మీరే నమోదు చేసుకోవచ్చు

ABN , First Publish Date - 2020-10-02T08:14:31+05:30 IST

ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ ప్రారంభమైంది. గురువారం నుంచి పూర్తిస్థాయిలో వివరాల

మీరే నమోదు చేసుకోవచ్చు

ఆస్తుల నమోదులో వెసులుబాటు

మీ సేవా వెబ్‌ పోర్టల్‌ లింక్‌తో అవకాశం

పన్ను చెల్లింపుదారులకు జీహెచ్‌ఎంసీ సందేశం


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ ప్రారంభమైంది. గురువారం నుంచి పూర్తిస్థాయిలో వివరాల సేకరణ ప్రారంభించారు. పౌరులు నేరుగా ఆన్‌లైన్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం మీ సేవా పోర్టల్‌ లింక్‌ను ప్రజలకు పంపుతున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. తమ వద్ద ఉన్న ఆస్తిపన్ను చెల్లింపుదారుల మొబైల్‌ నంబర్లకు గురువారం సాయంత్రం నుంచి సంక్షిప్త సందేశం పంపుతున్నామని చెప్పారు.


జీహెచ్‌ఎంసీ పరిధిలో బిల్‌ కలెక్టర్లు (బీసీ), ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు (టీఐ) ఇంటింటికీ వెళ్లి మొబైల్‌ యాప్‌ ద్వారా వివరాలు నమోదు చేస్తున్నారు. యాప్‌ డౌన్‌లోడ్‌ కాకపోవడంతో కొన్ని సర్కిళ్లలో సేకరణ ఇంకా మొదలు కాలేదు. జీహెచ్‌ఎంసీ పంపుతున్న సందేశంలో ‘డియర్‌ సిటిజన్‌.. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ http://ts.meeseva.telangana.gov.in/TSPortaleef/UserInterface/Citizen/RevenueServices/SMSSendOTP. aspx లో వ్యవసాయేతర ఆస్తులు నమోదు చేయాలని నిర్ణయించింది. పోర్టల్‌లో నమోదు చేసుకున్న వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి పాస్‌బుక్కులు ఇస్తుంది’ అని పేర్కొంటున్నారు.


గ్రేటర్‌ హైదరాబాద్‌లో 380 మంది బిల్‌ కలెక్టర్లు, 170 మంది ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని ఆస్తుల వివరాలను ఇంటింటికీ వెళ్లి నమోదు చేస్తున్నారు. ఈ నెల 8 కల్లా ఆస్తుల వివరాల సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందే పని చేస్తే.. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో 200 ఆస్తులకు ఒకరు చొప్పున అవసరాన్ని బట్టి ఎన్యూమరేటర్లను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.


ఇదిలాఉంటే ఓ వైపు సాంకేతిక సమస్యలు, మరోవైపు ప్రజల్లో అవగాహన లేకపోవడం.. వివరాలను వెల్లడించేందుకు ఆసక్తి చూపకపోవడం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. అక్రమ నిర్మాణాల యజమానుల్లో కొందరు వివరాలు చెప్పేందుకు వెనకడుగు వేస్తున్నారు. అన్ని వివరాలు నమోదు చేసుకుంటేనే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని సిబ్బంది చెబుతుండడంతో యజమానులు అంగీకరిస్తున్నట్లు ఓ బిల్‌ కలెక్టర్‌ తెలిపారు. తొలిరోజు కావడంతో గ్రేటర్‌ పరిధిలో కొన్ని సర్కిళ్లలో సాంకేతిక సమస్యల కారణంగా నమోదు కార్యక్రమం నెమ్మదిగా కొనసాగింది. 


Updated Date - 2020-10-02T08:14:31+05:30 IST