యోగి చట్టం

ABN , First Publish Date - 2020-11-03T07:08:39+05:30 IST

‘‘మనఅక్కచెల్లెళ్లను, కూతుళ్లను కాపాడుకుంటాం. అందుకోసం మా ప్రభుత్వం ఏమైనా చేస్తుంది.’’ – అని యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రస్వరంతో...

యోగి చట్టం

‘‘మనఅక్కచెల్లెళ్లను, కూతుళ్లను కాపాడుకుంటాం. అందుకోసం మా ప్రభుత్వం ఏమైనా చేస్తుంది.’’ – అని యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రస్వరంతో శపథం చేస్తుంటే, బహుశా ఆ బహిరంగసభలో ఉన్నవారంతా, తమ ముఖ్యమంత్రి హథ్రాస్‌ వంటి చోట్ల అభాగ్య దళిత యువతులపై భూస్వామ్య ఠాకూర్‌ యువకులు చేస్తున్న దాష్టీకాలను ఎదుర్కొనడానికి ఆయన యుద్ధప్రకటన చేస్తున్నాడేమోనని అనుకుని ఉంటారు. అసలే, ఈ మధ్య ఉత్తరప్రదేశ్‌ అమ్మాయిలపై అత్యాచారాలకు మారుపేరుగా మారిపోయింది. ఎన్‌కౌంటర్ల ముఖ్యమంత్రి అని పేరుపొందిన ఆదిత్యనాథ్‌, కొన్ని నిర్దిష్టమైన నేరాల విషయంలో ఏమంత పరాక్రమవంతులు కాదని ప్రజలలో అనుమానం కూడా కలుగుతున్నది. మరి పై ప్రకటన దేనికి సంబంధించింది? 


‘లవ్‌జిహాద్‌’ గురించిన ప్రస్తావన అది. పెళ్లి కోసం మతమార్పిడి అవసరం లేదని అలహాబాద్‌ కోర్టు చెప్పిందని, లవ్‌జిహాద్‌ను అరికట్టడానికి తాము చట్టం చేస్తామని, తామెవరో చెప్పకుండా మభ్యపెట్టి, మన అక్కచెల్లెళ్ల జీవితాలతో ఆడుకునే వారిపై తీవ్రచర్యలుంటాయని యుపి ముఖ్యమంత్రి జౌన్‌పూర్‌ అనే చోట ఉప ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ అన్నారు. హిందువులు అంత్యక్రియల ఊరేగింపుల్లో ఇచ్చే నినాదాన్ని ప్రస్తావిస్తూ ‘‘రామ్‌ నామ్‌ సత్య్‌ హై ప్రయాణం మొదలవుతుంది, జాగ్రత్త’’ అని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఈ లవ్‌జిహాద్‌ ప్రస్తావన ద్వారా కలిగే రాజకీయ లాభమేమిటో తెలియదు కానీ, యుపి ముఖ్యమంత్రి కొత్త చర్చ ద్వారా హథ్రాస్‌ నుంచి ఓటర్ల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారు. 


ఇంతకీ అలహాబాద్‌ హైకోర్టు ఏ కేసులో ఏమని చెప్పింది? ఒక ముస్లిమ్‌ అమ్మాయి, హిందూ యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకున్నది. పెళ్లికి నెలరోజుల ముందు ఆ అమ్మాయి హిందూమతంలోకి మారింది. బహుశా, అబ్బాయి కుటుంబం వారు బలవంతపెట్టి ఉంటారు. మతమార్పిడి తరువాత కూడా ఆచారాల పాటింపులో ఏవో సమస్యలు వచ్చి ఉంటాయి, ఆ మతాంతర జంట బంధుగణం తమ జీవితాలలో జోక్యం చేసుకోకుండా రక్షణ కల్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ‘కేవలం పెళ్లి కోసం మాత్రమే జరిగే మతమార్పిడి చెల్లుబాటు కాదు’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎక్కడా ‘లవ్‌జిహాద్‌’ అన్న మాట వాడలేదు. నిజానికి లవ్‌జిహాద్‌ అన్నమాటకు ఎటువంటి అధికారిక అర్థమూ లేదు. అటువంటి మాట ఏదీ ప్రస్తుత చట్టాల కింద నిర్వచితం కాలేదని, ఆ పేరుతో కేంద్రసంస్థల దగ్గర ఎటువంటి అభియోగాలూ నమోదు కాలేదని కేంద్రప్రభుత్వం మొన్నటి ఫిబ్రవరిలో పార్లమెంటుకు లిఖిత పూర్వకంగా నివేదించింది. ఇక, అలహాబాద్‌ కోర్టులో ఫిర్యాదుదారులు ఆదిత్యనాథ్‌ చెప్పిన అర్థంలో లవ్‌జిహాద్‌ పరిధిలోకి రారు. అక్కడ అబ్బాయి హిందువు, అమ్మాయి ముస్లిమ్‌. 


లవ్‌జిహాద్‌ వంటి ఆరోపణలను పక్కనబెడితే, మతాంతర వివాహాలు అన్నీ ఒకటే. ఎవరి మతాలను వారు నిలుపుకుంటూ, ఇతర మతస్థులను పెళ్లిచేసుకోవచ్చు. ప్రత్యేక వివాహాల చట్టం అందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇతర మతస్థులను ప్రేమించడంతో పాటు, అన్య మతాన్ని కూడా ఇష్టపడితే, ఇష్టపడినవారు వయోజనులైతే, సరైన ఆలోచనాశక్తి కలిగినవారైతే, అభ్యంతరపెట్టడానికి లేదని లిలీ థామస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, అలహాబాద్‌ కోర్టు ‘‘కేవలం పెళ్లి అనే ప్రయోజనం కోసం మాత్రమే మతమార్పిడి జరిగితే అది సవ్యమైన మతమార్పిడి కాదు’’ అన్నది. ఇందుకు అది తన 2014 మరో నిర్ణయాన్ని కూడా ఉటంకించింది. ధార్మికమైన కారణాలతో మతమార్పిడి జరిగితే సరే కానీ, ఏదో ఒక హక్కును పొందడం కోసమో, అవకాశాన్ని రాబట్టుకోవడం కోసమో జరిగితే అది నికార్సయిన మార్పిడి కాదు– అని నాటి వివాదంలో న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే, ధార్మికమైన కారణాలను, ఎటువంటి ప్రయోజనం కోసం జరగలేదనే రుజువులను ఎట్లా పరీక్షిస్తారు అన్నది ప్రశ్న. 


సామాజిక మాధ్యమాలలో వేధించి బాధించి ఉపసంహరింపజేసిన ‘తనిష్క్‌’ ఏకత్వ వాణిజ్య చిత్రంలో, ముస్లిమ్‌ కుటుంబంలోకి కోడలుగా వెళ్లిన హిందూ అమ్మాయి ఆచారాలను, పద్ధతులను అత్తగారు గౌరవిస్తుంది. అక్కడ సంప్రదాయాలను ఆత్మీయంగా మేళవించడం కనిపిస్తుంది. మరి దానిని కూడా లవ్‌ జిహాద్‌కు ప్రోత్సాహం అని ఎందుకు నిందించినట్టు? హర్యానాలో ఒక యువతి మీద కాల్పులు జరిపి చంపిన ఉదంతం కూడా వారు చెబుతున్న లవ్‌జిహాద్‌ నిర్వచనం కిందికి రాదు. అక్కడ హిందూ అమ్మాయితో ప్రేమ పేరుతో దగ్గరైన ముస్లిమ్‌ యువకుడు, పెళ్లికోసం మతం మారమని వేధించాడు. కానీ, ఆ యువతి అంగీకరించలేదు. దానితో అతను కాల్పులు జరిపాడు. పెళ్లికి అంగీకరించలేదనో, మరో కారణం చేతనో స్త్రీల మీద దాడులు అనేకం జరుగుతున్నాయి. అటువంటి నేరంగానే దాన్ని పరిగణించవచ్చు. ఆ దుండగుడు చట్టం ప్రకారం కఠినశిక్షను అనుభవించవలసిందే. ఈ ఉదంతంలో ప్రధానంగా గుర్తించవలసింది, ఆ యువతి తన మతప్రాధాన్యాన్ని స్పష్టంగా ప్రకటించడం. తగిన పరిపక్వత ఉన్నవారెవరూ కేవలం పెళ్లికోసం మతమార్పిడికి లొంగిపోరు. ఈ ఉదంతాన్ని ఆసరా చేసుకుని, హర్యానా ముఖ్యమంత్రి కూడా లవ్‌జిహాద్‌ చట్టాన్ని తెస్తామని ప్రకటించారు. 


మతాంతర వివాహాల వల్ల ధర్మానికి నష్టం జరుగుతోందని బాధపడేవారు, కులతత్వధోరణుల వల్ల మతస్థులలో ఐక్యతకు కలుగుతున్న నష్టాన్ని ముందు గమనించాలి. ఎగువ కులాల యువతులను ప్రేమించి పెళ్లిచేసుకున్న కిందికులాల యువకులకు ప్రాణగండమే. పరువుహత్యల పేరుతో దేశం పరువు తీస్తున్న జాడ్యాన్ని ఎదుర్కొనడం ప్రథమ లక్ష్యం కావాలి. ఒకటో రెండో నేరాలు జరిగాయని, మొత్తంగా ఆదర్శవివాహాలను అడ్డుకోవాలని చూడడం మంచిది కాదు.

Updated Date - 2020-11-03T07:08:39+05:30 IST