Lucknow పేరు మారనుందా?.. Yogi ట్వీట్‌తో ఊహాగానాలు

ABN , First Publish Date - 2022-05-17T20:40:14+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అనేక పాత పేర్ల స్థానే కొత్త పేర్లు మార్చుకుంటూ..

Lucknow పేరు మారనుందా?.. Yogi ట్వీట్‌తో ఊహాగానాలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ (Yogi adityanath) సర్కార్ అనేక పాత పేర్ల స్థానే కొత్త పేర్లు మార్చుకుంటూ వెళ్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని నగరమైన లక్నో (Lucknow) పేరు కూడా మార్చేందుకు సిద్ధమవుతోందా? యోగి చేసిన ఓ ట్వీట్ ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి లక్నో ఆహ్వానం పలుకుతోందంటూ సోమవారం సాయంత్రం యోగి ఓ ట్వీట్ చేశారు. ''శేషావతార్ భగవాన్ లక్ష్మణ్ కీ పావన్ నగరి లక్నో మే ఆప్కా స్వాగత్ ఔర్ అభినందన్'' అంటూ హిందీలో యోగి ట్వీచ్ చేశారు. శేషావతారుడైన లక్ష్మణుడి పావన నగరం లక్నో మీకు స్వాగతం పలుకుతోందంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొనడంతో లక్నో పేరును లక్ష్మణ్‌పురి (Lakshmanpuri)గా మార్చునున్నారనే అభిప్రాయాలకు తావిచ్చింది. లక్ష్మణుడి భవ్యమందిరం ఇప్పటికే లక్నోలో నిర్మాణం జరుపుకొంటోంది.


లక్నో పేరును లక్ష్మణ్‌పురిగా కానీ లఖన్‌పురిగా కానీ మార్చాలని బీజేపీ నేతలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మణుడికి గుర్తుగా లక్ష్మణ్ తిలా, లక్ష్మణ్‌పురి, లక్ష్మణ్ పార్క్ వంటి ల్యాండ్‌మార్కులు కూడా నగరంలో ఉన్నాయి. యోగి సర్కార్ గతంలో అలహాబాద్ పేరును ప్రయోగ్‌రాజ్‌గా, ఫైజాబాద్ పేరును అయోధ్యగా మార్చింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల పేర్ల మార్పు డిమాండ్లు కూడా వచ్చాయి. సుల్తాన్‌పురిని కుష్‌భావన్‌పూర్‌గా, అలిగఢ్‌ను హరిగఢ్‌‌గా, మెయిన్‌పురిని మయన్‌పురిగా, సంభల్‌ను పృధ్వీరాజ్ నగర్‌ లేదా కల్కినగర్‌గా, ఫిరోజాబాద్‌ను చంద్రనగర్‌గా, డియోబండ్‌ను దేవ్రాండ్‌గా పేరు మార్చాలనే డిమాండ్లు ఉన్నాయి. కాగా, లక్నోకు కానీ, మరే ఇతర సిటీకి గానీ పేరు మార్చే విషయం తమకు తెలియదని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-05-17T20:40:14+05:30 IST