అవును.. మునిగాం!

ABN , First Publish Date - 2022-01-19T07:29:28+05:30 IST

అవును.. మునిగాం!

అవును.. మునిగాం!

రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు

పరోక్షంగా అంగీకరించిన జగన్‌ సర్కారు

ఉద్యోగుల వేతనాల్లో కోతతో సంకేతాలు

ముందే హెచ్చరించిన ‘ఆంధ్రజ్యోతి’

ఆ అధికరణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందా?

వేతనాలు, అలవెన్సుల్లో కోతే నిదర్శనం

ఆర్థిక నిపుణుల స్పష్టీకరణ

360 అధికరణ చెబుతోందదే!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆర్థికంగా అతలాకుతలమైపోయి, పరిస్థితులన్నీ అదుపు తప్పి... మరో మార్గంలేకపోతే ‘ఆర్థిక అత్యవసర పరిస్థితి’ విధిస్తారు. ఇందులో భాగంగా ఉద్యోగుల వేతనాలకు కోత పెడతారు.  ‘రివర్స్‌ పీఆర్సీ’లో జీతాలను తగ్గించేసిన జగన్‌ సర్కారు తనకు తానే అప్రకటిత ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించుకుంది. పరిస్థితులు చేజారిపోయినట్లు చెప్పకనే చెప్పింది. దేశంలో లేదా ఏదైనా రాష్ట్రంలో ఎక్కడైనా శాంతిభద్రల పరిస్థితి అదుపుతప్పితే ఎమర్జెన్సీ విధిస్తారు. ప్రజల ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసి పరిస్థితులను చక్కదిద్దుతారు. అదే విధంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనప్పుడు ఆర్థిక ఎమర్జెన్సీ విధించే వెసులుబాటును రాజ్యాంగంలోని 360 అధికరణ కల్పించింది. గత కొంతకాలంగా జగన్‌ ప్రభుత్వం అనాలోచితంగా చేస్తున్న అప్పులు, ఖర్చులు.. రాబడుల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాల్సిన  పరిస్థితులు ఏర్పడ్డాయని ‘ఆంధ్రజ్యోతి’ కొద్దికాలం కిందే హెచ్చరించింది. అప్పట్లో దానిని తేలిగ్గా తీసుకున్నవారంతా సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వంజారీచేసిన పీఆర్‌సీ ఉత్తర్వులు చూశాక.. ‘ఆంధ్రజ్యోతి’ అప్పుడే వాస్తవాలు చెప్పి హెచ్చరించిందని అంగీకరిస్తున్నారు.


అడ్డదిడ్డంగా ఖర్చులు చేసి..

ఏ ప్రభుత్వమైనా ఆదాయాన్ని, ఖర్చులను సమపాళ్లలో నియంత్రించుకుంటూ వెళ్లాలి. రాబడి కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చును నిర్దేశించుకోవడం తప్పుకాదు. కానీ ఆదాయంతో సంబంధం లేకుండా అడ్డదిడ్డమైన ఖర్చులు చేసేసి.. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జగన్‌ సర్కారు వవ్యహరిస్తోంది. కచ్చితంగా చెప్పాలంటే.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆర్ధిక ఎమర్జెన్సీ విధింపునకు అనువుగానే ఉన్నాయి. కానీ జగన్‌ ప్రభుత్వం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లావేళ్లాపడి కాలం నెట్టుకొస్తోంది. దీనినీ ఎంతోకాలం దాచలేకపోయారు. సోమవారం నాటి పీఆర్‌సీ జీవోల ద్వారా ఆర్థిక ఎమర్జెన్సీ విధించినట్లు పరోక్షంగా అంగీకరించినట్లయింది. ఎక్కడైనా ఆర్థిక ఎమర్జెన్సీ విధించిన సందర్భాల్లోనే ఉద్యోగులు జీతభత్యాల్లో కోత విధించడానికి రాజ్యాంగంలోని 360 (4)(ఏ)(1) అధికరణ వెసులుబాటు కల్పించింది. బహుశా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జగన్‌ సర్కారు ఉద్యోగుల వేతనాలు, అలవెన్సుల్లో భారీ కోత విధించింది. అంటే ఆర్టికల్‌ 360ని ఈ రకంగా ఉపయోగించుకుందన్నమాట. తద్వారా తన డొల్లతనాన్ని బట్టబయలు చేసుకుంది.


360 ఏం చెబుతోంది..? 

‘ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు దేశంలో అత్యవసర ఆర్థిక పరిస్థితిని విధించేందుకు రాష్ట్రపతికి అధికారమిచ్చేదే ఆర్టికల్‌ 360. దీని ద్వారా రాష్ట్రాలు తమ ఆర్థిక వనరులను ఎలా వినియోగించుకోవాలో ఆదేశించే అధికారం కేంద్రానికి దఖలుపడింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు కూడా ఈ ఆర్టికల్‌ ఉపయోగపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు, లేదా దేశంలోని ఏదైనా ప్రాంతానికి చెందిన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉందని రాష్ట్రపతి భావిస్తే అధికారిక ప్రకటన ద్వారా ఆయన దీనిని అమల్లోకి తీసుకురావచ్చు. ఒకవేళ ఆర్టికల్‌ 360ని అమల్లోకి తీసుకొస్తే ఆ తర్వాతి రెండు నెలల వరకు లేదా రాష్ట్రపతి దానిని రద్దుచేసినట్లు ప్రకటించే వరకు ఇది అమల్లో ఉంటుంది. రెండు నెలలకు మించి పొడిగించాల్సి వస్తే పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలి. 360(4)(ఏ)(1) అధికరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులందరి.. లేదా ఒక సెక్షన్‌ ఉద్యోగుల వేతనాల్లో కోతపెట్టవచ్చు. అసెంబ్లీలో చేసిన తీర్మానం రాష్ట్రపతి ఆమోదం పొందాక అమల్లోకి వస్తుంది’ అని 360 అధికరణ చెబుతోంది. రాష్ట్రంలో దాదాపుగా దివాలా తీసే పరిస్థితి ఉన్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించాకే రాష్ట్రపతి ఆమోదంతో సదరు అధికరణను అమలు చేస్తుంది. కానీ జగన్‌ సర్కారు కేంద్రంతో సంబంధం లేకుండానే చడీచప్పుడు కాకుండా జీతాల్లో కోతపెట్టి పరోక్షంగా ఆర్టికల్‌ 360ని ప్రయోగించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా అదుపుతప్పి పల్టీలు కొడుతోందని స్పష్టమవుతోందని అంటున్నారు. పరోక్షంగా ఆర్థిక ఎమర్జెన్సీ అమలు చేసే బదులు నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని శరణువేడితే తప్ప రాష్ట్రం గట్టెక్కదని స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2022-01-19T07:29:28+05:30 IST