యోగాను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇది గమనించండి..!

ABN , First Publish Date - 2021-10-18T18:15:15+05:30 IST

యోగాకు ఇటీవలి కాలంలో..

యోగాను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇది గమనించండి..!

నేను ఇంటర్‌ పూర్తి చేశాను. రెగ్యులర్‌ కోర్సులు చదవాలని లేదు. కొంత భిన్నమైన కెరీర్‌ ఎంచుకోవాలనుకుంటున్నాను. అయితే యోగా పట్ల ఆసక్తి ఉంది. దీనిని కెరీర్‌గా ఎంచుకోవచ్చా? యోగాను కోర్సుగా అందించే సంస్థలు ఏమైనా ఉన్నాయా తెలుపగలరు? 

- ప్రత్యూష, హైదరాబాద్‌

యోగాకు ఇటీవలి కాలంలో ఆదరణ బాగా పెరిగింది. భిన్నమైన కెరీర్‌ గురించి ఆలోచించే వారికి ఇది పనికి వస్తుంది. అయితే దీనిని కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నవారు లోతుగా అధ్యయనం చేయాలి. హాబీగా పైపైన నేర్చుకునే వారికి అంతగా ఉపయోగం ఉండదు. యోగా నైపుణ్యాలతోపాటు, ఫిలాసఫీ, అనాటమిని కూడా తెలుసుకోవాలి. అప్పుడే సమగ్రంగా ఉంటుంది.  


యోగా అనేది అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సుగా అందుబాటులో ఉంది. అయితే డిగ్రీ, పీజీలతో పాటుగా సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి. వీటికి ఎలాంటి విద్యార్హతలు, ప్రత్యేక వయసు అక్కరలేదు. ఈ కోర్సులు సంస్థలను బట్టి కాల వ్యవధి వారాల నుంచి సంవత్సరాల వరకు ఉంటాయి. కొన్ని సంస్థలు అందించే కోర్సుల్లో నేచురోపతి, ఆయుర్వేద సబ్జెక్టులను కూడా కలిపి బోధిస్తారు. నిజంగా యోగా టీచింగ్‌లో ఉండాలంటే బేసిక్‌ హ్యూమన్‌ అనాటమి,  ఫిలాసఫి, ఆరోగ్య రక్షణ అంశాలపై పట్టుసాధిస్తే మంచిది. మైండ్‌ అండ్‌ యోగా, ఫిలాసఫి ఆఫ్‌ యోగా, పర్‌స్పెక్టివ్‌ ఆఫ్‌ యోగా తదితర విభాగాలుగా యోగా ఉంటుంది. ఇందులో మీకు అనుకూలమైనది ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఇది చదువుతూనే దీనితోపాటు రెగ్యులర్‌ డిగ్రీ కోర్సు కూడా చేసేందుకు కొన్ని సంస్థలు అంగీకరిస్తాయి.



కెరీర్‌ను ఎలా ఎంచుకోవాలి?

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాను. ఇంటెలీజెన్స్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నాను. ఈ కెరీర్‌ను ఎలా ఎంచుకోవాలో సలహా ఇవ్వగలరు? 

- వాజిద్‌, విజయనగరం


‘ది ఇంటెలిజెన్స్‌ బ్యూరో’(ఐబీ), ఇతర ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల అధికారుల ఎంపిక యూపీఎస్‌సీ (upsc.gov.in) నిర్వహించే పరీక్ష ద్వారా జరుతుంది. కింది స్థాయి అధికారుల ఎంపిక మాత్రం స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ssc.nic.in) ద్వారా జరుగుతుంది. గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు ఎవరైనా ఈ పరీక్షలు రాయవచ్చు. 


ఐబీలో ఉన్నత స్థాయి పోస్టులన్నీ ఐపీఎస్‌ అధికారులతో భర్తీ చేస్తారు. వీరు కొంతకాలం డిప్యుటేషన్‌పై ఇందులోకి వస్తారు. భారతదేశంలో క్రైమ్‌ పరిశోధనలో ప్రైవేటు ఇంటెలిజెన్స్‌ను నిషేధించారు. వీరిని కేవలం కమర్షియల్‌, మాట్రిమోనియల్‌ డేటా గేదరింగ్‌ తదితరాలకే పరిమితం చేశారు. ప్రభుత్వ రంగంలో ఒకే కానీ ప్రైవేటు రంగంలో వీరికి పెద్దగా జీతభత్యాలు లేవు.

- గోవర్ధనం కిరణ్‌కుమార్‌

మీక్కూడా ఏవైనా సందేహాలు ఉంటే ఈ కింది అడ్రస్‌ను సంప్రదించండి:

వివరాలు ఇవిగో,

కేరాఫ్‌ ఎడ్యుకేషన్‌ డెస్క్‌, ఆంధ్రజ్యోతి, 

ప్లాట్‌ నెం.76, రోడ్‌ నెం.70, అశ్వినీ ఎన్‌క్లేవ్‌,

హుడా హైట్స్‌, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌-500 033


Updated Date - 2021-10-18T18:15:15+05:30 IST