యోగి ఇక గోరఖ్‌పూర్ సిటీకే పరిమితం : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2022-01-15T20:13:31+05:30 IST

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక గోరఖ్‌పూర్

యోగి ఇక గోరఖ్‌పూర్ సిటీకే పరిమితం : అఖిలేశ్ యాదవ్

లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక గోరఖ్‌పూర్ సిటీకే పరిమితం కాబోతున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. శాసన సభ ఎన్నికల్లో యోగి పోటీ చేసే నియోజకవర్గాన్ని బీజేపీ ప్రకటించిన కొద్ది సేపటికి అఖిలేశ్ లక్నోలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 


యోగిని ఉద్దేశించి అఖిలేశ్ మాట్లాడుతూ, ‘‘ఆయన గోరఖ్‌పూర్ సిటీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఇక అక్కడే ఉండిపోబోతున్నారు’’ అని చెప్పారు. గోరఖ్‌పూర్‌లో ఈసారి అన్ని స్థానాలను సమాజ్‌వాదీ పార్టీయే గెలుచుకుంటుందని చెప్పారు. తన సొంత నగరంలో మెట్రోను నడిపించలేకపోయిన ముఖ్యమంత్రి గురించి ఊహించుకోండన్నారు. తన నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయిన ముఖ్యమంత్రి గురించి ఇక ఊహించుకోండన్నారు. ఈసారి గోరఖ్‌పూర్ ప్రజలు ఆయనకు గుణపాఠం చెబుతారన్నారు. ఓ దళితుని ఇంట్లో యోగి భోజనం చేస్తున్నట్లు ప్రచురితమైన ఫొటో గురించి మాట్లాడుతూ, ఆయన అసలు ఎటువంటి ఆసక్తి లేకుండా భోజనం చేసిన విషయాన్ని గుర్తించారా? అని అడిగారు. ఏది ఏమైనప్పటికీ, ఇది ఆయనకు కిచిడీ మాత్రమే తినవలసిన సమయమని ఎద్దేవా చేశారు.


యోగి ఆదిత్యనాత్ గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1998 నుంచి 2017 వరకు ఐదుసార్లు వరుసగా గెలిచారు. ఆయన శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆయన గోరఖ్‌పూర్ సిటీ స్థానం నుంచి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. గోరఖ్‌పూర్ మఠాధిపతిగా ఆయనకు మంచి పేరు ఉంది. 


ఫిబ్రవరి 10, 14 తేదీల్లో మొదటి, రెండో విడత పోలింగ్ జరిగే స్థానాలకు అభ్యర్థులను బీజేపీ శనివారం ప్రకటించింది. మొదటి దశలో 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి కాగా బీజేపీ 57 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో దశలో ఎన్నికలు జరిగే 55 స్థానాలకుగానూ, 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. అదనంగా యోగి, మౌర్య అభ్యర్థిత్వాలను కూడా ప్రకటించింది. 


ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


Updated Date - 2022-01-15T20:13:31+05:30 IST