Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 3 2021 @ 18:03PM

కాంగ్రెస్‌కు జీరో, బీజేపీకి ఉద్వాసన: అఖిలేష్

ఝాన్సీ: ఉత్తరప్రదేశ్ ప్రజలు త్వరలోనే ప్రభుత్వాన్ని మార్చనున్నారని, యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఆయా ప్రదేశాలకు పేర్లు మార్చడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీని జనం తిరస్కరించనున్నారనీ, కాంగ్రెస్‌కు వచ్చేవి జీరో సీట్లేనని జోస్యం చెప్పారు. ఝాన్సీలో శుక్రవారంనాడు జరిగిన బహిరంగ సభలో అఖిలేష్ మాట్లాడుతూ, యూపీలోని యువత, రైతులు, వ్యాపారులు యోగి ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ 22 నెలల్లో ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించినప్పుడు, అదే పనికి బీజేపీ నాలుగున్నరేళ్లు ఎందుకు తీసుకుందని అఖిలేష్ ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలనే కోరిక వాళ్లకు లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను నిరాకరించారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవదని పేర్కొన్నారు. ఈసారి బుందేల్‌ఖండ్‌లో బీజేపీకి తలుపులు మూసేశారని, ఆ పార్టీ ఇచ్చే బూటకపు హామీలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, రైతుల ఆదాయం తగ్గిపోవడం వంటి అంశాలే రాబోయే ఎన్నికల్లో బీజేపీ తలరాతను తేల్చనున్నాయని అన్నారు. మహిళలపై నేరాల కేసులు యూపీలోనే అత్యధికంగా ఉన్నాయని, నకిలీ ఎన్‌కౌంటర్లకు సంబంధించి హెచ్చు సంఖ్యలో నోటీసులు అందుకున్న ప్రభుత్వం కూడా యూపీ ప్రభుత్వమేనని తప్పుపట్టారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.

Advertisement
Advertisement