నువ్వు సీబీఐ అంటే.. అవినాశ్‌ బీజేపీలో చేరతాడు

ABN , First Publish Date - 2022-02-28T08:05:50+05:30 IST

నువ్వు సీబీఐ అంటే.. అవినాశ్‌ బీజేపీలో చేరతాడు

నువ్వు సీబీఐ అంటే.. అవినాశ్‌ బీజేపీలో చేరతాడు

ఇదీ జగనన్న మాట.. హత్య గురించి చెబితే అవునా అని తేలిగ్గా తీసుకున్నారు

నీ భర్తే చంపించాడేమో అన్నారు.. వివేకా కుమార్తె సునీత కీలక వాంగ్మూలం


‘‘మా నాన్నను ఎవరు చంపారో పులివెందులలో చాలా మందికి తెలుసు.. హంతకులెవరో తేల్చాలని అన్న(జగన్‌)ను కోరా.. అనుమానితుల పేర్లూ చెప్పా.. వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్‌.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు.. అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని సవాల్‌ చేశా.. సీబీఐకి ఇస్తే ఏమవుతుంది..? అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతాడు.. అతడికేమీ కాదు.. 11 కేసులకు మరొకటి తోడై12 కేసులు అవుతాయ్‌ అని జగన్‌ మాట్లాడడం నన్ను బాధించింది.’’

-సీబీఐ వాంగ్మూలంలో డా.సునీత


అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ‘మా నాన్నను ఎవరు హత్య చేశారో పులివెందులలో చాలా మందికి తెలుసు.. హంతకులెవరో తేల్చాలని అన్న(జగన్‌)ను కోరా.. అనుమానితుల పేర్లు కూడా చెప్పా.. వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్‌.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు.. అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని సవాల్‌ చేశా.. సీబీఐకి ఇస్తే ఏమవుతుంది.. అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతాడు.. అతడికేమీ కాదు.. 11 కేసులకు మరొకటి తోడైపన్నెండు కేసులు అవుతాయ్‌’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాట్లాడడం తనను బాధించిందని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అనుమానితుల జాబితాలో.. ఈసీ గంగిరెడ్డి (జగన్‌ భ్యా భారతి తండ్రి) ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్‌ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరు చేర్చడంపైనా జగన్‌ కోప్పడ్డారని వాపోయారు. సొంత చిన్నాన్న ప్రాణం కన్నా ఎవరో కాంపౌండర్‌ ఎక్కువయ్యారని.. తన తండ్రి మరణ వార్తతో సంబరాలు చేసుకోవడానికి బాణసంచా కొనుగోలుకు యత్నించిన వ్యక్తిని ఎలా వదిలి పెట్టారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో తనకు న్యాయం లభించదన్న ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. రాజకీయంగా తన తండ్రి వివేకాపై కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కక్ష పెంచుకున్నారని చెప్పారు. హత్య జరిగిన రోజు కూడా నాన్న మరణించారని మొదట భారతికి, తర్వాత జగన్‌కు ఫోన్‌ చేసి చెబితే.. అవునా అంటూ చాలా తేలిగ్గా స్పందించారని, ఆశ్చర్యం, బాధలాంటివి కొంతైనా కనిపించలేదన్నారు.  2020 జూలై 7న సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 


పోస్టుమార్టం వద్దంటే.. అయిపోయిందన్నారు

2019 మార్చి 15న ఉదయం ఐదున్నరకు నా భర్త రాజశేఖర్‌రెడ్డికి పులివెందుల నుంచి ఫోన్‌ వచ్చింది.. అదుర్దాగా మాట్లాడుతుంటే నేను, మా అమ్మ గమనించాం. అడగ్గానే మీ నాన్న చనిపోయాడని చెప్పారు.. వెంటనే రెండు కార్లలో హైదరాబాద్‌ నుంచి బంధువులతో కలిసి పులివెందులకు బయలు దేరాం.. ఉదయం ఏడున్నరకు టీవీలో వార్తల్లో గుండెపోటుపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నా భర్తకు ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్‌ చేసి కేసు పెట్టమంటారా.. అని అడిగాడు. అదే సమయంలో వివేకా సహాయకుడు ఇనయతుల్లా వాట్సాప్‌ నుంచి ఫోటోలు వచ్చాయి. అవి నా భర్తకు చూపించా.. రక్తంతోపాటు తలపై గాయాలు చూస్తే అమ్మ భయపడుతుందని మాట్లాడకుండా చూపించా. కార్లో నా పక్కనే కూర్చున్న మా అమ్మ ఎర్ర గంగిరెడ్డికి ఫోన్‌ చేయమంటే.. ఎన్ని సార్లు చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి మేం పులివెందులకు వచ్చేదాకా పోస్టుమార్టం చేయొద్దని చెప్పా. మా బంధువు డాక్టర్‌ అభిషేక్‌ రెడ్డికి ఫోన్‌ చేసి ఇదే విషయం చెప్పాం.. కాసేపటికే ఇంకో ఫోన్‌ వచ్చింది. పోస్టుమార్టం పూర్తయిందని.. కుట్లేసి కట్టు కట్టేశారని చెప్పారు. బంధువులెవరూ నోరు మెదపలేదు.. అనుమానం ఇంకా బలపడింది. ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి ఆదేశాలతో ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని తెలిసింది. నాన్నకు సన్నిహితుడైన ఎంవీ కృష్ణారెడ్డితో కేసు పెట్టొద్దని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడని అనడంతో హత్య జరిగిందని ఖరారైంది. వెంటనే సీఐ శంకరయ్యకు నా భర్త రాజశేఖర్‌రెడ్డి ఫోన్‌ చేసి కేసు రిజిస్టర్‌ చేయమని చెప్పారు. నాన్న హత్య గురించి తెలిసినా పులివెందులలో ఉన్న అనుమానితులు.. అంత్యక్రియలు ఈ రోజే అయిపోవాలని హడావుడి చేస్తున్నారు.. దీంతో అమ్మ ఒకసారి విషయం జగన్‌కు చెప్పమనడంతో అన్నకు ఫోన్‌ చేశా.. నేను చూసుకుంటానన్నారు. శంకర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడైన భరత్‌ యాదవ్‌కు ఈ హత్య గురించి మొత్తం తెలుసు. 2019 మార్చి నెలాఖరులో ఎంవీ కృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాశ్‌, ఎర్ర గంగిరెడ్డి వేముల పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అదే మండలానికి చెందిన కొండారెడ్డి గారి రాజారెడ్డి అనే వ్యక్తి ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు వచ్చాడు. అదే సమయంలో భరత్‌ యాదవ్‌ అక్కడికొచ్చి పోలీసులకు ఎలా తెలుసని ఎర్ర గంగిరెడ్డిని అడిగాడు. ఇప్పుడు మాట్లాడకంటూ సైగ చేసి వారించాడు.. ఈ సంభాషణ గమనించిన రాజారెడ్డి నా భర్తకు చెప్పాడు. భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డికి లోపల మా తండ్రి అంటే గిట్టదు.. కానీ బయటకు స్నేహం నటించేవారు. నాన్న హత్యకు సంబంధించి రంగన్న, ఎర్ర గంగిరెడ్డి, పందింటి రాజశేఖర్‌, ఎంవీ కృష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రసాద్‌, వెన్నపూసల రాజేశ్‌, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఈసీ సురేందర్‌రెడ్డి, డి.శివశంకర్‌ రెడ్డి, పరమేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీఐ శంకరయ్య, రామక్రిష్ణారెడ్డి, సురేందర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని విచారిస్తే నిజాలు బయటికి వస్తాయి. డ్రైవర్‌ దస్తగిరిని మా నాన్న ఉద్యోగం నుంచి తీసేశారు.. సునీల్‌ యాదవ్‌ మనిషి అని అనుమానం రావడంతో.. మా బావ ద్వారా రికమెండ్‌ చేయించినా మా అమ్మ అంగీకరించలేదు. 


నాన్న హత్యతో జగన్‌ ఎన్నికల్లో లాభపడ్డారు..

జగన్‌ రాజకీయ ప్రయోజనాల కోసం నా తండ్రి హత్యను సానుభూతి కోసం వాడుకుని ప్రయోజనం పొందారు. ఇప్పుడు అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి మా తండ్రి అనుచరులను గుమ్మంలోకి కూడా రానివ్వడంలేదు. నా తండ్రి హంతకులను శిక్షించాలని అన్న జగన్‌(సీఎం)ను సజ్జల, సవాంగ్‌ తదితరుల సమక్షంలో బతిమాలాను. ఉదయ్‌కుమార్‌రెడ్డిని అనుమానితుల జాబితాలో చేర్చడంపై జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు అతడి పేరు పెట్టావ్‌.. ఎంవీ కృష్ణారెడ్డి(వివేకా పీఏ) ద్వారా నీ భర్త రాజశేఖర్‌రెడ్డే హత్య చేయించాడని ఎందుకు అనుకోకూడదన్నారు. వెంటనే జగన్‌తో వాదనకు దిగా.. స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి ఎవరు దోషులో తేల్చండని సవాల్‌ చేశా.. అప్పుడు సీఎం ఆశ్చర్యకరంగా మాట్లాడారు.. అవినాశ్‌పై అనుమానంతో సీబీఐ విచారణ అడుగుతున్నావ్‌.. అవినాశ్‌ వైసీపీ వదిలి బీజేపీలో చేరిపోతాడు.. అంతకు మించి ఏమీ కాదు.. ఒక వేళ కేసు అయినా పన్నెండోది అవుతుంది(జగన్‌పై ఇప్పటికే 11 కేసులున్నాయి) అని వ్యాఖ్యానించారు. పారదర్శక విచారణ కోసం ఆ తర్వాత పలు దఫాలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా సీబీఐ విచారణ అడగాలని సీఎంను కోరా. సీబీఐ విచారణకు నేను కోర్టును ఆశ్రయిస్తే జగన్‌ రాజకీయ భవిష్యత్‌ నాశనమయ్యే ప్రమాదం ఉందన్నారు. కానీ మా నాన్న హంతకులకు శిక్ష పడాలంటే నాకు వేరే గత్యంతరం లేకుండా పోయింది. నాకు తెలిసి నాన్న రూ.104 కోట్ల వ్యవహారమేదో భరత్‌ యాదవ్‌, సునీల్‌ యాదవ్‌తో కలిసి సెటిల్‌ చేశారు. నాన్నకు అందులో రూ.4 కోట్లు వచ్చాయని తెలిసింది. అందులో వాటా ఇవ్వాలని భరత్‌, సునీల్‌ డిమాండ్‌ చేశారు. నాది ప్రముఖ పాత్ర కదా.. కోటిన్నరకు ఎక్కువ మీకివ్వనని నాన్న బదులిచ్చారు. భరత్‌కు కోటి రూపాయల వరకూ అప్పులున్నాయి. కదిరిలో కొంత తీర్చాడని తెలిసింది. సునీల్‌ కుటుంబంలోని ఓ మహిళతో భరత్‌ యాదవ్‌కు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. వీళ్లందరూ కలిసి తాగుతుంటారు. దస్తగిరికి తెలుసు ఎవరు చంపారో.. వేకువ జామున అక్కడే ఉన్నాడు. మా నాన్న, పెదనాన్నకు ఉమ్మడి ఆస్తి 600 ఎకరాలు ఉండేది.. మా ముగ్గురికీ (జగన్‌, షర్మిల, సునీత) సమానంగా 200 ఎకరాల చొప్పున పంచారు. తర్వాత ఎకరం లక్ష చొప్పున నా నుంచి వెనక్కి తీసుకున్నారు. ఆస్తి కోసం అవినాశ్‌ వాళ్లతో నా భర్త కుమ్మక్కైనట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదు. ఎందుకంటే ఆస్తి మొత్తానికి నేనే వారసురాలిని. ఆయనకు సంబంధం లేదు.


గుండెపోటు కథ సాక్షిలో పదిన్నర దాకా నడిపారు.. 

భారతి సోదరుడు ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి నాన్న చనిపోయిన సమయంలో ఆయన భార్యతో ఫోన్లో మాట్లాడాడు. అతడి భార్య సాక్షి మీడియా అడ్మిన్‌.. ఇతర టీవీల్లో అనుమానాస్పద మృతి అని వస్తున్నా ఆమె ఎందుకు గుండెపోటు కథ పదిన్నర వరకూ కొనసాగించారు? నాన్న చనిపోయాడని తెలిసిన శివశంకర్‌రెడ్డి.. అవినాశ్‌రెడ్డి వచ్చే వరకూ లోపలకు ఎందుకు రాలేదు? ఎమ్మెల్సీగా నాన్న ఓటమికి అతడు ప్రధాన కారకుడు. ఎర్ర గంగిరెడ్డికి ముందు రోజు రాత్రి ఎనిమిదింటికి ఫోన్‌ చేశాడు. ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పనిచేసే ఉదయ్‌కుమార్‌రెడ్డి పులివెందుల పక్కనున్న అంబక్కపల్లె గ్రామానికి 2019 మార్చి 14 సాయంత్రం వెళ్లి రాత్రి 12 గంటలకు ఇంటికొచ్చాడు.. మార్చి 15న వేకువ జామున 3.45కు బయటకు  వెళ్లాడు.. వివేకా మృతి చెందినందుకు బాణసంచా పేల్చేందుకు ప్రయత్నించిన విషయం పొరుగింటి వాళ్ల ద్వారా తెలిసింది. 4 గంటల ప్రాంతంలో  శివశంకర్‌రెడ్డితో మాట్లాడాడు. మా పనిమనిషి లక్ష్మీదేవి కుమారుడు ప్రకాశ్‌తో మాట్లాడుతూ శివశంకర్‌రెడ్డి 2-3 కోట్లు ఇస్తే గానీ ఈ కేసు నుంచి బయట పడలేడని చెప్పాడు. 



Updated Date - 2022-02-28T08:05:50+05:30 IST