ప్రియాంక గది ఊడ్చడంపై యోగి కామెంట్..!

ABN , First Publish Date - 2021-10-08T20:45:26+05:30 IST

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చీపురుతో గదిని శుభ్రం చేస్తున్నట్టు కనిపించిన ఫోటో..

ప్రియాంక గది ఊడ్చడంపై యోగి కామెంట్..!

లక్నో: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా  చీపురుతో గదిని శుభ్రం చేస్తున్నట్టు కనిపించిన ఫోటో వైరల్ కావడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ప్రత్యేక  ఇంటర్వ్యూలో స్పందించారు. ''అందుకు ఆమె సమర్ధురాలిని ఓటర్లు అనుకుంటున్నారు" అంటూ  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరిలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులతో సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మరుసటి రోజే బాధితులను పరామర్శిచేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని సీతాపూర్‌లో పోలీసులు నిర్బంధించి అక్కడి అతిథి గృహానికి తరలించారు. తనను ఉంచిన గదిని చీపురుతో ప్రియాంక శుభ్రం చేస్తున్నట్టు కనిపించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. బ్రిటీష్ ఇండియాకు వ్యతిరేకంగా అహింసాయుత సత్యాగ్రహాన్ని జరిపిన జాతిపిత మహాత్మాగాంధీ మార్గాంలో ప్రియాంక పయనిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రశంసలు కురిపించారు.


ఘటన దురదృష్టకరం..

కాగా, లఖింపూర్ హింసాత్మక ఘటన దురదృష్టకరమని యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. హింసకు తావులేదని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని అన్నారు. సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం అరెస్టుకు ముందు సాక్ష్యాలు ఉండాలని, నిందితులు ఎవరైనా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్‌ నమోదు చేశామని, శాంతి భద్రతలను కాపాడేందుకు తొలి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. విపక్షంలోని కొందరు హింసాకాండ వెనుక ఉన్నారని ఆరోపించారు.


Updated Date - 2021-10-08T20:45:26+05:30 IST