మొక్కుబడి తనిఖీలు

ABN , First Publish Date - 2022-07-07T04:58:51+05:30 IST

చీరాల, పర్చూరు నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న రేషన్‌ దుకాణాల తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయి. కొన్ని దుకాణాల్లో సరుకుల నిల్వలకు, స్టాకు రిజిస్టర్‌కు పొంతన ఉండటం లేదు. మరికొన్ని దుకాణాలకు సంబంధించి కొందరు ఎండీయు(మొబైల్‌ డిస్పెన్సివ్‌ యూనిట్‌)ఆపరేటర్లు కొన్ని దుకాణాల్లో ఒకటి, రెండు కార్డులకు ఇచ్చి తరువాత పంపిణీ ఆపారు. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల తనిఖీలు చేపట్టిన అధికారులు వాస్తవాలను వెల్లడించటం లేదు.

మొక్కుబడి తనిఖీలు
పట్టుపడ్డ బియ్యంతో విజిలెన్స్‌ సీఐ శ్రీహరిరావు సిబ్బంది

రేషన్‌ దుకాణాల తనిఖీలలో

 లోపించిన పారదర్శకత

చీరాల, జూన్‌ 6 : చీరాల, పర్చూరు నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న రేషన్‌ దుకాణాల తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయి. కొన్ని దుకాణాల్లో సరుకుల నిల్వలకు, స్టాకు రిజిస్టర్‌కు పొంతన ఉండటం లేదు. మరికొన్ని దుకాణాలకు సంబంధించి కొందరు ఎండీయు(మొబైల్‌ డిస్పెన్సివ్‌ యూనిట్‌)ఆపరేటర్లు కొన్ని దుకాణాల్లో ఒకటి, రెండు కార్డులకు ఇచ్చి తరువాత పంపిణీ ఆపారు. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల తనిఖీలు చేపట్టిన అధికారులు వాస్తవాలను వెల్లడించటం లేదు. ఇదిలా ఉంటే కేవలం ఒకరిద్దరు అధికారులతో ఒకటి, రెండు బృందాలు తనిఖీలు నిర్వహిస్తూ మిగిలినవారు జాగ్రత్తపడే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్న అంశాలు, రేషన్‌ దుకాణాల నిర్వహణలో లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్డుదారులు, పలు ప్రజాసంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

చీరాల, పర్చూరు నియోజకవర్గాల పరిధిలో వరుసగా రేషన్‌ బియ్యం పక్కదారి పటిస్తూ అధికారులకు పట్టుబడ్డాయి. పట్టుబడ్డ బియ్యం బస్తాలపైన పౌరసరఫరాలశాఖ ముద్రలు ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తిస్ధాయి విచారణలో నిందితులు బయటపడాలంటే ప్రతి రేషన్‌ దుకాణంలో ఉన్న సరుకు ఎంత, ఉండాల్సిన సరుకు ఎంత, స్టాకు రిజిస్టర్లు తనిఖీ చేయాలి. దీంతో ఆ సరుకు ఏ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి వచ్చింది తెలుసుకోవాలి. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వలపర్ల మిల్లులో ఎస్పీ మల్లికగర్గ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో భారీగా రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. ఆ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్‌, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే ఎంతోమంది నల్లబజారు వ్యాపారులు, అక్రమాలకు పాల్పడుతున్న రేషన్‌డీలర్లు వెలుగులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చీరాల, పర్చూరు ప్రాంతాల్లో పట్టుబడుతున్న రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి నేరుగా జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీలు స్పందించాల్సిన అవసరం ఉందని కార్డుదారులు, పలు ప్రజాసంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం ఒకటికి, రెండు రోజులు వరుసగా పట్టుబడ్డాయి. అంటే ముందురోజు పట్టుబడ్డా, మరసటిరోజు మరొకరు అక్రమ రవాణాకు పాల్పడ్డారంటే ఎంత బరితెగింపు అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాల్లోని రేషన్‌ దుకాణాల తనిఖీ, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను, ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఏ ఏ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు ఏఏ లాట్లు సరఫరా చేయబడ్డాయనే అంశాలపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే మంగళవారం చీరాల మండలం ఈపురుపాలెంలో నాలుగు దుకాణాలు చీరాల, అద్దంకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ తనిఖీలు చేశారు. బుధవారం పర్చూరు మండలం ఉప్పుటూరు, వీరన్నపాలెంలో విజిలెన్స్‌ బృందం కొన్ని దుకాణాలను తనిఖీలు నిర్వహించారు. అందులో లోపాలను గుర్తించారు. అయితే ఇలా చేయటం వలన మిగిలినవారు స్టాకు రిజిస్టర్లు, స్టాకు సరిగ్గా ఉండేట్లు వ్యవధి కల్పించినట్లు అవుతుంది. అలాకాకుండా ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలకు అదనపు బృందాలతో చర్యలు చేపడితే అక్రమార్కులు ఇట్టే పట్టుబడే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఉన్నతాఽధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


రేషన్‌ దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

పర్చూరు : పర్చూరు మండలంలోని వీరన్నపాలెం, ఉప్పుటూరు గ్రామాల్లో గుంటూరు జిల్లా(బాపట్ల)విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు బుధవారం రేషన్‌ దుకాణాల్లో  దాడులు నిర్వహించారు. అందులో భాగంగా ఉప్పుటూరులోని షాప్‌ నెంబర్‌ 40లో రికార్డులో ఉన్న నిల్వల కన్నా అదనంగా 16 బస్తాల రేషన్‌ బియ్యం ఉండటాన్ని గుర్తించినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సీఐ అక్కిశెట్టి శ్రీహరిరావు తెలిపారు. దీంతో షాపు నిర్వాహకుడిపై 6ఎ కేసును నమోదు చేశామన్నారు. ఈకార్యక్రమంలో పర్చూరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ డి.అనిత, వీఆర్వో సుబ్బారావు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-07T04:58:51+05:30 IST