ఒక్క మెట్టు దిగినా పతనమే!

ABN , First Publish Date - 2021-02-19T08:36:18+05:30 IST

ఉన్నతి అంచెలంచెలుగా ఎలా కలుగుతుందో, పతనం కూడా అలాగే జరుగుతుంది. ఈ ఉత్థాన పతనాలు సంపద విషయంలోనే కాదు... శీలం, సంస్కారాల విషయంలోనూ ఉంటాయి.

ఒక్క మెట్టు దిగినా పతనమే!

ఉన్నతి అంచెలంచెలుగా ఎలా కలుగుతుందో, పతనం కూడా అలాగే జరుగుతుంది. ఈ ఉత్థాన పతనాలు సంపద విషయంలోనే కాదు... శీలం, సంస్కారాల విషయంలోనూ ఉంటాయి. శీల సంపదకు, అంటే మంచి నడవడికకు మించిన సంపద లేదంటుంది బౌద్ధం. ఇది పుట్టుకతో రాదు. సాధన చేసి... మెట్టుమెట్టుగా సాధించుకోవలసిందే! బౌద్ధం చెప్పిన ‘పంచశీల’, ‘దశపారమితలు’, ‘అష్టాంగమార్గం’... ఇవన్నీ శీల నిర్మాణానికే! అంతిమంగా దుఃఖ రహితమైన జీవితం కోసమే. దుఃఖ నిరోధం కోసమే. ప్రతి మహా సౌధం దాని పునాది బలం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ పునాది కూడా అక్కడి నేల చదును మీద ఆధారపడి ఉంటుంది. అందుకే భవన నిర్మాణంలో మొదటి పని - నేలను చదును చేయడం. అలాగే ‘శీలం’ అనే భవన నిర్మాణంలో... అంటే మనిషి వ్యక్తిత్వ నిర్మాణంలో మొదటి పని - పంచశీల అనుపాలన.


జీవహింస చేయకపోవడం... అంటే ఎదుటివారిపై ద్వేషం, ఈర్ష్య, అసూయలతో, పగ, ప్రతీకారాలతో ఏదో ఒక విధమైన హింసకు పాల్పడకుండా ఉండడం పంచశీలలో మొదటిది. ఇతరులు ఇవ్వకుండా దేన్నీ తీసుకోకపోవడం (దొంగతనం) రెండో అంశం. అబద్ధాలు ఆడకపోవడం, చాడీలు చెప్పకపోవడం, మోసపూరితంగా మాట్లాడకపోవడం మూడో అంశం. కామంతో దురాచారానికి పాల్పడకపోవడం నాలుగోది. మత్తు కలిగించి, ప్రమత్తతలో ముంచే పదార్థాలను సేవించకపోవడం అయిదో విషయం.


మనిషి శీలవంతంగా బతకడం అంటే... సిగ్గుపడి, తలదించుకొనే పనులు చేయకపోవడమే. అలాంటి మనిషి అన్ని వేళలా, అన్ని చోట్లా ధైర్యంగా బతకగలడు. పంచశీల పాలనలోని బలం అదే! పంచశీలలోని ఈ అయిదు అంశాలనూ విద్యార్థులు అయిదు సబ్జెక్టులు నేర్చుకున్నట్టు మెల్లమెల్లగా పాటించడం అలవాటు చేసుకోవాలి. శీలగుణం తెచ్చే గౌరవాన్నీ, బలాన్నీ, కీర్తినీ తెలుసుకున్న తరువాత వాటిని పాటించడం మానుకోలేరు. బౌద్ధం అదే చెబుతుంది. ఈ అయిదు శీలాల్లో ఏది భగ్నం అయినా, మిగిలినవన్నీ భగ్నమైపోతాయి.


ఒక భిక్షువు పంచశీల పాలనలో తాను గొప్పవాడినని భావించేవాడు. ఆయన ఒక రోజు తన ప్రయాణంలో భాగంగా హిమాలయాల సమీపంలోని ఒక గ్రామానికి వెళ్ళాడు. పొద్దు పోయే వేళకు... ఆహ్వానంపై ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక అందమైన స్త్రీది. ఆమె భక్తి భావనతో అతనికి సపర్యలు చేసింది. 

‘‘నేను స్త్రీని. పెరట్లో ఉన్న జంతువును చంపి, మాంసం కోయలేను. కొద్దిగా సహకరించండి’’ అని ఆమె అడిగింది.


‘‘జీవ హింస తగదు’’ అని అతను తిరస్కరించాడు.

‘‘పోనీ, ఎదురింటివారు లేరు. వారి పెరట్లో కోళ్ళు ఉన్నాయి. మీరు వెళ్ళి వాటిని తీసుకురండి. మీరు దొంగతనం కోసం వెళ్ళారని ఎవరూ అనుకోరు’’ అంది.

‘‘దొంగతనం నేరం’’ అన్నాడు.


‘‘భయపడకండి. ఎవరైనా చూసి అడిగితే, నావేనని చెప్పండి. నమ్ముతారు’’ అంది.

‘‘అబద్ధం అమానుషం’’ అన్నాడు భిక్షువు.

ఆమె సరేనంది. జావకాచి ఇచ్చింది. భిక్షువు దాన్ని తాగాడు. వరండాలో పడుక్కున్నాడు. చలిగారి రేగింది. మంచు కురుస్తోంది. అతను వడవడ వణికిపోసాగాడు.

‘‘మీరు అన్యధా భావించకండి. లోనికి రండి. నా మంచం మీద పడుక్కోండి’’ అని ఆ ఇంటావిడ అంది. 

‘‘అది కామ దురాచారం అవుతుంది. అలాంటివి మాతో మాట్లాడకూడదు’’ అన్నాడతను.

‘‘సరే! ఈ ద్రాక్ష రసాన్ని కాస్త సేవించండి. కడుపులో పడితే వెచ్చదనాన్ని ఇస్తుంది’’ అంది ఆమె.


చివరకు భిక్షువు ద్రాక్ష రసాన్ని తీసుకున్నాడు. రుచిగా ఉంది. వెచ్చదనం వచ్చింది. ‘ఇంకాస్త... ఇంకాస్త ...’ అంటూ పుచ్చుకున్నాడు. మత్తెక్కింది. ఆ మత్తులో... జంతువును చంపి మాంసం కోశాడు. పొరుగింటిలోని కోళ్ళను తెచ్చి కాల్చుకున్నాడు. నావేనని అబద్ధం చెప్పాడు. చివరకు... ఇంటి లోపలకు వెళ్ళి, ఆమె మంచం మీదకు చేరాడు.

అంటే ఒక మెట్టు పతనంతో అతని పతనం ఆగలేదు. అయిదు మెట్లూ దిగేశాడు. ‘ఒక్కటే కదా! కొద్దిగా తప్పినా పరవాలేదు. ఒక్కసారికి ఏం కాదు’ అని అప్రమత్తతను వీడితే... ప్రమత్తతలో పడిపోతాం. 


ఇటీవల ఏదో ఒక దుర్వ్యసనంతో ప్రారంభించి పూర్తిగా పతనమై, నేరాలు చేసి, పట్టుపడుతున్న యువతను చూస్తున్నాం. ముఖ్యంగా యువతకు పంచశీల పాలన అవసరం. అలాంటివారే ధైర్యంగా, స్థైర్యంగా నిలబడతారు. కీర్తి సంపాదిస్తారు. కుటుంబానికీ, సమాజానికీ, దేశానికీ కీర్తి పతాకలుగా నిలబడతారు. అలాంటి భయంలేని యువత కోసం... బుద్ధుని ఉపదేశం సదా స్మరణీయం. పంచశీల సర్వదా ఆచరణీయం!


బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-02-19T08:36:18+05:30 IST