Magh Melaకు వచ్చే భక్తులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి

ABN , First Publish Date - 2022-01-05T14:05:27+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ నగరంలో జరగనున్న మాఘమేళాకు వచ్చే భక్తులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేస్తూ...

Magh Melaకు వచ్చే భక్తులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి

యోగి సర్కారు ఉత్తర్వులు 

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ నగరంలో జరగనున్న మాఘమేళాకు వచ్చే భక్తులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేస్తూ ఆదిత్యనాథ్ యోగి సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.యూపీలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, ఒమైక్రాన్ వేరియంట్ దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త కొవిడ్-19 మార్గదర్శకాలను విడుదల చేసింది.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం తాజా మార్గదర్శకాలు విడుదలయ్యాయి.ప్రయాగ్‌రాజ్ మాఘమేళాకు వచ్చే భక్తులు నెగెటివ్ ఆర్‌ర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టును తప్పనిసరిగా తయారు చేయాలని, అది 48 గంటల కంటే పాతది కాకూడదని సీఎం యోగి అధికారులను ఆదేశించారు.


ప్రయాగ్‌రాజ్ మాఘ మేళాకు హాజరయ్యే భక్తుల పట్ల అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలో నదీ తీరాలు, హిందూ దేవాలయాల సమీపంలో మాఘ మేళా  జరగనుంది. భక్తులు యమునా, గంగా, పౌరాణిక సరస్వతి సంగమం అయిన సంగంలో పవిత్ర స్నానాలు చేస్తారు.మాఘమేళా మాసం మొత్తం యాత్రికులు గుడారాల్లో సంగం నదుల ఒడ్డున బస చేస్తారు.తెల్లవారుజామున స్నానం చేసి పూజల్లో పాల్గొంటారు.కొవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం 10వ తరగతి వరకు అన్ని పాఠశాలలను మూసివేసింది. రాత్రి కర్ఫ్యూ సమయాన్ని పొడిగించింది. 


10వ తరగతి వరకు ఉన్న పాఠశాలలను జనవరి 15 వరకు మూసివేశారు.కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,000 దాటిన జిల్లాల్లో వివాహ వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని సీఎం అధికారులకు సూచించారు.జిమ్‌లు, స్పాలు, సినిమా హాళ్లు, బాంకెట్‌ హాళ్లు, రెస్టారెంట్లు వంటి పబ్లిక్ ప్లేస్‌లు 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని సీఎం చెప్పారు.ఇకపై జనవరి 6 నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు.ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతోంది.ఒమైక్రాన్ వేరియంట్ కేసులతో భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి యోగి అన్నారు.


ప్రజలు మాస్క్‌లు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం 992 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. దీంతో యూపీలో క్రియాశీల కేసుల సంఖ్య ఇప్పుడు 3,173 కి పెరిగింది. అత్యధికంగా ఘజియాబాద్‌లో 174, గౌతమ్ బుద్ధ నగర్‌లో 165, లక్నోలో 150, మీరట్‌లో 102 కరోనా కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2022-01-05T14:05:27+05:30 IST