చాణక్య నీతి: అకస్మాత్తుగా డబ్బు వచ్చిపడిందా.. అయితే ఈ 4 విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిందే!

ABN , First Publish Date - 2022-01-15T12:08:54+05:30 IST

మనిషికి ఏదో ఒక సందర్భంలో అకస్మాత్తుగా..

చాణక్య నీతి: అకస్మాత్తుగా డబ్బు వచ్చిపడిందా.. అయితే ఈ 4 విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిందే!

మనిషికి ఏదో ఒక సందర్భంలో అకస్మాత్తుగా ఊహించనంత డబ్బు వచ్చినట్లయితే ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురవుతాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తిలో అహంకారం చోటుచేసుకుంటుంది. అహం అనేది ముందుగా మనిషి మనస్సాక్షిని దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆ వ్యక్తి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఆడంబరాలకు దిగుతాడు. ఇతరులతో అతని ప్రవర్తన మారిపోతుంది. ఇలా జరిగినప్పుడు అతని దగ్గరున్న డబ్బు హరించుకుపోతుంది. నిజానికి డబ్బును జాగ్రత్తగా మెయింటెయిన్ చేయడమనేది ఒక కళ. ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో డబ్బును మెయింటెయిన్ చేయడానికి, దానిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి కొన్ని మార్గాలను తెలియజేశారు. వీటిని అనుసరించేవారికి జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండదు. అలాగే సమాజంలో గౌరవం, కీర్తి దక్కుతుంది. చాణక్య చెప్పిన ఆ 4 అమూల్య విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం.


అహంకారం తగదు

మీరు జీవితంలో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోకూడదనుకుంటే మీలో ఎప్పుడూ అహంకారం రాకుండా చూసుకోండి. అహంకారం ఉన్న వ్యక్తికి తప్పుఒప్పుల మధ్య ఉండే తేడా తెలియదు. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి తనను తానే నాశనం చేసుకుంటాడు. ఎంత డబ్బు వచ్చినా లేదా ఉన్నా మనిషి తన ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలి.

గొప్పలకు పోవద్దు

కొంతమంది డబ్బు విషయంలో తమ స్థితిగతులను ఇతరులకు తెలిసేలా చేస్తూ, వారిని కించపరిచే ప్రయత్నం చేస్తారు. అయితే మనిషి తన సంపద గురించి ఇతరుల దగ్గర చర్చించకూడదని ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో పేర్కొన్నారు. అదేవిధంగా తమ దగ్గర డబ్బు ఉన్నట్లు నటించే వ్యక్తులు ఏదో ఒకరోజు కోరి కష్టాలను తెచ్చుకుంటారని చాణక్య తెలిపారు. 

ఇతరుల కోసం ఖర్చు చేయండి

మీ దగ్గరున్న డబ్బులో కొంత భాగాన్ని ఇతరుల అవసరాలు తీర్చేందుకు వెచ్చించండి. ఫలితంగా మీరు అందరి మన్ననలు అందుకుంటారు. అప్పుడే మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు వర్ధిల్లుతుంది. అలాగే సమాజంలో మీ పలుకుబడి, ప్రతిష్టలు పెరుగుతాయి.

పెట్టుబడులు పెట్టండి

మన దగ్గరున్న సంపద పెరగాలంటే, దానిని తగిన చోట పెట్టుబడి పెట్టాలని ఆచార్య చాణక్య తెలిపారు. డబ్బును కేవలం కూడబెడితే ఏదో ఒకరోజు ఖర్చయిపోతుందని, అందుకే దానిని పెట్టుబడిగా పెట్టాలని ఆచార్య చాణక్య సూచించారు. అప్పుడే సంపద పెరుగుతుందని తెలిపారు. 

Updated Date - 2022-01-15T12:08:54+05:30 IST