నువ్వు లేవు... నీ గజల్‌ ఉంది!

ABN , First Publish Date - 2020-08-17T06:11:53+05:30 IST

కరోనా విష క్రిమికి రాజు-పేద తేడా లేదు. మంత్రి-కంత్రి అన్న విచక్షణ ఉండదు. ఆర్టిస్టూ-కేపిటలిస్టూ అన్న తారతమ్యం చూపదు. కొవిడ్‌ విషతుల్య కోరల ముందు అంతా ఒకటే...

నువ్వు లేవు... నీ గజల్‌ ఉంది!

రాహత్‌ ఇందోరీ గొప్ప కవే కాదు. మంచి హాస్య ప్రియుడు. మాటల తూటా. షాయిరీ చెబుతూ మధ్యమధ్యలో నర్మగర్భంగా చలోక్తులు విసిరి ఆహూతులను కడుపుబ్బ నవ్విస్తారు. 


ఒకసారి ముషాయిరాలో ఒక వ్యక్తి హడావిడిగా మధ్యలో లేచి వెళ్లబోయాడు. ‘‘ఇప్పుడు అర్ధరాత్రి రెండున్నర అయ్యింది. ఇప్పుడు ఇంటికి వెళ్లి చేద్దామనుకున్న పని అర గంట తర్వాత చేస్తే ఫరక్‌ ఏముంటుంది? నా గజల్‌ వినకుండా వెళితే శాపం పెడతాను. ఆ తర్వాత జీవితాంతం సిగ్గుతో చితికిపోవాల్సి వస్తుంది.’’ అని అతన్ని ఉద్దేశించి అన్నారు. దాంతో సభాస్థలి అంతా నవ్వులే నవ్వులు!


ఒకసారి ముషాయిరాలో చురుగ్గా చాయ్‌ అమ్ముతున్న కుర్రాడిని చూసి ఆయన మెచ్చుకున్నారు. ‘‘ఈ అబ్బాయి చాలా హుషారు. రాజకీయాల్లోకి వెళితే ప్రధాని కూడా అవుతాడు!’’ అని వెటకారం చేశారు. 


ఎమర్జెన్సీ రోజుల్లో రాహత్‌ సాబ్‌ ‘సర్కార్‌ చోర్‌ హై’ అంటూ ఒక గజల్‌ చెప్పారు. మర్నాడు సీఐ ఆయన్ని పోలీసు స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. ‘‘అవును...నేను ఆ మాట అన్నది నిజమే. కానీ, నేను భారత ప్రభుత్వాన్ని చోర్‌ అన్నానా? పాక్‌ సర్కా రును అన్నానా? లేదా అమెరికా గవర్నమెంట్‌ని అన్నానా?’’అని రాహత్‌ చెప్పేసరికి ఆ పోలీసాఫీసరుకు తిక్కరేగింది. ‘‘నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా మీ కళ్ళకి? ఏ సర్కారు గురించి అన్నారో నాకు తెలియదనుకుంటున్నారా?’’ అని సీఐ మండిపడ్డాడు.


కరోనా విష క్రిమికి రాజు-పేద తేడా లేదు. మంత్రి-కంత్రి అన్న విచక్షణ ఉండదు. ఆర్టిస్టూ-కేపిటలిస్టూ అన్న తారతమ్యం చూపదు. కొవిడ్‌ విషతుల్య కోరల ముందు అంతా ఒకటే. జగద్విఖ్యాత ఉర్దూ షాయర్‌ రాహత్‌ ఇందోరీ (70) మంగళవారం ఈ మహమ్మారికి బలైపోయారు. కవితా ప్రపంచానికి తీరని వేదన మిగిల్చి వెళ్లిపోయారు.


ముషాయిరాల కోసమే కొంతమంది ఉర్దూ కవులు పుడతారు. గజల్‌, నజ్మ్‌లను శ్వాసించి, శాసించి, దీవించి గత 50 ఏళ్లుగా ముషాయిరా సంస్కృతికే ఒక మకుటంగా వెలిగారు రాహత్‌ ఇందోరీ. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌ నుంచి మొదలైన ఆయన కవితా ప్రస్థానం భారత్‌లోని ప్రతి చిన్న పట్నానికీ విస్తరించి గల్ఫ్‌కు, అనేక పాశ్చాత్య దేశాలకు వ్యాపించింది. ఉర్దూ/హిందీ భాషీయులు ఉండే ప్రతి నేలపైనా ఆయన గజల్‌ చెప్పారు. హైదరాబాద్‌తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. హైదరాబాద్‌లో ఆయన అనేక ముషాయిరాలకు వచ్చి తన కవిత చెప్పారు. ప్రాభవం కోల్పోతున్న ముషాయిరా సంస్కృతికి ఎన్నో సొబగులద్ది తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, అన్ని వర్గాలనూ విశేషంగా అలరించిన అరుదైన షాయర్‌ రాహత్‌ ఇందోరీ. పీడితుల బాధలూ, కష్టాలే ఆయన కవితా వస్తువులు. ధైర్యసాహసాలు ఆయన గజల్‌కు పాదాలు. ఇక షేర్‌ చెపితే తూటాలా దూసుకె ళ్తుంది. ఆహూతుల హృదయ తంత్రులను మీటుతుంది. 


ఇందోర్‌లో 1950 జనవరి 1న పుట్టిన రాహత్‌ ఉర్దూలో పీహెచ్‌డీ చేశారు. దేవి అహల్య యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. గజల్‌ను ఎలా చదవాలి? ఆస్వాదించాలి? అన్న విషయాలపై ఆయన 30ఏళ్లపాటు విద్యార్థులకు బోధించారు. జీవితంలో ఎలా బతకాలో రాహత్‌ ఈ షేర్‌లో చెపుతారు

‘‘ఆంఖ్‌ మే పానీ రఖో, 

హోంటోం పే చింగారీ రఖో

జిందా రహ్నా హై తో, 

తర్కీబేం బహుత్‌ సారీ రఖో’’

(కళ్ళల్లో కరుణ, పెదవులపై 

అగ్ని కణాలు ఉండాలి

బతకడానికి అన్ని మార్గాలూ 

పెట్టుకోవాలి)

తన మరణానంతర పరిస్థితి గురించి ఆయన ముందే ఎలా చెప్పుకున్నారో చూడండి:


‘‘దో గజ్‌ సహీ, యే మేరీ మిల్కియత్‌ తో హైఁ

ఏ మౌత్‌, తూనే ముఝ్‌కో జమీదార్‌ కర్‌ దియా’’

(రెండు గజాలు చాలు, ఈ జాగా నా సొంతం

ఓ మృత్యువా! నన్ను జమీందారును చేశావుగా!)

పౌరసత్వ చట్ట సవరణపై ప్రదర్శనలు జరిగినప్పుడు ఈ గజల్‌ ఆందోళనకారుల నాల్కలపై పల్లవించింది. పాలకులకు ఏ గతి పట్టనున్నదో రాహత్‌ ఇలా అన్నాడు. 


‘‘జో ఆజ్‌ సాహిబే మసనద్‌ హై కల్‌ నహీఁ హోంగే

కిరాయేదార్‌ హై, జాతీ మకాన్‌ థోడీ హై!

సభీ కా ఖూన్‌ హై షామిల్‌ యహాఁ కీ మిట్టీ మే

కిసీ కే బాప్‌ కా హిందుస్థాన్‌ థోడీ హై!’’

(ఈరోజు పాలించేవారు రేపు ఉండరు!

పదవులన్నీ తాత్కాలికమే, సొంతం కాదు

ఈ భూమిలో అందరి నెత్తురూ ఇంకింది

భారత్‌ ఎవడబ్బ దేశం కాదు!)

యువతను కిర్రెక్కించే షేర్‌లు చెప్పడంలో ఇందోరీ దిట్ట. ‘బులాతీ హై మగర్‌ జానే కా నై’ (ఆమె రమ్మంటుంది, కానీ అటు పోవద్దు) అనే గజల్‌ ఈ ఏడాది వ్యాలంటైన్‌ డే సందర్భంగా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది.  


రాహత్‌ ప్రముఖ పెయింటర్‌, బాలీవుడ్‌ గీత రచయిత కూడా. కొన్ని హిందీ చిత్రాలకు పాటలు రాశారు. ‘రుత్‌’, ‘మేరే బాద్‌’, ‘ధూప్‌ బహుత్‌ హై’, ‘చాంద్‌ పాగల్‌ హై’, ‘మౌజూద్‌’, ‘నారాజ్‌’ ‘దో కదమ్‌ ఔర్‌ సహీ’ పేర్లతో ఆయన కవితా సంకలనాలు వచ్చాయి. రాహత్‌ మొదటి భార్య అంజుమ్‌ ‘రహ్‌బర్‌’ కూడా ప్రముఖ కవయిత్రి. వాళ్లు 1993లో విడిపోయారు. తర్వాత ఆయన సీమను పెళ్లాడారు.


కరోనా రూపంలో ముంచుకొచ్చే ముప్పు గురించి రాహత్‌కు ముందే తెలుసా? ఈ మధ్యే ఆయన రాసిన ఆఖరి గజల్‌లో మృత్యువు గురించి బాధాకరమైన తన ఆలోచనలను పంచుకున్నారిలా.


‘‘ఖామోషీ ఓఢ్‌కే బైఠీ హైఁ మస్‌జిదేం సారీ

కిసీ కీ మౌత్‌ కా ఐలాన్‌ భీ నహీఁ హోతా

వబా నే కాష్‌ హమేం భీ బులా లియా హోతా

తో హమ్‌ పర్‌ మౌత్‌ కా ఎహ్‌సాన్‌ భీ 

నహీఁ హోతా.’’

(మసీదులన్నీ మౌనముద్రలో మునిగాయి. 

ఎవరి చావుపై ఏ ప్రకటనా రాదు. 

మహమ్మారి నన్నూ పిలుస్తోంది.

అయినా మరణానికి కరుణ రాదు.)

రాహత్‌ ఇందోరీ ఇపుడు మన మధ్య లేకపోయినా, ఆయన గజల్‌ మన చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది. హావభావాలతో ఆహూతులను మంత్రముగ్ధుల్ని చేస్తూ తాదాత్మ్యంతో ఆయన కవిత చెప్పే తీరు మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. 

మెహక్‌ హైదరాబాదీ

70361 75175


Updated Date - 2020-08-17T06:11:53+05:30 IST