సరిలేరు నీకెవ్వరూ..

ABN , First Publish Date - 2022-04-15T06:03:21+05:30 IST

కరోనా ఫస్ట్‌వేవ్‌, సెంకడ్‌, థర్డ్‌వేవ్‌తో జనం ఆర్థికంగా చితికిపోయారు. అన్ని వర్గాలవరూ కరోనా బారిన పడ్డారు. ఉపాధి లేక, వ్యాపారం లేక కొందరు నష్టపోతే కరోనా మహమ్మారి నుంచి కోలుకునేందుకు అప్పులు చేసి ప్రాణాలతో బయటపడ్డారు మరికొందరు. చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రి మెట్లు ఎక్కినోళ్లు అతి తక్కువ

సరిలేరు నీకెవ్వరూ..

మూడేళ్ల పాలనలో బాదుడే బాదుడు 

జిల్లా వాసులపై సుమారు రూ.కోట్ల భారం 


ఒక్కసారి డిసైడ్‌ అయితే నా మాట నేనే వినను అనేది పోకిరి సినిమాలో మహే్‌షబాబు డైలాగ్‌. ఆ విధంగానే సీఎం జగన్‌ ఒకసారి డిసైడ్‌ అయితే ఎవరి మాట వినరని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. అన్నింట్లో ఏమో కానీ.. జనంపై పన్నుల భారం మోపే విషయంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ అనేలా వ్యవహరిస్తున్నారు. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఒక్కసారి డిసైడైతే.. అన్నట్లుగా పన్నుల పెంపు విషయంలో రాజీపడకుండా పెంచేస్తున్నారు. 34 నెలల పాలనలో పెంచిన పన్నుల్లో కొన్నింటి భారం జిల్లా ప్రజలపై అక్షరాల సుమారు రూ.303 కోట్లు. మిగతావాటిపై కూడా కలుపుకుంటే  ఈభారం మరింత పెరిగే అవకాశం ఉంది.  


(కడప-ఆంధ్రజ్యోతి):  కరోనా ఫస్ట్‌వేవ్‌, సెంకడ్‌, థర్డ్‌వేవ్‌తో జనం ఆర్థికంగా చితికిపోయారు. అన్ని వర్గాలవరూ కరోనా బారిన పడ్డారు. ఉపాధి లేక, వ్యాపారం లేక కొందరు నష్టపోతే కరోనా మహమ్మారి నుంచి కోలుకునేందుకు అప్పులు చేసి ప్రాణాలతో బయటపడ్డారు మరికొందరు. చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రి మెట్లు ఎక్కినోళ్లు అతి తక్కువ అంటే కనీసం రూ.4 లక్షల దాకా ఖర్చు పెట్టి ఉంటారు. అలా కరోనా జనాన్ని ముంచేసింది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన సర్కార్‌ ఖజానా నింపుకునేందుకు పన్నుల పెంపుడు మొదలుపెట్టింది. ఏ టయాన పన్నుల పెంపు మొదలైందో కాని అప్పటి నుంచి బాదుడు నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ భారం నిరుపేద, పేద, మధ్య తరగతిపై ప్రభావం చూపుతోంది.

విద్యుత్‌ తీగ పట్టుకుంటే కరెంట్‌షాక్‌ కొట్టే రోజులు పోయాయి. ఇప్పుడు పెరిగిన కరెంట్‌ చార్జీలతో స్విచ్‌ను చూస్తే చాలు.. షాక్‌ కొట్టే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేత హోదాలో నాడు చంద్రబాబు సర్కార్‌పై పన్నుల విషయంలో బాదుడే బాదుడు అంటూ అప్పట్లో జగన్‌ ఊరూరా చెప్పారు. అప్పట్లో ఆ డైలాగ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఇప్పుడు ఆ డైలాగ్‌ తరహాలో జగన్‌ పాలనలో బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా జనాభా 20.61 లక్షలు. 5.06 లక్షల కుటుంబాలు ఉన్నాయి. పరిశ్రమలు తక్కువ కావడంతో వ్యవసాయం, కూలీ పనుల మీదే ఆధారపడుతుంటారు. వీరందరిపై పన్నుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. జగన్‌ 34 నెలల పాలనలో పెంచిన పన్నుల్లో కొన్నింటిని పరిశీలిస్తే.


కరెంట్‌ షాక్‌..

విద్యుత్‌ చార్జీల గురించి ప్రతిపక్షనేతగా అప్పటి సర్కార్‌ను మాటల తూటలతో కడిగేశారు. ఇప్పుడు ఏటా కరెంట్‌ చార్జీలు పెంచేసి జనంపై భారం మోపుతుండడం మిమర్శలకు తావిస్తోంది. జిల్లాలో 6,18,360 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ వినియోగ కనెక్షన్లు 5,43,503 ఉన్నాయి. కరెంట్‌ చార్జీలు పెరిగాయంటే చాలు కనీసం జిల్లా వాసుల పై రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేర భారం పడుతుంది. రూ.3కోట్లు లెక్క వేసుకున్నా ఏడాదికి రూ.36 కోట్ల భారం పడుతుంది. ఇప్పటికే పలుమార్లు చార్జీలు పెరిగాయి. ఆ మొత్తం కలుపుకుంటే భారం లెక్క జనంపై భారీగానే ఉంటుంది.


వామ్మో పెట్రోల్‌..

పెట్రోల్‌, డీజల్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. బంగారు ధరలకు పోటీ పడేలా ధరలు పెరుగుతూ వచ్చాయి. పెట్రోల్‌ కేంద్ర ఆధీనంలో ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలోనే అదనపు పన్నులు ఉండడం గమనార్హం. అదనపు పన్ను, రోడ్డు సెస్సు పేరుతో  పన్నులు వసూలు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల కన్నా లీటర్‌ పై రూ.6 అదనం. జిల్లాలో రోజుకు పెట్రోల్‌, డీజల్‌ వినియోగం సుమారు 10 లక్షల లీటర్లు ఉంటుందని అంచనా. లీటర్‌ పై రూ.6 భారం అనుకుంటే రోజుకు రూ.60 లక్షల చొప్పున నెలకు రూ.18 కోట్లు అవుతుంది. అంటే ఏడాదికి రూ.216 కోట్లు. పెట్రో ధరలు పెరిగితే భారం అదనంగా పడుతుంది. ఈ పెట్రోల్‌ డీజల్‌ ధరల పెరుగుదల రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను అంటుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి.


ఆస్తి పన్ను

మార్కెట్‌ విలువ ఆధారంగా ఇంటి పన్ను లెక్కించవద్దంటూ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో పౌరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు రోడ్డెక్కి ఆందోళన చేశాయి. అయినా జగనన్న లెక్కచేయలేదు. 2021-22 సంవత్సరంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో సుమారు రూ.8 కోట్ల భారం పడింది. 2022-23 సంవత్సరానికి కూడా మళ్లీ 15 శాతం మేర పన్ను వేస్తున్నారు. ఈ ఏడాది కూడా రూ.8 కోట్ల భారం పడనున్నట్లు చెబుతున్నారు. కడప కార్పొరేషన్‌లో మాత్రమే 2021-22 ఆర్థిక సంవత్సరంలో నగర వాసులపై రూ.2.75 కోట్ల భారం పడింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ మేరకు భారం పడనుంది. ఆస్తి పన్ను పెంపు వల్ల ఇంటి అద్దెలు పెరిగాయి. దీంతో అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారిపై అదనపు భారం పడింది.


చెత్త పన్ను 

చెత్తపై పన్ను ఏంటి అంటూ జనం.. ఇటు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. అయితే ప్రభుత్వం అవి ఏమీ లెక్క చేయకుండా యూజర్‌ చార్జీల పేరుతో ఆయా కార్పొరేషన్‌, మున్సిపాలిటీని బట్టి ఇంటికి రూ.90, 60, 30 చొప్పున వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. కడప కార్పొరేషన్‌, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ మొదలైంది. బద్వేలు, మైదుకూరు మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా ఒక్కో వార్డు తీసుకున్నారు. కడప కార్పొరేషన్‌, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల నుంచి చెత్త పన్ను ఏడాదికి రూ.7.73 కోట్లు వసూలు కానుంది. కడపలో ఇంకా అన్ని డివిజన్లలో మొదలు కాలేదు. మిగతా అన్ని మున్సిపాలిటీల్లో మొదలైతే సుమారు ఏడాదికి రూ.10 కోట్లమేర భారం పడుతుంది. 


బస్సు చార్జీలపైనా బాదేశారు

డీజల్‌ ధరలు చెప్పి ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేశారు. దీని ప్రభావం ప్రయాణికుల పై పెద్ద ఎత్తున పడుతోంది. పెరిగిన చార్జీల నేపథ్యంలో రోజుకు రూ.7 లక్షల భారం ప్రయాణికులపై పడుతుందని అనుకున్నా నెలకు రూ.2.10 కోట్లు పడుతుంది. ఏడాదికి సుమారు రూ.25 కోట్ల మేర అదనపు భారం పడనుంది.


జిల్లా ప్రజలపై పెంచిన పన్నుల భారం

ఏడాదికి సుమారు..

విద్యుత్‌చార్జీలు రూ.36 కోట్లు

పెట్రోలు, డీజల్‌పై రూ.216

ఆస్తి పన్ను రూ.16 కోట్లు

చెత్త పన్ను రూ.10కోట్లు

ఆర్టీసీ చార్జీల భారం రూ.25 కోట్లు

మొత్తం రూ.303 కోట్లు


పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలి 

డిపోల ఎదుట టీడీపీ నిరసన

కడప, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు, హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, నగరాధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, లక్ష్మీరెడ్డి... ప్రొద్దుటూరు బస్టాండ్‌ వద్ద టీడీపీ నేతలు ముక్తియార్‌, సుధాకర్‌రెడ్డి, బద్వేలులో టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, పట్టణాధ్యక్షులు వెంగల్‌రెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనంపై పన్నుల భారం మోపారన్నారు. పెట్రోల్‌, డీజల్‌, విద్యుత్‌ చార్జీలు, గ్యాస్‌, ఆస్తి పన్నులు, చెత్త పన్ను, నిత్యావసర ధరల పెంపుతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నా సీఎం జగన్‌ పట్టించుకోకపోవడం దురదృష్టమన్నారు. డీజల్‌ పెరిగిందని ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారని ఇది ప్రయాణికులపై భారం పడుతుందన్నారు. రాష్ట్ర ఖజానా నింపుకునేందుకు డీజల్‌, పెట్రోల్‌ పై రాష్ట్ర ప్రభుత్వం అధిక పన్నులు వేయడంతో ఇతర రాష్ట్రాల కన్నా మన దగ్గరే పెట్రోల్‌ డీజల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పెరిగిన బస్సు చార్జీలు తగ్గించడంతో పాటు డీజల్‌, పెట్రోల్‌ పై ఉన్న అదనపు పన్ను రద్దు చేయాలన్నారు. సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చిన సొమ్ముకు రెట్టింపుగా పన్నుల రూపంలో సామాన్యుల నుంచి దోచుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చేది గోరంత, జనం నుంచి తీసుకునేది మాత్రం కొండంతగా ఉందన్నారు. పన్నులు, అధిక ధరలు తగ్గించేంత వరకు ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామన్నారు. 



Updated Date - 2022-04-15T06:03:21+05:30 IST