మీరు సీబీఐ దత్తపుత్రులు

ABN , First Publish Date - 2022-04-13T08:35:06+05:30 IST

‘‘నన్ను ఇంకోసారి సీబీఎన్‌ (చంద్రబాబునాయుడు నారా) దత్తపుత్రుడని విమర్శిస్తే... వైసీపీ అగ్రనాయకత్వాన్ని నేను సీబీఐ దత్తపుత్రులని పిలుస్తాను.

మీరు సీబీఐ దత్తపుత్రులు

  • ‘జగన్‌ అండ్‌ కో’పై పవన్‌ కల్యాణ్‌ విసుర్లు
  • నన్ను బాబు దత్తపుత్రుడంటే నేనిదే అంటా!
  • టీడీపీకి జనసేన బీ టీమ్‌ అయితే..  
  • మీది చర్లపల్లి జైలు షటిల్‌ టీమ్‌
  • మీరా నీతులు చెప్పేది?.. జనసేనాని ఫైర్‌
  • ‘అనంత’లో కౌలు రైతులకు భరోసా
  • 30 కుటుంబాలకు లక్ష చొప్పున సాయం
  • వారి పిల్లల చదువు కోసం సంక్షేమ నిధి
  • పవన్‌ వచ్చాడు.. పరిహారం పడింది
  • మరణించిన ఏడాదిన్నరకు పరిహారం
  • ఓ బాధిత కుటుంబానికి రోజంతా ఫోన్లు
  • ఖాతాలో 7 లక్షలు వేశామని హడావుడి
  • పవన్‌కు తెలిపిన బాధిత కుటుంబం


అనంతపురం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ‘‘నన్ను ఇంకోసారి సీబీఎన్‌ (చంద్రబాబునాయుడు నారా) దత్తపుత్రుడని విమర్శిస్తే... వైసీపీ అగ్రనాయకత్వాన్ని నేను సీబీఐ దత్తపుత్రులని పిలుస్తాను. టీడీపీ-బీ టీమ్‌.. జనసేన అని వారు మాట్లాడితే.. వారిని చర్లపల్లి జైలు షటిల్‌ టీమ్‌ అంటాను’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. 16 నెలలు జైలులో కూర్చుని షటిల్‌ ఆడింది వాస్తవం కాదా.. అని సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. వైసీపీ  పాలనలో గత మూడేళ్లలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు సాయం అందించే ‘భరోసా’ పర్యటనను ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంగళవారం పవన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ‘‘నేను ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతుంటే.. వైసీపీ అగ్రనేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నేనేమీ విదేశాల్లో చదువుకోలేదు. నాది లండన్‌ రాయల్‌ ఫ్యామిలీ అసలే కాదు. ప్రకాశంజిల్లాలో పెరిగిన వాడ్ని. వైసీపీ నేతలు తిట్టే భాషకంటే మంచి భాషే నాకొచ్చు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం ఇష్టంలేకనే ఆ భాష వాడటం లేదు’’ అని తీవ్రస్వరం వినిపించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైలులో కూర్చొని వచ్చింది వాస్తవం కాదా అని జగన్‌ను ఉద్దేశించి దుయ్యబట్టారు. ‘మీరేమైనా సుభా్‌షచంద్రబోస్‌, సర్దార్‌ పటేల్‌ మాదిరిగా దేశసేవ చేసి జైలుకెళ్లారా..?’ అని ప్రశ్నించారు. 


నేను వస్తున్నానని ఖాతాల్లో డబ్బు

వైసీపీ మూడేళ్ల పాలనలో 3వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బాధిత రైతు కుటుంబాలను పరామర్శించే తీరికా ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం రైతులు ఎందరు చనిపోయారనే లెక్క కూడా లేదు.  ఏడాదిన్నర క్రితం రైతు ఆత్మహత్య చేసుకుంటే... ఈ రోజు నేను వస్తున్నానని తెలిసి.. ఆయా కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేశారు. ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 170 మందికిపైగా కౌలు రైతులు ఆత్మహత్య పాల్పడ్డారు. వారందరికీ ఆర్థికసాయం అందిస్తాం’’ అని తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ.ఏడు లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వమిచ్చే వరకూ పోరాటం చేస్తామన్నారు. అదే సమయంలో మా వంతు సాయం అందిస్తున్నామని తెలిపారు. అయితే.. ఆర్థికసాయంతో ఆ కుటుంబాలను వదిలేయకుండా వారి పిల్లల చదువు బాధ్యతను జనసేన తీసుకుంటుందన్నారు. దీనికోసం సంక్షేమనిధి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఈ సంక్షేమ నిధికి తనవంతుగా సగభాగం నిధులు ఇస్తానని, మిగిలిన సగం నిధులు ఇచ్చేందుకు తమ పార్టీ నాయకులు ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. 


ఇంటికి వెళ్లి బాధితులకు భరోసా... 

పవన్‌ మంగళవారం ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. 10.15 గంటలకు కొత్తచెరువులోని బాధిత కౌలురైతు సాకే రామకృష్ణ నివాసానికి చేరుకున్నారు. పిల్లల చదువుల బాధ్యత జనసేన తీసుకుంటుందని ఆత్మస్థైర్యాన్ని నింపి... రూ.లక్ష చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. అక్కడి నుంచి కౌలురైతు భరోసా పర్యటన మొదలైంది. ఆత్మహత్య చేసుకున్న కౌలురైతులు అనపరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(ధర్మవరం), నెట్టూరు బాబు(గొట్లూరు), రామకృష్ణ(బత్తలపల్లి), చిన్న గంగయ్య (పూలకుంట) కుటుంబాలను నేరుగా కలుసుకుని సాయం అందించారు. సాయంత్రం 4గంటల సమయంలో మన్నీల గ్రామంలో ఏర్పాటుచేసిన రచ్చబండ వద్దకు ఆయన చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న 25 మంది బాధిత కౌలురైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు, చిలకం మధుసూదన్‌రెడ్డి, భవాని రవికుమార్‌, టీసీ వరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.


పవన్‌ వచ్చాడు.. పరిహారం పడింది..

జనసేనాని పర్యటన ప్రభుత్వంలో చలనం తెచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండం కోడేకండ్లకు చెందిన కౌలురైతు రామకృష్ణ 2020 అక్టోబరులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాదిన్నర అయినా ఆ కుటుంబానికి పరిహారం అందలేదు. రైతు రామకృష్ణ భార్య నాగలక్ష్మి, కుమారుడు మహే్‌షను పవన్‌ పరామర్శించారు. ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చారా అని ఆరాతీశారు. ‘‘చనిపోయిన రోజు అధికారులు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ రోజు మీరు వస్తున్నారని తెలిసి ఉదయం నుంచి 20సార్లు అధికారులు ఫోన్లు చేసి, ఖాతాలోకి డబ్బు జమైందనీ, వెళ్లి తీసుకోవాలని చెప్పారు. వారు ఇంతకుముందే స్పందించి ఉంటే మా పరిస్థితి మెరుగుపడేది’’ అని భార్య నాగలక్ష్మి వాపోయింది. తన తల్లి బ్యాంకు ఖాతాలో రూ.7లక్షల నగదు జమ అయిందని ఆమె కుమారుడు మహేశ్‌.. పవన్‌కల్యాణ్‌కు తెలిపాడు.

Updated Date - 2022-04-13T08:35:06+05:30 IST