యోగి పేరునే సీఎం అభ్యర్థిగా ప్రకటించొచ్చు: కేశవ్ ప్రసాద్ మౌర్య

ABN , First Publish Date - 2021-08-06T22:37:21+05:30 IST

వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌ పేరునే..

యోగి పేరునే సీఎం అభ్యర్థిగా ప్రకటించొచ్చు: కేశవ్ ప్రసాద్ మౌర్య

లక్నో: వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌ పేరునే బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. యోగి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో మౌర్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీలో యోగికి చాలా పెద్ద పేరు ఉందని ఆయన అన్నారు.


''యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో మా ప్రభుత్వం 2017 నుంచి చాలా అద్భుతంగా పనిచేస్తోంది. విపక్షాలకు మాట్లేడేందుకు ఎలాంటి అంశం కూడా లేదు. మా ముఖ్యమంత్రి నాయకత్వం అద్భుతంగా ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే మా నాయకుడిగా కొనసాగుతారని అనుకుంటున్నాను'' అని కేశవ్ ప్రసాద్ మౌర్య మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


ఈ ఏడాది ప్రారంభంలో యుపీ ప్రభుత్వంలో అసమ్మతి తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. దీంతో యోగి క్యాబినెట్‌లో మార్పులుంటాయనే ఊహాగానాలు వినిపించారు. దీనిపై మౌర్య మాట్లాడుతూ, ఇంతకు ముందు కానీ, ఇప్పుడు కానీ  ఎలాంటి సమస్యలు లేవని, భవిష్యత్తులో కూడా ఉండవని అన్నారు. ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడుగురు ఎంపీలు- పంకజ్ చౌదరి, ఎస్‌పి సింగ్ బఘెల్, భాను ప్రతాప్ సింగ్ వర్మ, బీఎల్ వర్మ, అజయ్ మిశ్రా, కౌశల్ కిషోర్, బీజేపీ భాగస్వామ్య పార్టీ అప్నాదళ్ నేత అనుప్రియ సింగ్‌లను కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇందులో ముగ్గురు ఓబీసీ, ఒకరు ఎస్‌సీ, మరొకరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు.

Updated Date - 2021-08-06T22:37:21+05:30 IST