Abn logo
Oct 20 2021 @ 10:20AM

వైగో తనయుడికి పార్టీ పదవి?

చెన్నై(chennai): సీనియర్‌ నేత వైగో నేతృత్వంలోని ఎండీఎంకేకి వారసుడు రావడం ఖాయమైపోయిందా?.. కాదుకాదంటున్నా కొడుక్కి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు వైగో సిద్ధమయ్యారా?.. ఇన్నాళ్లూ పార్టీకి అంటీముట్టనట్టుగా వున్న ఆయన కుమారుడు దురై వయ్యాపురి కూడా ఇప్పుడు ముందుకొచ్చేందుకు సమ్మతించారా?.. అవుననే అంటున్నాయి ఆ పార్టీ విశ్వసనీయవర్గాలు. ఆ మేరకు బుధవారం జరిగే పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం వెలువడనున్నట్టు తెలుస్తోంది. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన ఎండీఎంకే ప్రస్తుతం పార్టీ భవిష్యత్‌ను కాపాడుకునేందుకు వారసుడిని తెరమీదకు తెచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జరుగనున్న ఎండీఎంకే జిల్లా శాఖ కార్యదర్శులు, రాష్ట్ర నాయకుల సమావేశంలో దురై వయ్యాపురికి కీలకమైన పదవిలో నియమించడానికి రంగం సిద్ధమైంది. గత శాసనసభ ఎన్నికల్లో వైగోకు తోడుగా దురై వయ్యాపురి తీవ్ర ప్రచారం చేశారు. గత నెల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో దురై వయ్యాపురి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలందరూ కోరుకుంటే ప్రజాభీష్టం మేరకు రాజకీయ ప్రవేశం చేస్తానని ప్రకటించారు. ఈ విషయమై వైగో గత కొద్ది రోజులుగా పార్టీ సీనియర్‌ నేతలతో చర్చలు కూడా జరిపారు. సీనియర్‌ నేతలందరూ దురై వయ్యాపురికి పార్టీలో కీలకమైన పదవిని అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జరుగనున్న జిల్లా నేతల సమావేశంలో దురై వయ్యాపురిని పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శిగా నియమించనున్నారని తెలిసింది. తొలుత పార్టీ కోశాధికారి పదవిని ఇవ్వాలని పార్టీ నేతలు సూచించారు. కానీ వైగో పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శిగా దురై వయ్యాపురి నియమించాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

జాతీయంమరిన్ని...