రూ. 400 కోట్లు విలీనం

ABN , First Publish Date - 2022-06-01T06:04:03+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అప్పులు కుప్పలుగా చేసింది. ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తోంది.

రూ. 400 కోట్లు విలీనం

ఘన చరిత్ర మున్సిపల్‌ పాఠశాలల సొంతం.. స్వాతంత్య్రం రాకముందే చాలా ఏర్పాటయ్యాయి.. అధిక భాగం స్థలాలను దాతలు ఇచ్చారు.. వారి త్యాగాలకు పాఠశాలలు చిహ్నాలు.. వాటిలో చదువుకున్న ఎందరో ఉన్నత శిఖరాలకు చేరారు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సైతం గుర్తింపు పొందారు.. అలాంటి వాటిపై వైసీపీ ప్రభుత్వం కన్నుపడింది.. వాటి ఆస్తులను కాజేసేందుకు విలీన పథకం రచించింది.. కొత్త జిల్లాలో రూ.400 కోట్ల విలువైన స్థలాలను కొట్టేసేందుకు పావులు కదుపుతోంది..


మున్సిపల్‌ స్కూళ్ల విలీనం మాటున 

ఆస్తుల స్వాహాకు స్కెచ

డీఈఓ పరిధిలోకి చేర్చుతూ రహస్య ఉత్తర్వులు

ఆమోదం తెలిపిన మున్సిపల్‌ కౌన్సిళ్లు 

ఆందోళనలో విద్యానిపుణులు




హిందూపురం టౌన 

వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అప్పులు కుప్పలుగా చేసింది. ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తోంది. కుదరకుంటే లీజుకిస్తోంది. తాజాగా మున్సిపాలిటీల్లోని రూ.కోట్లు విలువచేసే పాఠశాలల ఆస్తులపై ప్రభుత్వం కన్ను పడింది. వాటిని ధారాదత్తం చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం మునిసిపాలిటీల ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి, పాఠశాలలు నిర్వహించలేమని లేఖలు పంపి, ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని కోరే విధంగా గుట్టుగా వ్యూహాలు అమలు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నగర, మున్సిపాలిటీల్లోని పాఠశాలల విలీనానికి అడుగులు ముందుకు పడ్డాయి. బ్రిటీష్‌ హయాంలో మున్సిపాలిటీల్లో కొన్ని పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 1882 నాటికే కొన్ని ప్రాంతాల్లో పాఠశాలల నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీలకు అప్పగించారు. అప్పట్లోనే పేద ప్రజల అభ్యున్నతికి విద్య ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని, పట్టణంలో పలువురు దాతలు ఎకరాల కొద్దీ పాఠశాలలకు ఉచితంగా భూములు దానం చేశారు. కొన్ని స్కూళ్లకు విశాలమైన క్రీడామైదానాలు కూడా ఉన్నాయి. అలాంటి పాఠశాలలను ప్రస్తుతం విద్యాశాఖలో విలీనం చేసి, స్థలాలను కాజేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు మేధావి వర్గాలు భావిస్తున్నాయి.


ఆమోదం తెలిపిన మున్సిపల్‌ కౌన్సిళ్లు

నగర పాలక సంస్థ, మున్సిపల్‌ పాఠశాలల విలీన ప్రక్రియ గుట్టుగా సాగుతోంది. ఎక్కడా ప్రచారం చేయలేదు. రహస్యంగా కౌన్సిల్‌ ఆమోదించాలని ఉత్తర్వులు వచ్చినట్లు సమాచారం. హిందూపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదిస్తూ తీర్మానం చేసింది. ఈ అంశాన్ని టేబుల్‌ అజెండాగా తీసుకొచ్చారు. ఇదివరకు మున్సిపల్‌ పాఠశాలల నిర్వహణ, వసతుల కల్పన, బదిలీలను మున్సిపాలిటీ చూస్తుండేది. సమస్య ఉంటే వెంటనే మున్సిపల్‌ చైర్మనగానీ, కమిషనర్‌గానీ స్పదించేవారు. ప్రభుత్వ పెద్దలు పర్యవేక్షణ లేదని ఆస్తులు బదలాయించేందుకు సిద్ధమయ్యారు.


టీచర్లను చేర్చమంటే..

మున్సిపల్‌ పాఠశాలల టీచర్లను విద్యాశాఖ పరిధిలోకి తీసుకోవాలని డిమాడ్‌ చేస్తే స్కూళ్ల ఆస్తులను ఎందుకు విలీనం చేసుకుంటున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. హెచఎంలకు డీడీఓ పవర్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే రహస్యంగా ఆస్తులు స్వాధీనం చేసుకోవడం ఏంటని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆమోదం తెలపకూడదని మున్సిపల్‌ అధికారులు, చైర్మన్లకు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటుండడం శోచనీయం.


జిల్లాలో 104 పాఠశాలలు

జిల్లాలో హిందూపురంతోపాటు ధర్మవరం, కదిరి మున్సిపాలిటీల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు కలిపి మొత్తంగా 104 ఉన్నాయి. ఇందులో హిందూపురంలో 32, కదిరిలో 33, ధర్మవరంలో 39 ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు రూ.400కోట్ల ఆస్తులున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. హిందూపురంలో 1903లో ఎంజీఎం పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల 14 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా రూ.10కోట్లు పైగానే పలుకుతోంది. ఆ లెక్కన ఈ పాఠశాల ఆస్తే మార్కెట్‌ ధరల ప్రకారం రూ.100కోట్లకుపైగా ఉంటోంది. 1886లో శారద, 1892లో ఝాన్సీ లక్ష్మీబాయి పాఠశాలలు నెలకొల్పారు. అంటే స్వాతంత్ర్యానికి 64 ఏళ్ల మునుపే హిందూపురంలో పాఠశాలలున్నాయి. ప్రస్తుతం పట్టణంలోని 32 పాఠశాలల్లో 1 మినహా అన్నీ మున్సిపాలిటీకి చెందినవే. వీటి విలువ రూ.200కోట్లకుపైగానే ఉంటుంది. ఇక కదిరి, ధర్మవరంలో కూడా తక్కువలో తక్కువ అన్నా.. రూ.వందేసి కోట్లు పలికే ఆస్తులున్నాయి. ఈ లెక్కన రూ.400 కోట్ల ఆస్తులు విలీనం చేసుకోవడానికి ఇది ఎత్తుగడ అని విద్యావేత్తలు భావిస్తున్నారు.


ఆస్తులు ఎందుకు?

చిన్న మార్పులు చేస్తే మున్సిపల్‌ విద్య గాడిలో పడుతుందని మేం భావించాం. ఉపాధ్యాయులను విద్యాశాఖలోకి చేర్చమంటే ఆస్తులను బదలాయించడం సరికాదు. హెచఎంను పట్టణ విద్యాశాఖ అధికారిగా నియమించి, ఉన్నత పాఠశాల హెచఎంలకు డీడీఓ బాధ్యతలు అప్పగించాలి. పాఠశాలల విలీనంపై మున్సిపల్‌ కౌన్సిళ్లు తీర్మానాలు చేసి పంపడం అనుమానాలకు తావిస్తోంది. విద్య, వైద్యం స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. విద్యను స్థానిక సంస్థల నుంచి లాక్కోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే.

- సిద్దిగిరి శ్రీనివాస్‌, ఏపీఎంటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి


ఆస్తులను కాజేయడానికే..

మున్సిపాలిటీల్లోని కోట్లాది రూపాయల విలువచేసే భూములను కాజేయడానికి విలీన ప్రక్రియకు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే కొన్ని వ్యవస్థలకు సంబంధించిన భూములు తమ అనుయాయులకు పాలకులు ధారాదత్తం చేశారు. ఇదికూడా అందులో భాగమే. ప్రభుత్వం విలీన నిర్ణయాన్ని విరమించుకోకపోతే ఉద్యమం చేపడతాం.

- బాబావలి, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి


Updated Date - 2022-06-01T06:04:03+05:30 IST