టైగర్ హిల్ హీరో యోగీందర్ యాదవ్‌కు భారత సైన్యం వీడ్కోలు

ABN , First Publish Date - 2022-01-02T00:04:29+05:30 IST

కార్గిల్ యుద్ధం సమయంలో టైగర్ హిల్‌ను పాకిస్థానీ సైనికుల

టైగర్ హిల్ హీరో యోగీందర్ యాదవ్‌కు భారత సైన్యం వీడ్కోలు

న్యూఢిల్లీ : కార్గిల్ యుద్ధం సమయంలో టైగర్ హిల్‌ను పాకిస్థానీ సైనికుల బారి నుంచి కాపాడిన పరమవీర చక్ర పురస్కార గ్రహీత, సుబేదార్ మేజర్ (గౌరవ కెప్టెన్) యోగీందర్ సింగ్ యాదవ్‌ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సంప్రదాయబద్ధంగా భారత సైన్యం శనివారం వీడ్కోలు పలికింది. 


పరమ వీర చక్ర గ్రహీత

కార్గిల్ యుద్ధం సమయంలో 1999 జూలై నాలుగున యోగీందర్ యాదవ్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి టైగర్ హిల్‌‌ను పాకిస్థానీ సైనికుల నుంచి కాపాడారు. ఈ సాహసానికి గుర్తింపుగా ఆయనకు మన దేశ అత్యున్నత స్థాయి సైనిక పురస్కారం పరమ వీర చక్రను భారత ప్రభుత్వం అందజేసింది. 


నిలువునా మంచు కొండను ఎక్కుతూ...

18 గ్రెనేడియర్స్ ఘాతక్ కమాండో ప్లాటూన్‌కు నాయకత్వం వహించిన యోగీందర్ టైగర్ హిల్‌పైగల మూడు వ్యూహాత్మక బంకర్లను స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళారు. నిలువుగా ఉండే మంచు కొండను అత్యంత సాహసోపేతంగా ఎక్కడం ప్రారంభించారు. సగం దారిలో ఉండగానే పాకిస్థానీ బంకర్‌లోని సైనికులు ఆయనను గుర్తించారు. మెషిన్ గన్, రాకెట్లతో పాక్ సైనికులు దాడి చేశారు. మూడు తూటాలు ఆయనకు తగిలాయి. అయినప్పటికీ ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ మంచు కొండను ఎక్కుతూనే ఉన్నారు. చిట్టచివరికి ఆ కొండపైకి ఎక్కేశారు. పాకిస్థానీ బంకర్లోకి పాకుతూ వెళ్ళి, గ్రెనేడ్ విసిరారు. దీంతో నలుగురు పాకిస్థానీ సైనికులు అక్కడికక్కడే మరణించారు. 


తీవ్రంగా గాయపడినా మరో బంకర్‌పై పట్టు కోసం...

దీంతో మిగిలిన భారత సైనికులు టైగర్ హిల్‌పైకి ఎక్కడానికి మార్గం సుగమమైంది. ఇంత తీవ్రంగా గాయపడినప్పటికీ యోగీంద్ర యాదవ్ ఏడుగురు సైనికులతో కలిసి రెండో బంకర్ వైపు వెళ్ళారు. ఈ బంకర్‌ను స్వాధీనం చేసుకోగలిగినప్పటికీ, భారత సైనికుల్లో ఆయన ఒక్కరు మాత్రమే మిగిలారు. ఆయనతోపాటు వెళ్లిన భారత సైనికులంతా అమరులయ్యారు. పాకిస్థాన్ సైనికులు దాదాపు 35 మంది వచ్చి, భారత సైనికుల మృతదేహాలపై కూడా కాల్పులు జరిపారు. ఆ శవాల మధ్య ఉన్న యోగిందర్ వారు తిరిగి వెళ్ళిపోయే సమయంలో తన జేబులోని గ్రెనేడ్‌ను అతి కష్టం మీద తీసి, వారిపై విసిరారు. అది ఓ పాకిస్థానీ సైనికుడిపై పడింది. ఆ తర్వాత ఓ పాకిస్తానీ జవాన్ శవం దగ్గరున్న పీకా రైఫిల్ అందుకుని ఫైరింగ్ ప్రారంభించారు. ఆ కాల్పుల్లో ఐదుగురు పాక్ సైనికులు చనిపోయారు.


చర్మంపై వేలాడుతున్న చేతితో...

యోగీందర్‌కు 15 తూటాలు, రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు తగిలాయి, ఒక చేయి తెగిపోయి చర్మంపై మాత్రమే వేలాడుతోంది. అటువంటి పరిస్థితిలో అక్కడ ప్రవహిస్తున్న కాలువలో దూకి, ఐదు నిమిషాల్లో 400 మీటర్లు క్రిందికి వచ్చారు. అక్కడున్న భారత సైనికులు ఆయనను పైకి తీశారు. 


‘‘నువ్వు నన్ను గుర్తుపట్టగలవా" అని సీఓ కుశహాల్ సింగ్ చౌహాన్ అడగ్గానే యోగేంద్ర అతి కష్టం మీద "సాహెబ్, నేను మీ గొంతు గుర్తుపట్టగలను, జైహింద్ సాహెబ్" అన్నారు.


పాకిస్థాన్ సైనికులు టైగర్ హిల్ ఖాళీ చేశారని కుశహాల్ సింగ్‌కు యోగేంద్ర చెప్పారు. ఇప్పుడు వాళ్లు మన ఎంఎంజీ బేస్‌పై దాడికి వస్తున్నారని చెప్పాడు. ఆ తర్వాత స్పృహతప్పింది. కొంతసేపటి తర్వాత పాకిస్థాన్ సైనికులు ఆ బేస్‌పై దాడి చేసినపుడు భారత సైనికులు ముందే సిద్ధంగా ఉన్నారు. 


Updated Date - 2022-01-02T00:04:29+05:30 IST