కప్పం కట్టాల్సిందే

ABN , First Publish Date - 2022-08-17T05:43:34+05:30 IST

కర్నూలు జలవనరుల శాఖలో ముప్పై ఏళ్లుగా ఓ వర్క్‌ ఇనస్పెక్టర్‌ తిష్ట వేశాడు.

కప్పం కట్టాల్సిందే

  1. ఇరిగేషన శాఖలో పాతుకపోయిన వర్క్‌ ఇనస్పెక్టర్‌ 
  2. జేఈ, డీఈ, ఈఈల దోపిడీకి అతనే మూలస్తంభం
  3. లస్కర్ల రక్తం తాగుతున్న జల వనరుల శాఖ జలగలు 
  4. ప్రతి నెలా జీతంలో రూ.2వేలు ఇవ్వాల్సిందే 
  5. లేకుంటే ఇంటికి పంపుతామని బెదిరింపులు 

కర్నూలు జలవనరుల శాఖలో ముప్పై ఏళ్లుగా ఓ వర్క్‌ ఇనస్పెక్టర్‌ తిష్ట వేశాడు. అతడ్ని అడ్డం పెట్టుకొని జేఈ, డీఈ, ఆపై స్థాయి అధికారులు అవుట్‌సోర్సింగ్‌ లస్కర్లను దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతినెలా ఠంచనగా ఒక్కో లస్కర్‌  రూ.2వేలు ఆ వర్క్‌ ఇనస్పెక్టర్‌కు సమర్పించుకోవా ల్సిందే. ఇరిగేషన శాఖలో ఇదో ముఠాగా మారి జలగల్లా తమ రక్తం పీల్చేస్తున్నారని లస్కర్లు ఆవేదన చెందుతున్నారు. వీళ్ల మధ్య ఇదో అపవిత్ర ఒప్పందమని, దీనికి చిరుద్యోగులమైన తాము బలైపోతున్నామని అంటున్నారు.  డబ్బులు ఇవ్వలేమంటే ఇంటికి పంపిస్తామని లస్కర్లను సదరు వర్క్‌ ఇనస్పెక్టర్‌ బెదిరిస్తున్నట్లు సమాచారం. 

- కర్నూలు (అగ్రికల్చర్‌)

నీటి మునకలో సర్వం పోగొట్టుకొని..

శ్రీశైలం జలాశయం ముంపు గ్రామాల్లో  వేలాది కుటుంబాలు పొలాలు, ఇళ్లు అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డాయి. వీరిలో కాస్తో.. కూస్తో చదువుకున్న వారు ఒక సంఘంగా ఏర్పాటై తమకు నీటి పారుదల శాఖలోనే ఉద్యోగాలు కల్పించాలని రెండు మూడు దశాబ్దాలుగా ఆందోళన చేశారు. జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలకు కూర్చున్నారు. దీంతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి నీటి పారుదల శాఖలో లస్కర్‌ ఉద్యోగం ఇచ్చేలా జీవో విడుదల చేశారు.  దాని వల్ల దాదాపు 600 మందికి పైగా లస్కర్‌ ఉద్యోగాలు వచ్చాయి. నంద్యాల డివిజన కేసీ కెనాల్‌ పరిధిలో 255 మంది, తుంగభద్ర ప్రాజెక్టు ఎల్లెల్సీ పరిధిలో 131 మంది చిన్ననీటి పారుదల కర్నూలు డివిజనలో 14 మంది, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎమ్మిగనూరు డివిజన పరిధిలో 25 మంది మొత్తం 425 మంది లస్కర్లు పని చేస్తున్నారు. వీరికి ఔట్‌ సోర్సింగ్‌ క్యాటగిరీ కింద నియామక ఉత్తర్వులు ఇచ్చారు. వీరికి కేవలం రూ.12 వేల జీతం ఇస్తున్నారు.  కనీసం రూ.20 వేలైనా ఇచ్చి అందరిలా 62 సంవత్సరాల వయోపరిమితిని కల్పించాల ని ఎప్పటి నుంచో లస్కర్లు ప్రభుత్వానికి విన్నవించుకుం టున్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తమ భూములకు కేవలం ఎకరాకు రూ.20 నుంచి రూ.30వేలు పరిహారం ఇచ్చింద ని, తాము ఇంత త్యాగం చేసినా ప్రభుత్వం కనీసంగా తమ సంక్షేమాన్ని పట్టించుకోలేదని లస్కర్లు   కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 


నెల నెలా కప్పం చెల్లించాల్సిందే ..

కోడుమూరు సబ్‌ డివిజనలో పని చేస్తున్న ఉన్నతాధికారుల అండతో చెలరేగిపోతున్న వర్క్‌ ఇనస్పెక్టర్‌కు లస్కర్లు కప్పం చెల్లించినట్లు ప్రతి నెలా రూ.2వేలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఎందుకు ఇవ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే అధికారులు సవాలక్ష డ్యూటీలతో వేధిస్తున్నారని, ఏ కారణం చేతనైనా ఆ డ్యూటీలు  చేయని లస్కర్లపై చర్యలు తీసుకుంటున్నారని లస్కర్లు అంటున్నారు. ఈ వర్క్‌ ఇనస్పెక్టర్‌ జులుం భరించలేకపోతున్నామని ఆరోపిస్తున్నారు. గతంలో ఆయనపై అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారులకు చేరినా ఇతనిపై వేటు వేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరనే విమర్శలు ఉన్నాయి. ఎల్లెల్సీ కోడుమూరు సబ్‌ డివిజనలోని ఐదు సెక్షన్లలో పని చేస్తున్న 200 మంది లస్కర్లను సదరు వర్క్‌ ఇనస్పెక్టర్‌ ఉన్నతాధికారుల అండతో వేధిస్తున్నాడనే పలు ఫిర్యాదులు ఉన్నాయి. చేసేది చిన్న ఉద్యోగమే అయినా.. జేఈ తదితర ఉన్నతాధికారుల అండతో వర్క్‌ ఇనస్పెక్టర్‌ దౌర్జన్యాలకు అంతు లేదని లస్కర్లు అంటున్నారు. 

30 ఏళ్లుగా కోడుమూరు సబ్‌ డివిజనలోనే.. 

ఎల్లెల్సీ పరిధి లోని కోడుమూరు సబ్‌ డివిజనలో ఆరు సెక్షన్ల కార్యాలయాలు ఉన్నా యి. ఇందులో మామూళ్లకు అలవాటు పడిన ఈ వర్క్‌ ఇనస్పెక్టర్‌  30 ఏళ్లుగా కోడుమూరు సబ్‌ డివిజనలోనే తిష్ట వేశా డు. అతను లస్కర్ల నుంచి నెలమామూళ్లు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వర్క్‌ ఇనస్పెక్టర్‌ దోచుకోడానికి ఉన్నతాధి కారుల అండదండలు ఉన్నాయని, వాటాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. అందుకే వర్క్‌ ఇనస్పెక్టర్‌ దశాబ్దాలుగా సీటు వదలకుండా అంటిపెట్టుకున్నాడనే అభిప్రాయం కూడా ఉంది. వీళ్ల చేతిలో ఎల్లెల్సీ డివిజన పరిధిలోని దాదాపు 200 మందికి పైగా అవుట్‌సోర్సింగ్‌   లస్కర్లు దగా పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇటీవల కొంత మంది లస్కర్లు జలవనరుల శాఖ రాష్ట్ర స్థాయి అధికారి ఈఎనసీ నారాయణ రెడ్డికి, ముఖ్యమంత్రికి, జలవనరుల మంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.  

అక్రమ ఆయకట్టుదారుల నుంచి వసూళ్లు

ఎల్లెల్సీ పరిధిలో అక్రమ ఆయకట్టు విచ్చలవిడిగా జరుగుతోంది. ఆయకట్టు కింద  లేని రైతులు  కాలువ నుంచి నీటిని అక్రమంగా తమ పొలాలకు మళ్లించుకుంటూ పంటలు సాగు చేసుకుంటున్నారు. వీళ్ల నుంచి కూడా   ఈ వర్క్‌ ఇనస్పెక్టర్‌ కొంత మొత్తాన్ని వసూలు చేస్తే పై అధికారులకు వాటా   ముట్టచెబుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఉన్నతాధికారులు వర్క్‌ ఇనస్పెక్టర్‌ దందాను అరికట్టడం లేదని అంటున్నారు.   కొత్తగా వచ్చిన అధికారులు ఎవరైనా అక్రమ ఆయకట్టుదారులను కట్టడి చేయాలని చూస్తే వారిపై ఈ వర్క్‌ ఇనస్పెక్టర్‌ను ఇతర అధికారులు ఉసిగొలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఎందుకు వచ్చిన గొడవంటూ కొత్తగా వచ్చిన  అధికారులు కూడా వర్క్‌ ఇనస్పెక్టర్‌  చెప్పినట్లుగా విని చూసీ చూడనట్లు పోతున్నారనే అభిప్రాయం ఉంది.    కోడుమూరు సబ్‌ డివిజనలోనే కాకుండా మైనర్‌ ఇరిగేషన కర్నూలు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎమ్మిగనూరు సబ్‌ డివిజన, అదే విదంగా కేసీ కెనాల్‌ నంద్యాల పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని లస్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను మామూళ్లతో జలగలా  పీడించుకుంటున్న వర్క్‌ ఇనస్పెక్టర్‌పై  చర్యలు తీసుకోవాలని లస్కర్లు కోరుతున్నారు.

ఫిర్యాదులు అందితే విచారణ జరుపుతాం

ఎల్లెల్సీ పరిధిలో, మిగతా చోట్ల పని చేస్తున్న లస్కర్ల నుంచి సదరు వర్క్‌ ఇనస్పెక్టర్‌  మామూళ్లు వసూలు చేస్తున్నట్లు  ఫిర్యాదులు రాలేదు.  ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఈ వ్యవహారంలో లస్కర్లకు అన్యాయం జరగకుండా చర్యలు చేపడతాం. ఈ అక్రమాలను నిరోధించాలని పైస్థాయి అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తాం. లస్కర్లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. 

                 - రెడ్డి శేఖర్‌ రెడ్డి, ఎస్‌ఈ, జలవనరుల శాఖ

Updated Date - 2022-08-17T05:43:34+05:30 IST