చంఢీగర్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన అమరిందర్ సింగ్..‘‘అవును.. నేను కొత్త పార్టీ పెడుతున్నా’’ అని ప్రకటించారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రాగానే పార్టీ పేరును, గుర్తును కూడా ప్రకటిస్తానని కెప్టెన్ చెప్పారు. తన న్యాయవాదులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారని అమరిందర్ సింగ్ తెలిపారు. సమయం వస్తే మొత్తం 117 సీట్లలో కూడా తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని వెల్లడించారు. ఒకవేళ బీజేపీతో కలిసి పోటీ చేయాల్సి వస్తే సీట్ల సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. పంజాబ్లో శాంతిని నెలకొల్పడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని కెప్టెన్ పేర్కొన్నారు.