులందరూ ఎక్కువ సమయం కేటాయించి పని చేస్తే, సులభంగా గెలవచ్చన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ  మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్దేశించబోతుందని అన్నారు. కార్యకర్తలందరూ మోదీలుగా మారి, మునుగోడులో బీజేపీని గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. ఇక్కడ బీజేపీ గెలిేస్త రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తానూ మునుగోడుకు వస్తానని, అక్కడే మకాం వేస్తానని ప్రకటించారు. ‘‘ఓటుకు రూ.30వేలు, మందు బాటిల్‌ ఇచ్చి టీఆర్‌ఎ్‌సను గెలిపించుకునేందుకు కేసీఆర్‌ ఇప్పటికే అన్నీ సిద్ధం చేసుకున్నడు. హుజూరాబాద్‌లో కూడా ఇట్లనే ఓటుకు రూ.10వేలు ఇచ్చి గెలవాలని చూసి బోల్తా పడ్డడు. ఈసారి ఓటు రేటు మరింత పెంచుతున్నడు. అయినా భయపడాల్సిన పని లేదు. ప్రజలందరూ మనవైపే ఉన్నరు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న విశేష స్పందనే ఇందుకు నిదర్శనం. 


ఇచ్చిన హామీలు అమలు చేయని టీఆర్‌ఎస్‌  నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? కాంగ్రెసోళ్ల గురించి మనం భయపడాల్సిన పని లేదు. వాళ్లలో వాళ్లే కొట్టుకు చస్తారు. కాంగ్రెస్‌ క్యాడరే ఆ పార్టీ నాయకత్వంపై కోపంతో ఉన్నరు. కమ్యూనిస్టు కార్యకర్తలు మంచోళ్లే కానీ.. లీడర్లే అమ్ముడుపోయేటోళ్లు. టీఆర్‌ఎస్‌ ఇచ్చే పైసలకు ఆశపడి సీపీఐ నేతలు అప్పుడే పొత్తుకు సిద ్ధమయ్యారు. బీజేపీ దెబ్బకు త్రిపుర, బెంగాల్‌లో ఆ పార్టీ కనుమరుగైంది. మునుగోడులోనూ అదే పరిస్థితి పునరావృతం కానుంది’’ అని అన్నారు. కాగా, పార్టీ చేరికల కమిటీ సభ్యులతో తరుణ్‌ఛుగ్‌ సమీక్ష నిర్వహించారు. పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న నేతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 21న జరిగే బహిరంగసభను విజయవంతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. అయితే, బాలి వెళ్లడంతో చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్‌ సమావేశానికి హాజరుకాలేదు. మరో సభ్యురాలు డీకే అరుణ.. జ్వరం కారణంగా పాల్గొనలేకపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-08-13T09:09:54+05:30 IST