చేయి తడపాల్సిందే

ABN , First Publish Date - 2022-08-20T05:22:13+05:30 IST

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లంచం ఇవ్వకపోతే ఏ పనీ కాదు.

చేయి తడపాల్సిందే
డోన్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ముడుపుల దందా
డాక్యుమెంట్‌ విలువను బట్టి వసూలు
అంతా దళారుల కనుసన్నల్లోనే
ప్రతి పనికీ సమర్పించుకోవాల్సిందే
డోన్‌ నియోజకవర్గంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల తీరిదీ


సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లంచం ఇవ్వకపోతే ఏ పనీ కాదు.  రిజిస్ట్రేషన్లు  కావాలంటే చేయి తడపాల్సిందే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి పనికీ ఓ రేటు కట్టి ముడుపులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఫీజుతోపాటు.. అధికారులకు  అదనపు ఫీజు చెల్లించుకోవాల్సిందే. ప్రతి నెలా రూ.లక్షల్లో అక్రమార్జన సాగిస్తున్నా  పట్టించుకునే వారే కరువయ్యారు. మఽధ్య తరగతి ప్రజలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లడానికి    భయపడుతున్నారు. డోన్‌ నియోజకవర్గంలో   సాగుతున్న అవినీతి భాగోతం ఇది.

-డోన్‌

నియోజకవర్గంలోని డోన్‌, ప్యాపిలి, బేతంచెర్ల పట్టణాల్లో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. స్థలాలు, ఇళ్ల రిజిస్ర్టేషన్లు, ఈసీ, నకలు డాక్యుమెంటు కాపీలు ఇవ్వడం వంటి పనులు ఇక్కడ జరుగుతుంటాయి. ఇందులో ప్రతి పనికి కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. కానీ అవేవీ అమలు కావడం లేదు. రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది లంచం ఇవ్వకుంటే ఏ పనీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చేయి తడిపితేనే రిజిస్ర్టేషన్‌

డోన్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో చేయి తడపందే ఏ పనీ చేయడం లేదు. భూములు, స్థలాలు, ఇళ్ల రిజిస్ర్టేషన్‌కు రూ.లక్షకు రూ.2 వేలవంతున రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. అంతా దళారుల ద్వారానే ఈ వ్యవహారం నడుస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంటు విలువ పెరిగే కొద్దీ మామూళ్లు కూడా పెంచి గుంజుతున్నట్లు తెలుస్తోంది. స్థలాల రిజిస్ర్టేషన్లలో ఒక్కో ప్లాటుకు రూ. 3వేల వరకు వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. నాన్‌ అప్రూవల్‌ లే అవుట్లలో ప్లాట్లు రిజిస్ర్టేషన్‌ చేయాలంటే రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు దండుకుంటున్నట్లు ఆరోపణ లున్నాయి. ఇలా ప్రతి నెలా రూ. లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.

కాసులు కురిపిస్తున్న ఈసీ

ఆస్తుల లావాదేవీల్లో ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) కీలకం. దీని కోసం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకొని రూ.220 ఫీజు చెల్లించాలి. అయితే.. నియోజకవర్గంలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఈసీ కావాలంటే రూ.500  చెల్లించాల్సిందే. అత్యవసరంగా ఈసీ కావాలంటే రూ.2వేలు ఇచ్చుకోవాలి.  లేకపోతే ఈసీ  రాదు. సర్వర్‌ పని చేయడం లేదని కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక అడిగినంత ఇస్తున్నామని అంటున్నారు.  

ఫీజు రూ.10 .. అదనంగా మరో రూ.100  

ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ.10 అయితే అధికారులకు అదనంగా మరో రూ.100 ఇచ్చుకోవాలి. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఇచ్చే మార్కెట్‌ వాల్యుయేషన్‌ సర్టిఫికెట్ల జారీలో ఈ వ్యవహారం నడుస్తోంది. డోన్‌, ప్యాపిలి, బేతంచర్ల పట్టణాల్లోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పలువురు మార్కెట్‌ వాల్యుయేషన్‌ సర్టిఫికెట్ల కోసం వెళ్తున్నారు. బ్యాంకు రుణాలకు, ఇతర ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్లు చేసుకోవడానికి మార్కెట్‌ వాల్యుయేషన్‌ సర్టిఫికెట్లు అవసరం. నిబంధనల ప్రకారం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రూ.10 ఫీజు చెల్లించాలి. కానీ మార్కెట్‌ వాల్యుయేషన్‌ సర్టిఫికెట్‌ కావాలంటే రూ.100 వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రిజిస్ర్టేషన్లు చేస్తున్నాం. భూములు, స్థలాలు, ఇళ్ల డాక్యుమెంట్లు, చలానాలు పరిశీలించి సక్రమంగా ఉంటే.. రిజిస్ర్టేషన్లు చేస్తున్నాం. డాక్యుమెంటు విలువ మీద మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదు. దళారుల ప్రమేయం లేకుండానే రిజిస్ర్టేషన్లు చేస్తున్నాం. బయటి వ్యవహారాలతో మాకు సంబంధం లేదు.                                  

- బజారి, సబ్‌ రిజిస్ర్టార్‌, డోన్‌

మితిమీరిన వసూళ్ల దందా

ప్యాపిలి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో  ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ కనుసన్నల్లో దందా సాగుతోందనే ఆరోపణలున్నాయి. ఈ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వెళితే ఫలానా డాక్యుమెంటు రైటర్‌ను కలవాలని సంబంధిత అధికారి నుంచి హుకుం జారీ అవుతుంది. దీంతో సదరు డాక్యుమెంటు రైటర్‌ ఒక్కో డాక్యుమెంటు రిజిస్ర్టేషన్‌కు రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  హైవే భూముల రిజిస్ర్టేషన్లకు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇళ్ల స్థలాలకైతే ఒక్కో ప్లాటుకు రూ.5 వేల వంతున సమర్పించుకోవాల్సిందేనని పలువురు వాపోతున్నారు. అధికారి అండదండలు ఉండటంతో.. ఆ డాక్యుమెంటు రైటర్‌ కాసుల దాహానికి అడ్డే లేకుండా పోయింది. ఆయన సిఫారసు లేకుంటే రిజిస్ర్టేషన్లు జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి

అక్కడ సెపరేటు

బేతంచెర్ల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో అవినీతి మితిమీరిపోయిందన్న విమర్శలున్నాయి. అక్కడ రిజిస్ర్టేషన్లలో ఒక్కో దానికి ఒక్కో ధర నిర్ణయించారు. ఈ కార్యాలయంలో నిత్యం రిజిస్ర్టేషన్లు జరుగుతున్నందువల్ల  ఓ అధికారికి కాసుల పంట పండుతోంది. భూములు, స్థలాలు, ఇళ్ల రిజిస్ర్టేషన్లకు సేల్‌ డీడ్‌-7.5 ఫీజును ప్రభుత్వానికి చలానా చెల్లించాలి. కార్యాలయంలోని ఓ అధికారి ఏ సేల్‌ డీడ్‌కైనా సరే పది శాతం ఫీజు చెల్లించాల్సిందేనని రేటు నిర్ణయించారు. అంటే రూ.10 లక్షలు డాక్యుమెంటు విలువ ఉంటే దళారులకు రూ.25వేలు మామూళ్ల రూపంలో ఇవ్వాలి. ప్రతి రోజూ ఇక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 30 వరకు రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. దీన్ని బట్టి ఏ స్థాయిలో లంచాలు గుంజుతున్నారో ఊహించవచ్చు.

Updated Date - 2022-08-20T05:22:13+05:30 IST